
మీ..అపర్ణ వర్మ అల్లరి పిల్ల
బెజవాడలో పుట్టిన ఈ బుల్లెమ్మకు సిటీకొచ్చాకే లైఫ్ టర్న్ అయింది. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ వచ్చిన ఈ అమ్మాయి స్టైల్ మార్చేసింది హైదరాబాదే. చిన్నప్పుడు అల్లరి పిల్లగా.. స్కూల్ డేస్‌లో కిలాడీ పిల్లగా.. కాలేజ్ గాళ్‌గా ఫ్యాషన్ మంత్రం పఠించిన ఈ ముద్దుగుమ్మ నటిగా, యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న అపర్ణ వర్మ ‘మీ’ అంటూ ‘సిటీప్లస్’తో ముచ్చటించింది.
- శిరీష చల్లపల్లి
నేను పుట్టింది, పెరిగింది విజయవాడలోనే. డిగ్రీ వరకూ అక్కడే చదివాను. మా అక్క వాళ్లు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉండేవాళ్లు. మా నాన్న లారీ ట్రాన్స్‌పోర్టర్. అమ్మ హోమ్ మేకర్. తమ్ముడికి నాకు ఏజ్‌లో పెద్ద తేడా లేదు. ఇద్దరం మాక్ అసెంబ్లీ ఆడుకునేవాళ్లం. టవల్ భుజానికి కట్టుకుని, చేతిలో ఇడ్లి పాత్ర పట్టుకుని, ఇంకో చేత్తో అట్లకాడ పట్టుకుని రాజుల్లా యుద్ధాలు చేసేవాళ్లం.
కిలాడీయోంకా కిలాడీ
చిన్నప్పుడు అబ్బాయిలతో సమానంగా అల్లరి చేసేదాన్ని. స్కూల్‌లో కోకో చాంపియన్‌ని కూడా. మా ఇల్లు స్కూల్ దగ్గరలోనే ఉండేది. మా ఫ్రెండ్స్ లంచ్ బాక్స్‌లు తెచ్చుకునేవాళ్లు. ఫస్ట్ పీరియడ్‌లోనే వాళ్ల బాక్స్‌ల్లోని ఐటమ్స్ టేస్ట్ చేసేసేదాన్ని. లంచ్ బ్రేక్‌లో బాక్స్ తెస్తానని ఇంటికి వెళ్లి తినేసి వచ్చేదాన్ని. అందుకే నేను కాస్త బొద్దుగా ఉండేదాన్ని. చదువు కంటే డ్యాన్సులు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది.
ఫ్యాషన్ మంత్ర..
డిగ్రీ అయిపోయాక ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ చేయడానికి ఫస్ట్‌టైమ్ సిటీకి వచ్చాను. హైటెక్ సిటీ, నిఫ్ట్ కాలేజీ పక్కన గవర్నమెంట్ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్‌లో చేరాను. కోర్సు చేస్తుండగానే జాబ్ ఆఫర్స్ వచ్చాయి. రీబాక్ స్టోర్స్‌లో మేనేజర్‌గా కొన్నాళ్లు పని చేశాను. ఓసారి మా ఫ్యామిలీతో కలసి రామోజీ ఫిలింసిటీకి వెళ్లాను. అక్కడ నన్ను చూసిన లారెన్స్.. ‘స్టైల్ సిని మాలో నటిస్తావా’ అని అడిగారు. ముందు ఆశ్చర్యపోయాను. మా పేరెంట్స్ కూడా వద్దన్నారు. దాంతో ఊరుకున్నాను.
12 కిలోలు తగ్గాను..
వెండితెరపై వెతక్కుండా వచ్చిన అవకాశం.. అలా వెళ్లిపోయింది. తర్వాత మూడు నెలలు యాంకరింగ్ కోర్స్ నేర్చుకున్నాను. కానీ నేను చాలా బొద్దుగా ఉండటంతో నన్ను న్యూస్ రీడింగ్‌కు రిజెక్ట్ చేశారు. నేను దాన్నొక చాలెంజ్‌గా తీసుకున్నాను. రోజుకు 8 గంటలు జిమ్‌లో ఎరోబిక్స్ చేశాను. 45 రోజుల్లో 12 కిలోలు తగ్గాను. ఆ తర్వాత అదే చానల్‌కు వెళ్తే.. అంతా ఆశ్చర్యపోయి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. అలా జెమినీ, మా, ఈ టీవీలలో యాంకర్‌గా పలు ప్రోగ్రామ్స్ చేశాను.. చేస్తున్నాను. టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాను.
ఎంత మార్పో..
సిటీకి వచ్చిన కొత్తలో.. ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ఫ్లైఓవర్లు, మల్లీప్లెక్స్‌లు.. పదేళ్లలో ఎంతో చేంజ్. సిటీ ఫుడ్ టేస్ట్ సూపర్బ్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 365 డేస్ హలీమ్ దొరికే స్టాల్ ఉంటుంది. అక్కడ హలీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉండే చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఫుడ్ భలే రుచిగా ఉంటుంది. ఇక నాకు చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే కూడా గొప్ప నమ్మకం. వినాయకచవితి పండుగకు రకరకాల లంబోదరుడి విగ్రహాలు భలేగా ఉంటాయి. ఖైరతాబాద్‌లోని మహా వినాయకుడిని చూడటం మాత్రం మిస్సవ్వను.