ఢిల్లీ వాసులు ఇచ్చిన తీర్పుతో రాజకీయ పార్టీలు తలపట్టుకుంటున్నాయి. పదిహేనేళ్లుగా రాజ్యం ఏలుతున్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించడం వరకు అందరూ సంతోషంగానే కనిపించినా, ఇటు బీజేపీకి గానీ, అటు ఆమ్ ఆద్మీ పార్టీకి గానీ ప్రజలు స్పష్టమైన మాండేట్ ఇవ్వలేదు. 31 స్థానాల వద్ద బీజేపీని, 28 స్థానాల వద్ద ఆప్ను ఆపేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కనీసం రెండంకెల స్థాయిని కూడా అందుకోలేక పూర్తిగా చతికిలపడింది. ఆ పార్టీకి కేవలం 8 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక జేడీ(యూ), శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఒక్కో స్థానాన్ని పంచుకోగా, మరో స్వతంత్ర సభ్యుడు కూడా గెలుపొందారు. వీళ్లలో బీజేపీకి ఎటూ అకాలీదళ్ పార్టీ ఎన్డీయే భాగస్వామి కాబట్టి మద్దతిస్తుంది. స్వతంత్ర సభ్యుడు కూడా సరేనన్నాకూడా మరో ముగ్గురు సరేనంటే తప్ప ప్రభుత్వం కొనసాగే పరిస్థితి లేదు. ఇందుకోసం బీజేపీ ఏం చేస్తుందో చూడాల్సి ఉంటుంది.
ఢిల్లీవాసులకు తాము మంచి ప్రభుత్వాన్ని అందజేస్తామంటున్న ఆ పార్టీ నాయకులు.. కొనుగోళ్లు, బేరసారాలకు మాత్రం దిగబోమని చెబుతున్నారు. ఒకవేళ అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం వచ్చినా, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునే విషయంలో మాత్రం ఆటంకాలు తప్పవు. మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ జేడీ(యూ) ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసింది. అందువల్ల ఆ పార్టీ నుంచి మద్దతు ఆశించడం అనవసరం. అంటే అటు కాంగ్రెస్ నుంచి గానీ ఇటు ఆప్ నుంచి గానీ కనీసం ముగ్గురు బీజేపీ సర్కారుకు సరేననాలి.
అయితే తాము బీజేపీకి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ మద్దతిచ్చే ప్రసక్తి లేదని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగానే వ్యవహరిస్తామని ఆప్ నాయకులు ఇప్పటికే చెబుతున్నారు. 28 స్థానాలున్న తమను ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించినా, ఇంత తక్కువ స్థానాలతో తాము ప్రభుత్వం ఏర్పాటుచేయడం సాధ్యం కాదనే చెబుతామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య బద్ధవైరం ఉంది కాబట్టి అటునుంచి ఏదో రూపంలో మద్దతు వస్తుందని ఆశించడం అనవసరం. ఆప్ నుంచి కూడా మద్దతు రాకపోవచ్చు. అయితే.. ఒకవేళ కాంగ్రెస్ లేదా ఆప్లలో ఎవరైనా కొంతమంది సభ్యులు విశ్వాసపరీక్ష రోజున అసెంబ్లీకి హాజరు కాకపోవడం లేదా ఓటు వేయకపోవడం చేస్తే మాత్రం ప్రస్తుతానికి బీజేపీ సర్కారు గట్టెక్కచ్చు. కర్ణాటక తరహా మంత్రాలు ఏవైనా వేస్తే మాత్రం ఎటునుంచైనా కొందరు సభ్యులను లాక్కుని, వాళ్లు అనర్హులైన తర్వాత మళ్లీ బీజేపీ టికెట్లపై గెలిపించి సాధారణ మెజారిటీ సాధించే చాన్సు సైతం ఉండనే ఉంది. రాజకీయ తెరపై ఏం జరుగుతుంతో చూడాలి మరి!!
హస్తిన గద్దెపై ఆసీనులయ్యేది ఎవరో!
Published Mon, Dec 9 2013 2:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement
Advertisement