హైదరాబాదీ అబ్బాయి.... | Drama industry to make help in joint of couple for long life | Sakshi
Sakshi News home page

హైదరాబాదీ అబ్బాయి....

Published Wed, Aug 27 2014 12:54 AM | Last Updated on Thu, Apr 4 2019 3:21 PM

హైదరాబాదీ అబ్బాయి.... - Sakshi

హైదరాబాదీ అబ్బాయి....

‘మూవీస్ విల్ మేక్ యు ఫేమస్.. టెలివిజన్ విల్ మేక్ యు రిచ్..
 బట్ థియేటర్ విల్ మేక్ యు గుడ్’ అంటాడు అమెరికన్ థియేటర్ డెరైక్టర్ టెర్రెన్స్‌మన్!
 ఆ మాటలను నమ్మినట్టు కనిపించే ఈ జంటకు రంగస్థలమే జీవితం !
 మహ్మద్ అలీబేగ్.. హైదరాబాదీ.. థియేటర్ ఆర్ట్స్‌లో పద్మశ్రీ గ్రహీత!
 ఆమె పేరు నూర్‌బేగ్.. చెన్నై వాసి.. షార్ట్‌స్టోరీ రైటర్ !
 రెండు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరినీ ఒక్కటి చేసింది నాటకరంగమే.
 హావభావాల్లా ఒదిగిపోయిన ఈ జంట గురించి..

 
 హైదరాబాద్‌లో..
 మహ్మద్ అలీ బేగ్.. పుట్టింది పెరిగింది రంగస్థల నేపథ్యంలోనే. తండ్రి ఖాదిర్ అలీ బేగ్ నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బేగ్ నాటకాల్లో ఆరితేరారు. తండ్రే స్ఫూర్తిగా ఆయన పేరిట థియేటర్ ఫౌండేషన్ నెలకొల్పారు. యాక్టర్, డెరైక ్టర్‌గానే కాదు రైటర్‌గా కూడా రాణిస్తూ.. హైదరాబాద్ సంస్కృతిని చాటుతున్నారు.
 
 చెన్నైలో..
 ఓ తమిళ ముస్లిం జంట గారాల పట్టి నూర్. స్టెల్లా మేరీ కాలేజ్‌లో విజువల్ ఆర్ట్స్ అండ్  ఫారిన్ అఫైర్స్‌లో మాస్టర్స్ చేసి గోల్డ్‌మెడల్ అందుకుంది. షార్ట్ స్టోరీస్ రాయడం హాబీగా ఉన్న నూర్ కొన్నాళ్లు ఆస్ట్రేలియన్ కాన్సులేట్‌లో ఉద్యోగం చేసింది.
 
 తొలిచూపులు..
 2013.. హైదరాబాద్‌లో ఆస్ట్రేలియన్ థియేటర్ ఫెస్టివల్ జరిగింది. దీనికి  చెన్నైలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ అన్ని ఏర్పాట్లు చే సింది. దీనికి అలీబేగ్, వాళ్లమ్మ కూడా హాజరయ్యారు. ఆ వేడుకలోనే కామన్ ఫ్రెండ్ ద్వారా నూర్, బేగ్‌ల మధ్య పరిచయం చిగురించింది. ఆ టైంలో ఆ అమ్మాయి అతని దృష్టిని ఎంత వరకు ఆకర్షించిందో తెలియదు కానీ.. బేగ్ వాళ్లమ్మ మాత్రం ‘ప్యారీ లడ్‌కీ’గా ముద్రవేసింది.
 
 పర్యాటక నాటకం..
 చిరంజీవి కేంద్ర టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వీళ్ల పరిచయాన్ని ముందుకు తీసుకెళ్లింది. అంతర్జాతీయ పర్యాటక ఉత్సవంలో ‘ఖులి దిలోంకా షహజాదా’ నాటకం ప్రదర్శించాలని చిరంజీవి అలీబేగ్‌ని కోరారు. అదీ ఉత్సవానికి 20 రోజుల ముందు. సరిపడా టైం లేకపోవడంతో బేగ్ కష్టమన్నారు. మీరు ఎలాగైనా ప్రదర్శించాలని చిరంజీవి ఒత్తిడి చేయడంతో ఓకే అన్నారు. ఖులి దిలోంకా షహజాదా.. అలీ బేగ్ తండ్రి ఎప్పుడో డైబ్భయ్‌లలో రాసి, వేసి పండించిన నాటకం. దాన్ని అలాగే ప్రదర్శిస్తే ఈ తరం చూస్తారా..? అనుకున్న బేగ్ ఈ కాలానికి తగ్గట్టుగా నాటకాన్ని రీరైట్ చేయించాలనుకున్నారు.

 అందుకోసం ఎందరిని సంప్రదించినా.. టైం సరిపోదనే సమాధానమే వచ్చింది. అప్పుడు బేగ్‌కి నూర్ గుర్తొచ్చింది. ఫోన్ చేసి విషయం చెప్పి.. ఉర్దూలో నాటకం రాయమన్నారు. షార్ట్ స్టోరీస్ రాసే తనను నాటకం రాయమనడమేంటని నూర్ అవాక్కయింది. తర్వాత బేగ్ సలహాలు, సూచనలతో నాటకాన్ని రీరైట్ చేసింది. భాగమతి రోల్‌కు సరైన నటి దొరకక ఆ పాత్ర ఆమెను వరించి నాటకరంగంలో అడుగుపెట్టేలా చేసింది.
 
 నాటకం నుంచి జీవితంలోకి..
 రంగస్థలంపై భాగమతిగా నాటకంలో భాగం పంచుకున్న నూర్..  తర్వాత బేగ్ భాగ్యమతిగా జీవితాన్ని పంచుకుంది. నూర్ అంటే మెరుపు.. అన్నట్టుగానే బేగ్ జీవితానికి మెరుపు తునకైంది నూర్. ‘ప్రొఫెషన్‌లో నేను చాలా కచ్చితంగా ఉంటాను. కొంచెం తేడా వచ్చినా అరిచేస్తాను. నా స్వభావం మార్చడానికి మా అమ్మ ఎన్నోసార్లు ప్రయత్నించింది. అయినా మారలేదు. కానీ నూర్ నా లైఫ్‌లోకి వచ్చిన మూడు నెలల్లోనే నా కోపం తగ్గింది. కూల్‌గా ఆలోచించడం మొదలు పెట్టాన’ని అంటారు బేగ్. ‘స్టూడెంట్ లైఫ్‌లో ఓసారి ఇంగ్లిష్ థియేటర్‌లో పార్టిసిపేట్ చేశాను. ఈయనను పెళ్లి చేసుకున్నాకే థియేటర్ ప్రొఫెషనల్‌గా మారాను. హి ఈజ్ మై గురు అండ్ గైడ్. ప్రొఫెషన్‌పై ఆయనకున్న సీరియస్‌నెస్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది’ అని నూర్ వివరిస్తుంది.
 
 భావాలు.. భాషలు..
బేగ్ తనకు తెలిసినతెలుగును నూర్‌కి నేర్పితే.. ఆమెకు వచ్చిన తమిళంలో బేగ్‌ను ఫ్లూయెంట్‌గా మలచాలని తపనపడ్తోంది నూర్. ఇలా భాషలను, భావాలను ఇచ్చిపుచ్చుకుని ట్రావెల్ చేస్తూ.. థియేటర్ స్టేజ్ మీదే కాకుండా సిల్వర్ స్క్రీన్ మీదా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించు కోవాలనుకుంటున్నారు ఈ ఇద్దరు.
 
 బంధమే.. బంధనం కాదు..
 పెళ్లి తమను వృత్తిపరంగా ఎదిగేలా చేస్తోందని ఇద్దరూ భావిస్తారు. పెళ్లంటే ఎగిరే పక్షిని పంజరంలో బంధించడం కాదు.. పంజరంలోని పక్షిని స్వేచ్ఛగా వదిలేయడం అంటారు ఇద్దరు. వీరి మధ్య అసూయల్లేవు. ఒకరి విజయం ఇంకొకరి కృషికి గుర్తింపుగా భావిస్తారు. నూర్ పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌కు తన అద్భుత నటనతో ప్రాణం పోస్తాడు బేగ్. నూర్ అందానికి, అభినయానికి అందే అభినందనలు.. తను నేర్పిన విద్యకు గుర్తింపని ఆయన పొంగిపోతారు. ‘నా మనసులో ఉన్న సన్నివేశాన్ని చదివినట్టే నూర్ దానికి అక్షరరూపమిస్తుంది’ అని బేగ్ అంటారు. ‘నేను మొదలు పెట్టిన వాక్యానికి నేననుకున్న ముగింపునే ఆయనిస్తాడు.. ముందే తెలిసినట్టు’ అని కలసిన వాళ్ల వేవ్‌లెంగ్త్‌ను మెరిసే కళ్లతో చెప్తుంది నూర్. ‘మాకు స్టేజ్.. ఇల్లు రెండూ ఒకటే. భార్యాభర్తల్లా కంటే డెరైక్టర్, రైటర్స్‌లాగే ఉంటాం. మా మధ్య సాగే అలకలు, జగడాలు.. వర్క్ పర్‌ఫెక్షన్‌కు హెల్ప్ అవుతాయి. థియేటర్ మా ప్రదర్శనకే కాదు.. మా ప్రేమను పెంచే వేదిక. అందుకే
 వివాహం మాకు బంధనం కాదు.. అనురాగ బంధం. ఎవరిస్పేస్ వాళ్లకు మిగిల్చే ఓపెన్ ఎయిర్. ఒకరిపై మరొకరికి రెస్పెక్ట్‌ని పెంచే డయాస్’ అని చెప్తారు.
 - సరస్వతి రమ
 ఫొటోలు: సృజన్ పున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement