బస్సు ప్రమాదాలలో డ్రైవర్ల అప్రమత్తతే కీలకం
బస్సు ప్రమాదాలు.. ముఖ్యంగా బస్సులు తగలబడిపోవడం లాంటి సంఘటనలు జరిగినప్పుడు డ్రైవర్లు ఏమాత్రం కొంత అప్రమత్తంగా ఉన్నా భారీ ప్రాణనష్టాలు తప్పుతాయి. అదే, వాళ్లు అజాగ్రత్తగా ఉంటే మాత్రం బుధవారం నాటి కొత్తకోట తరహా ఘోరాలు తప్పవు. గతానుభవాలను బట్టి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
గతంలో.. ఇదే సంవత్సరం ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ సమీపంలో గల అంబర్ పేట వద్ద ఎస్వీఆర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు కూడా ఒకటి తగలబడిపోయింది. కాకినాడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఆ బస్సు పెద్ద అంబర్ పేట ప్రాంతం చేరుకునేసరికి ఏసీలో గ్యాస్ లీకవ్వడం వల్లే మంటలు చెలరేగాయని అప్పట్లో చెప్పారు.
అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వెంటనే బస్సు ఆపి, 40 మంది ప్రయాణికులందరినీ దించేయడం, అగ్ని మాపక దళ సిబ్బంది కూడా సకాలంలో స్పందించి అక్కడకు చేరుకోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని వాళ్లే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో అక్కడినుంచి నగరంలోని గమ్యస్థానాలకు చేర్చారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని కూడా అప్పట్లో నిపుణులు చెప్పారు. బస్సు బయల్దేరేముందే ఇన్సులేషన్, ఏసీ గ్యాస్, బస్సు కండిషన్ లాంటివి వెంటనే పరిశీలించుకోవాలి. లేనిపక్షంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని చెప్పారు. కానీ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు కేవలం లాభాపేక్షతో వ్యవహరిస్తున్నాయే తప్ప, ఇద్దరు డ్రైవర్లను నియమించడం, బస్సు మొత్తాన్ని బయల్దేరేముందు చెక్ చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు.
మరికొన్ని బస్సు ప్రమాదాలు
ఏప్రిల్ 27, 2011: శంషాబాద్ విమానాశ్రయం నుంచి నగరానికి ప్రయాణికులను తీసుకెళ్తున్న ఎయిరో ఎక్స్ ప్రెస్ నుంచి ఆకస్మికంగా మంటలొచ్చి ఆ బస్సు దగ్ధమైంది. శంషాబాద్ పరిధిలోని పాతంరాయి వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే, అప్పట్లో బస్సులో ఒక్కరే ప్రయాణికుడు ఉండటం, అతడిని కూడా డ్రైవర్ అప్రమత్తం చేయడంతో వెంటనే దిగిపోయారు. బస్సు డ్రైవర్ జయరాజ్ మంటలు గమనించి వెంటనే బస్సు ఆపేశారు. అయితే, ఫైరింజన్ వచ్చేలోపే బస్సు మాత్రం మొత్తం తగలబడిపోయింది.
నవంబర్ 2, 2009: చిత్తూరు పాత బస్టాండ్లో నిలిపి ఉన్న బస్సులో ఇంజన్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. బస్సు మంటలో చిక్కుకోవడంతో ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.