
భువనేశ్వర్/కటక్: ఒడిశా రాష్ట్రం కటక్‌లోని మహానది వంతెన పైనుంచి మంగళవారం సాయంత్రం బస్సు బోల్తాపడిన ఘటనలో ఏడుగురు మృత్యువాత పడగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. డీజీపీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ శర్మ తెలిపిన వివరాల మేరకు..అనుగుల్ జిల్లా తాల్చేరు నుంచి కటక్ నగరానికి వస్తున్న జగన్నాథ్ అనే ప్రైవేట్ బస్సు కటక్‌లోని మహానది వంతెనపై వస్తున్న దున్నపోతును తప్పించే క్రమంలో దాన్ని ఢీకొని..అనంతరం 30 అడుగుల పైనుంచి నది పక్కకు పడిపోయింది. ఘటనలో ఏడుగురు ప్రయాణికులు, దున్నపోతు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కళాశాల
ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర పోలీసు, అగ్నిమాపకదళం, విపత్తు స్పందనదళం (ఒడ్రాఫ్) జవాన్లు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల్ని ఆదుకోవడంలో తలమునకలయ్యారు. చీకటి పడడంతో సహాయ, పునరుద్ధరణ చర్యలకు అంతరాయం ఏర్పడింది. బాధితుల వివరాల కోసం 6712304001లో సంప్రదించాలని డీజీపీ తెలిపారు.