ఫూల్స్ డే
ఏప్రిల్ ఫస్ట్.. ఫూల్స్‌డే! ప్రాక్టికల్ జోక్స్‌తో ఫ్రెండ్స్‌ని ఫూల్స్ చేస్తాం. లేదంటే ఎవరో ఒకరి చేతిలో ఫూల్స్ అవుతాం. కానీ చిన్నచిన్న మిస్టేక్స్‌తో, మన బిహేవియర్‌తో మనల్ని మనమే ఫూల్స్‌ని చేసుకుంటున్న సందర్భాలు సిటీలో నిత్యకృత్యమవుతూనే ఉన్నాయి. ‘మెట్రో సిటిజన్’గా మనమెంత హుందాగా ఉంటున్నాం? మన డిసిప్లేన్ ఎలా ఉందో ఒక్కసారి రివ్యూ చేసుకుంటే..
..:: కేకే
చెత్తకుండీ దాకా వెళ్తాం. చెత్తను కుండీలో కాకుండా బయట పడేస్తాం. చెత్త ఎత్తేవాళ్లకు ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని
మరుస్తాం.
ట్రాఫిక్ సిగ్నల్ జంప్‌చేస్తే ఎదురుగా వచ్చేవారికి ఇబ్బంది. అయినా పట్టించుకోం. ‘ఎదురే నాకు లేదు.. నన్నెవరూ ఆపలేరు’ అని ఈల వేసుకుంటూ బ్రేక్ వేయకుండా దూసుకెళ్తాం.
రూల్స్ బ్రేక్ చేయడమే ట్రెండ్ అనుకుంటాం. నియమాలు పాటించక నగరవాసులు జరిమానాగా ఏటా రూ. కోట్లాది రూపాయలు చెల్లించడమే ఇందుకు నిదర్శనం.
రోడ్డు దాటే పిల్లలు, వృద్ధులకోసం... కాసేపు ఆగాలన్న ఆలోచన రాదు. నా దారి రహదారి అనుకుంటూ ముందుకు పోతాం.
‘డోంట్ స్ప్లిట్ హియర్’ అని ఉన్న దగ్గరే ఉమ్మి వస్తుంది. రాసి ఉన్నది చదివి మరీ ఉమ్మేస్తాం. బస్సులోనో, ఇతర వెహికిల్స్‌లోనో వెళ్తూ పక్కన ఉన్నవారిని పట్టించుకోం. అంతేనా... గవర్నమెంట్ ఆఫీసులు, ఆస్పత్రుల పరిస్థితి చెప్పక్కర్లేదు. స్టెప్స్ ఎక్కే దగ్గర మూలల్లో ఎర్రని రంగేస్తాం.
ఇక పార్కుల పరిస్థితి మరీ అధ్వాన్నం. ‘యూజ్‌మీ’ అంటూ డస్ట్‌బిన్ నోరెళ్లబెట్టి చూస్తున్నా... మన చేతిలోని చెత్తమాత్రం లాన్‌లోనే పడుతుంది!.
స్కూల్, హాస్పిటల్ జోన్లలో హారన్ కొట్టకూడదన్న నిబంధన ఉంది. అయినా ధిక్కరిస్తాం. మనం ఉల్లంఘనులమని ఘంటా బజాయించి మరీ చాటుతాం! ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
‘బ్రాండ్ హైదరాబాద్’ను క్రియేట్ చేసే దిశగా పయనిస్తున్న మనం.. కనీసం స్ట్రీట్స్‌ను నీట్‌గా ఉంచుకోలేకపోతున్నాం. తెలిసీ.. తెలియక చేస్తున్న పొరపాట్లు మనల్ని చిన్నబుచ్చుతాయి. ఈ ఫూల్స్‌డే నుంచైనా ఇటువంటి వాటికి గుడ్‌బై చెబుదాం!