దారి తప్పిన జీవితాల్లో..దివ్యమైన వెలుగు | Giving life to the childrens | Sakshi
Sakshi News home page

దారి తప్పిన జీవితాల్లో..దివ్యమైన వెలుగు

Published Wed, Jun 17 2015 3:57 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

దారి తప్పిన జీవితాల్లో..దివ్యమైన వెలుగు

దారి తప్పిన జీవితాల్లో..దివ్యమైన వెలుగు

అమ్మ తిట్టింది.. నాన్న కొట్టాడు.. పరీక్షలు సరిగ్గా రాయలేదు.. చాలా చిన్న కారణాలు. ఇవే పిల్లలను ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నాయి. ఇళ్ల నుంచి పారిపోయి నగరానికి చేరుతున్నారు బాలలు. తాము చేసింది తప్పో ఒప్పో తెలియక.. తిరిగి ఇంటికి వెళ్లలేక.. వెళ్లే దారి తెలియక ఇక్కడ ఏం చేయాలో తోచక అగచాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ‘దారి’ తప్పుతుంటే.. మరికొందరు చిన్నాచితకా పనుల్లో చేరి తమ జీవితాలను నాశనం చేసుకుంటు న్నారు. ఇలా నగరానికి వచ్చేవారిని చేరదీసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది ‘దివ్యదిశ’ స్వచ్ఛంద సంస్థ. ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు సన్మార్గంలో నడిచేలా కృషి చేస్తోంది.
 - సికింద్రాబాద్
 
నెల రోజుల్లో 100 మందిని చేరదీసిన దివ్యదిశ  1098తో అభాగ్యులకు ఆశ్రయం
కారణాలు ఏమైనా జిల్లాలు, రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునే బాలబాలికల సంఖ్య ప్రతీ నెలలో వందకుపైగా ఉంటోంది. వీరిలో తమ కంటపడే ఒకరిద్దరు చిన్నారులను రైల్వే పోలీసులు చేరదీస్తున్నారు. మిగతా వారు స్టేషన్ దాటిపోయి ఎక్కడెక్కడో తిరిగి.. చివరకు కర్మాగారాల్లో చేరడం, లేదంటే భిక్షాటనను వృత్తిగా ఎంచుకోవడం చేస్తున్నారు. అయితే, దివ్యదిశ ఆధ్వర్యంలో ఇటీవల స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘చైల్డ్ హెల్ప్ డెస్క్’ ద్వారా అందిస్తున్న సేవలు బాలల జీవితాలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఈ సంస్థ సేవలను, పనితీరును అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి శాస్త్ర విద్యార్థులు వస్తున్నారంటే సేవలు ఎంత మెరుగ్గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
 
నెల రోజుల క్రితం..
నెలరోజుల క్రితం రైల్వే అధికారులు, పోలీసుల సహకారంతో దివ్యదిశ రైల్వేస్టేషన్‌లో చైల్డ్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ విధులు నిర్వహించే సంస్థ ప్రతినిధులు.. ప్లాట్‌ఫామ్‌లపై అనుమానాస్పదంగా తచ్చాడే బాలలను గుర్తించి, వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆపై ఆశ్రయం కల్పించడం, పక్కా సమాచారం ఉంటే తల్లిదండ్రులకు సమాచారం అందించడం, లేదంటే హాస్టళ్లలో చేర్పించడం వంటివి చేస్తున్నారు. ఎవరన్నా ఫోన్ చేసి చెబితే చాలు దిక్కు లేని, దారి తప్పిన బాలలను తీసుకెళ్లి ఆశ్రయం కల్పిస్తున్నారు.
 
ఎందరికో ఆదరణ
గడిచిన నెలరోజుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వంద మంది బాలలను గుర్తించిన ఈ సంస్థ ప్రతినిధులు.. వివిధ మార్గాల్లో వారి సమస్యకు పరిష్కారం చూపారు.  తల్లిదండ్రులు లేని, ఆచూకీ తెలియని 25 మంది బాలురకు సైదాబాద్‌లోని వసతిగృహంలో ఆశ్రయం కల్పించారు. ఇదే కోవకు చెందిన మరో 20 మంది బాలికలను నింబోలి అడ్డాలోని గర్ల్స్ హాస్టల్‌లో చేర్చారు. పారిపోయి వచ్చిన 20 మంది బాలురను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ‘చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన మా అమ్మను నాన్న వదిలేశాడు. ఇంటర్ చదువుతున్న నన్ను కళాశాల మాన్పించింది. నన్నూ తప్పుడు మార్గంలో నడిచి డబ్బు తేవాలని చిత్రహింసలకు గురిచేసేది. ఆమె చెర నుంచి తప్పించుకు వచ్చి దివ్యదిశను ఆశ్రయించా. ఇక్కడ నేను చదువుకుం టున్నా’.. అంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి తన కష్టాల కథను చెప్పుకుంది. ‘భర్త మద్యానికి బానిసయ్యాడు. ముగ్గురు పిల్లల్ని పెంచే శక్తి లేక నన్ను, పిల్లల్ని వదిలేసి పోయాడు. నాలుగిళ్లలో పాచిపని చేసుకునే నాకు ముగ్గురు పిల్లలను చదివించే సంపాదన రావడం లేదు. దివ్యదిశ వారు ఇద్దరు పిల్లల్ని వసతిగృహంలో చేర్పించి చదువు చెప్పిస్తున్నారు’.. నగరానికి చెందిన ఓ పేద మహిళ దీనగాథ.
 
నచ్చజెప్పి ఇంటికి పంపిస్తున్నాం

ఇంటినుంచి పారిపోయి వచ్చిన బాలలకు నచ్చజెప్పి తిరిగి పంపిస్తున్నాం. తల్లిదండ్రుల ఆచూకీ లభించనివారిని, బాలకార్మికులను మాత్రం వసతి గృహాలకు తరలిస్తున్నాం. పలువురు తప్పిపోయిన బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాం.
 - సుమలత, దివ్యదిశ కౌన్సిలర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement