బి.ఎస్.రాములు
సందర్భం
ప్రపంచ మహా మేధావు ల్లో డా.బి.ఆర్.అంబేడ్కర్ ఒకరు. భారతీయ సమా జాన్ని సమూలంగా మార్చడానికి కృషి చేస్తూ, ఆ క్రమంలో అర్థశాస్త్రాన్ని అన్వయించి సామాజిక సాంస్కృతిక, రాజకీయ, నైతిక, ధార్మిక విషయాల ను చర్చించారు. అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, సంభాషణలు ఇప్పుడు 23 సంపుటాలుగా లభ్యమ వుతున్నాయి. వాటన్నిటిలోని మౌలికాంశాలను పరి చయం చేస్తూ వ్యాఖ్యానించే సంపుటాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పుడు అంబేడ్కర్ సమగ్ర దృక్పథం ఏమిటో తెలుసుకోవడానికి ఇవన్నీ అందు బాటులోకి వచ్చాయి. గతంలో గాంధీ, నెహ్రూలకు ఇచ్చిన ప్రాధాన్యత అంబేడ్కర్‌కు ఇవ్వకపోవడం వల్ల అంబేడ్కర్ సమగ్ర అధ్యయనం సాగలేదు. మరోవైపు మార్క్సిజం సిద్ధాంతాలను ముందుకు నెట్టి అంబేడ్కర్ అర్థశాస్త్ర అధ్యయనాన్ని, అది అస లు ఉందనే విషయం కూడా తెలియకుండా దశా బ్దాలు గడిపేశారు.
మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో, గాంధీ, నెహ్రూల ఆర్థిక సామాజిక, రాజ కీయ సిద్ధాంతాలతో అంబేడ్కర్ రచన లను తులనాత్మక అధ్యయనం చేసిన ప్పుడు.. భారతీయ సమాజాన్ని పట్టిం చుకుని దాని అభివృద్ధి కోసం నిరంత రం పలవరించిన వారిలో అంబేడ్కర్ తప్ప మరొక జాతీయ నాయకులెవరైనా ఉన్నారా? అని సందేహం కలుగుతుంది. ఎందుకంటే అంబే డ్కర్ లాగా మన సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసి, గ్రంథస్థం చేసినవారు మరెవరూ లేరు.
అంబేడ్కర్ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపా దించారు. కులం ఒక పెట్టుబడిగా, అదనపు సంప దగా, అదనపు విలువగా, అధికార కేంద్రంగా ఉం దని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు. కుల వ్యవస్థ నిర్మూలనకు బౌద్ధం మరొక మార్గమని ఆచరించి చూపారు. ప్రజాస్వామిక సం స్కృతికి హిందూ మతం, హిందూ సం స్కృతి, మహమ్మదీయ మతం, ఇస్లాం సంస్కృతి పనికిరావని బౌద్ధ సంస్కృతే అందుకు మార్గమని స్పష్టం చేశారు.
పాశ్చాత్య అర్థశాస్త్రవేత్తలు, మా ర్క్స్, లెనిన్, మావో మొదలైన మార్క్సి స్టులు అర్థశాస్త్రానికి, మతానికి, కులానికి, భావజా లానికి, సామాజికాభివృద్ధికి మధ్య సంబంధం ఉం దని పరస్పరం ప్రభావితం చేసుకుంటాయని లోతు గా విశ్లేషించలేదు. భారతీయ మార్క్సిస్టు విశ్లేషణలో వర్గం అనే పదంతోనే రాజకీయాలు, ఉద్యమాలు నడిపించారు. మార్క్స్, ఎంగెల్స్‌లు మతం వ్యక్తిగత విషయం అని వదిలేసినట్టు, భారతదేశంలో మార్క్సిస్టులు, కులాన్ని కూడా మతం లాగే వ్యక్తిగత విషయమని వదిలేశారు. తద్వారా ఆధిపత్యంలో ఉన్నవారే సామాజిక, రాజకీయ నాయకత్వంగా ఎదిగే క్రమం కొనసాగుతూ వచ్చింది.
స్త్రీవాదులు వ్యక్తిగతమైనదంతా సామాజికమై నదే, రాజకీయమైనదే అని నిర్ధారించారు. అయిన ప్పటికీ ఇప్పటికీ వాళ్లు కులాన్ని, మతాన్ని సామా జిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సమస్యగా పట్టించుకోలేదు. అంబేడ్కర్ వీరికి భిన్నంగా కులం, మతం, జెండర్, భావజాలం జీవితంలో నిర్వహి స్తున్న పాత్రను పట్టించుకుని వాటికి వ్యతిరేకంగా వేల పేజీల గ్రంథాలను వెలువరించారు. మార్క్సి స్టులు, పాశ్చాత్య అర్థశాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ పని చేయడం లేదు. పైగా ఆ పని చేయడం ప్రధాన అం శాలను పక్కదారి పట్టిస్తుందని ప్రచారం చేశారు. నిజానికి ఇవే ప్రధాన అంశాలని అంబేడ్కర్ జీవిత మంతా స్పష్టం చేస్తూనే వచ్చారు. ప్రజాస్వామ్య విధానాల్లో బహుళ పార్టీ వ్యవస్థలో ఎవరు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల సంక్షేమాన్ని సామాజి కాభివృద్ధిని సాధించే అర్థశాస్త్రాన్ని అంబేడ్కర్ కలగ న్నాడు. ఆయన రచనల్లో పరుచుకుని ఉన్న అర్థశాస్త్ర అంశాలను ఒకచోట క్రోడీకరించి, సంశ్లేషించి అంబే డ్కరిస్టు అర్థశాస్త్రాన్ని రూపొందించి పాఠ్యపుస్తకాల్లో పొందుపరచడం అవసరం.
(నేడు డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి)
(వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, హైదరాబాద్, మొబైల్: 83319 66987)