గ్రీన్ హోమ్స్
ఎండాకాలం ఇంట్లో చల్లగా ఉండాలి. చలికాలం ఇంట్లో వెచ్చగా ఉండాలి.. అంటే ఏం చేయాలి? వేసవిలో ఏసీలు, శీతాకాలంలో హీటర్లను ఆన్ చేయాలి. దీనికి ప్రత్యామ్నాయం ఏదీ లేదా? ఉంటే ఆ ప్రత్యామ్నాయం ప్రకృతికి హాని కలిగించనిదైతే ఎంత బాగుంటుందో కదూ! హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ‘గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2014’ ఎగ్జిబిషన్‌లో ఓ రెండు ప్రదర్శనలు ఏసీలతో, హీటర్లతో అవసరం లేకుండా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా బతికేయొచ్చని అంటున్నాయి.
థర్మాకోల్ ఇళ్లు..
థర్మాకోల్‌తో ఇళ్లేంటని ఆశ్చర్యపోకండి. దానంత భద్రం, బలం మరొకటి లేదంటున్నారు చెన్నైకి చెందిన బీర్డ్‌సెల్ లిమిటెడ్‌వారు. ఆ కంపెనీ ప్రతినిధి ఉదయ్ మాటల్లో చెప్పాలంటే.. నిప్పుకు సైతం లొంగని దృఢత్వం మా ఇళ్ల ప్రత్యేకత అంటారు. ‘ఐదించుల థర్మాకోల్ అట్టకు రెండువైపులా నాలుగురకాల పూతలు పూసి వాటిని గోడలుగా మలచడం మా స్పెషాలిటీ. థర్మాకోల్ అంటే మామూలుగా వాడేది కాదు. ఎఫ్‌ఆర్ మెటీరియల్ అని ఉంటుంది. అంటే ఫైర్ రిటార్డెడ్ థర్మాకోల్ అన్నమాట. దీన్ని మాకు కావాల్సిన ఆకారాల్లో తయారుచేసుకుని వాటిని గోడల మధ్యలో పెడతాం. దీని వల్ల అగ్నిప్రమాదం జరిగినపుడు మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా, గోడలు పగిలిపోకుండా థర్మాకోల్ కాపాడుతుందన్నమాట. అదెలాగంటే.. అగ్ని ప్రమాదం జరిగినపుడు గోడలు కూడా వేడెక్కిపోయి పగిలిపోతాయి. మా థర్మాకోల్ ఇళ్ల వల్ల గోడ మధ్యలో ఉన్న థర్మాకోల్ నిప్పుని వేగంగా వ్యాపించకుండా చేస్తుంది. వేడి తగలగానే అక్కడికక్కడే ఉండలా అయిపోయి సిమెంటు మధ్యలో అలాగే ఉండిపోతుంది. బీటలువారే అవకాశం ఇవ్వదు. ఇదిలా ఉంచితే గోడలోపల ఉండే ఎఫ్‌ఆర్ థర్మాకోల్ వేసవిలో ఇంటిలోపలి వాతావరణాన్ని చల్లబరుస్తుంది.
చలికాలంలో గదుల్లో హీట్ జనరేట్ చేస్తుంది. అగ్నిప్రమాదాల తీవ్రతను తగ్గించే ఇళ్లుగా కంటే వేసవి, చలి కాలాలకు.. ఏసీ, హీటర్ మాదిరిగా ఉపయోగపడటంలో మా థర్మాకోల్ ఇళ్లు చాలా ఫేమస్ అయ్యాయి. నాలుగు నెలల క్రితం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో రెండు పెద్ద ఇళ్లను నిర్మించాం. చెన్నైలో ఏడు ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తిచేశాం’ అని వివరించారు ఉదయ్. టెక్నాలజీ పేరుతో పరిచయమైన ఏసీ, హీటర్‌కు ప్రత్యామ్నాయాలకు కూడా మరో టెక్నాలజీని కనిపెట్టి ముందుకు దూసుకెళ్తున్న వీరికి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం.
చెక్కలా ఉంటుంది కానీ..
ప్రీఫ్యాబ్రికేటెడ్ సిమెంట్‌తో కట్టిన ఇల్లు ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుజరాత్‌కి చెందిన ఓ కంపెనీ తరఫున ప్రతినిధిగా అజయ్ ఆ ఇంటి స్పెషాలిటీ గురించి వచ్చిన వారందరికీ వివరించారు. ‘చూడ్డానికి పెంకుటిల్లు మాదిరిగా ఉన్న ఈ ప్రీఫ్యాబ్రికేటెడ్ హౌస్‌లు మన దేశానికి కొత్త. ఆరేళ్లక్రితం గుజరాత్‌లో ఈ ఇళ్ల నిర్మాణం మొదలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు వందల ఇళ్లు నిర్మించాం. ఈ ఇంటి నిర్మాణానికి మేం ప్రీఫ్యాబ్రికేటడ్ సిమెంట్‌ని వాడుతున్నాం. చూడ్డానికి మాత్రం చెక్కతో కట్టిన ఇల్లు మాదిరిగా ఉంటుంది. గోడ పూతంతా ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో ఉంటుంది.
దీని కారణంగా.. వేసవిలో ఇంట్లో వాతావరణం చల్లగా ఉంటుంది. బయట నలభై డిగ్రీల వేడి ఉంటే.. ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది. ఫ్యాన్లతో కూడా పని ఉండదు. గోడకు వేసే కోటింగ్‌ని బట్టి ఇంట్లో ఉండే చల్లదనం ఆధారపడి ఉంటుందన్నమాట. ఎక్కువగా ఉత్తరాదివారే ఈ ఇళ్లను ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ వాసులు కూడా వీటిపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం మా చేతిలో నగరానికి సంబంధించి రెండు ఆర్డర్లు ఉన్నాయి. ఈ మధ్యనే భువనగిరిలో ఒక ఫామ్‌హౌస్ కట్టాం.’ అని చెప్పారు అజయ్. ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇళ్లకున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. సౌండ్‌ఫ్రూఫ్. అలాగే గోడలు చాలా బలమైనవి కూడా. మిగతా ఇళ్లతో పోలిస్తే ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇళ్ల ఖరీదు ఇరవైశాతం మాత్రమే ఎక్కువట.
- భువనేశ్వరి