ముసుగేసిన నగరం | winter season cities very cool | Sakshi
Sakshi News home page

ముసుగేసిన నగరం

Published Thu, Dec 25 2014 11:59 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

ముసుగేసిన నగరం - Sakshi

ముసుగేసిన నగరం

వెచ్చగా ముసుగు కప్పుకున్నా, వేడిగా కప్పు కాఫీ తాగుతున్నా.. చలిగాలి తాకగానే పెదాలలో చిరు వణుకు మొదలవుతుంది. దంతాలు ఆదితాళం అందుకుంటాయి. చలికి బిగుసుకుపోయిన చలనాన్ని తట్టి లేపాల్సిన ఉత్సాహం, బుజ్జగిస్తున్న బద్ధకానికి లొంగిపోతుంది. తెరలు తెరలుగా పొగమంచు పొరలు కమ్ముకొస్తుంటే హైదరాబాద్‌కు చలేస్తోంది..!
 
పాదాలు సాక్సులనీ, చేతులు గ్లోవ్స్‌నీ వెతుక్కుంటున్నాయి. స్వెటర్లు, కోట్లు, జాకెట్లు, షాల్సు భుజాలకెక్కేస్తున్నాయి. చలిపులితో యుద్ధం చేసేందుకు నగరవాసి ముసుగు వీరుడి అవతారం ఎత్తాడు. గతవారం మన నగర కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు చేరువగా నమోదైంది. 2005 తర్వాత ఈ సీజన్‌లో ఇదే కనిష్టం అని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.
 
ఈ గాలి.. ఆ ధూళి..
ఈ శీతాకాలం డిగ్రీల కంటే ఎక్కువ వణుకు పుట్టిస్తోన్న వాస్తవం మన గాలిలోని కాలుష్యం. చలికాలంలో గాలిలోని గాఢతకు, చుట్టూ అలుముకున్న పొగమంచుకు.. కాలుష్య కారకాలు, ధూళి కణాలు.. మన చుట్టూ భారంగా తిరుగుతాయట. సల్ఫర్, అమ్మోనియా, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి రసాయనాలతో పాటు మనం పీల్చే గాలిలో కంటికి కనిపించని ధూళి కణాలు ఎన్నో ఉంటాయి. వాయు కాలుష్యం వల్ల వచ్చే ఎక్కువ శాతం జబ్బులు ఈ పర్టిక్యులర్ మ్యాటర్ (పీఎం) వల్లే వస్తాయి.

ఈ శీతాకాలంలో చలితో కంటే పీల్చే గాలితో జరభద్రం. మన నగరంలో కొన్ని ప్రాంతాల్లో పీఎం చాలా ఎక్కువగా ఉంటోంది. కనీసం 60 మైక్రో గ్రామ్స్ ఉండాల్సిన చోట 87 మైక్రో గ్రామ్స్ ఈ డిసెంబర్‌లో ఉంటే జనవరిలో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మూడు చోట్ల ధూళి కణాలు హానికర స్థాయిలో ఉన్నాయని రిపోర్టులు సెలవిచ్చాయి. ఇక నుంచి ప్యారడైజ్ సెంటర్‌లో బిర్యానీ తినాలనిపించినా, చార్మినార్ దగ్గర గరమ్ చాయ్ తాగాలనిపించినా, మెహదీపట్నం రైతుబజార్‌లో కూరగాయలు కొనాలనిపించినా ముక్కుకి మాస్క్ తగిలించుకోండి. ధూళి కణాలు ఎక్కువ నమోద వుతున్న ప్రాంతాలు ఈ మూడే.
 
చలి గుప్పే మౌసమ్‌లో..
చలికాలంలో తుమ్ముల పరంపర, జలుబుల దండయాత్ర మనకి కొత్తేమీ కాదు. కానీ 2009 నుంచి కొత్తగా బయల్దేరిన భయం స్వైన్ ఫ్లూ. హెచ్1,ఎన్1 అలెర్ట్ ప్రకటించినప్పటి హడల్ నాకింకా గుర్తుంది. మన ముక్కు కారినా కంగారుపడ్డాం. ఎదుటి వ్యక్తి తుమ్మినా అనుమానంగా చూశాం. మాస్క్ లేకుండా అడుగు కూడా బయటపెట్టలేదు. అలాంటిది ఈ నాలుగైదేళ్లుగా ఆ భయం ఏమైపోయింది.

ఈ సారి హైదరాబాద్‌లో ఇప్పటికి స్వైన్‌ఫ్లూ వల్ల ముగ్గరు చనిపోయారన్న వార్త విన్నా కూడా మనం కంగారు పడట్లేదు.  ఎందుకని. వైరస్ మనకు అలవాటైందా.. లేక మనం ఆ వైరస్‌కు అలవాటుపడ్డామా. మందులున్నాయన్న భరోసా కావొచ్చు, అవగాహన పెరగడం వల్ల కావొచ్చు ఇదివరకట్లా బెంబేలెత్తిపోవడం లేదు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం, ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకోవడం, వెచ్చని బట్టలు వేసుకోవడం ముఖ్యమని డాక్టర్లు పదేపదే చెబుతుంటారు.
 
చలి తాళని బతుకులు..
చలికాలం వచ్చిందంటే ఫ్యాషన్ సీజన్ కూడా మారిపోతుంది. తల నుంచి పాదాల వరకూ అన్ని భాగాలకూ వెచ్చని ఫ్యాషన్ అందుబాటులో ఉంటుంది. ఇంట్లో ఊలు దుస్తులు ఉన్నా కూడా మళ్లీ మళ్లీ కొనాలనిపించేలా దుకాణాలు ఊరించేస్తుంటాయి. ఆఫర్లతో కనికట్టు చేసి కొనిపించేస్తుంటాయి. ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలో అనే సందిగ్ధంలో కొందరుంటే, కనీసం ఒక్కటైనా ఉంటే చాలు ఈ చలిని తట్టుకోవడానికి అని ముడుచుకుపోయే అభాగ్యులు ఈ భాగ్యనగరంలో కనిపిస్తారు.

గూడు లేని జీవులు, గుడిసెల్లో మగ్గే నిరుపేదలు చలికాలం మొదటి పంజా విసిరేది వీరిపైనే. చిరుగుల రగ్గుల్లోంచి వణికించే చలిని తరిమేందుకు చలిమంటే వీరికి ఆధారం. సూరీడు ఉదయించాక ఆఫీస్‌కో, స్కూల్‌కో బయల్దేరేందుకు అన్నీ కప్పుకుని మరీ బయటకు వచ్చే మనకి ఇంకా చలిగానే ఉంటే, రాత్రంతా చలితో సావాసం చేసే ఆ బడుగు జీవుల పరిస్థితి ఊహించుకోండి. ఫుట్‌పాత్‌పై, బస్టాపుల్లో, పార్కుల్లో ఏ గోడా తమది కానీ, తమకు లేని అభాగ్యుల చలిగోడు వినే మనసుంటే ఈ చలికాలం కొంత వెచ్చదనాన్ని పంచుదాం. ఇప్పటికే ఎందరో ఈ యజ్ఞంలో తమవంతు చేయూతనిస్తున్నారు. కానీ మరెందరో నిరుపేదలు, వృద్ధులు, అనాథలు ఇంకా వెచ్చదనం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
 
బ్లాంకెట్ చాలెంజ్..
శిశిరంలో ఆకులా చలికి రాలిపోయే అభాగ్యుల జీవితాలను నిలబెడదాం. వెచ్చగా ఇంట్లో నిద్రపోయే ప్రతిసారీ రోడ్డుపై చలిలో ముడుచుకున్న ఓ జీవితాన్ని తలుచుకోండి. ప్రతివారం ఈ కాలం చదివి ఇన్‌స్పైర్ అయిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో పంపిన రిక్వెస్ట్ ఇది. మీ చుట్టుపక్కల కనిపించే పేదలకు మీరు ఇంట్లో నిరుపయోగంగా దాచిన వెచ్చని దుస్తులను పంచండి. సందర్భం వేరైనా దేవులపల్లి గారు రాసిన  ‘శీతవేళ రానీయకు.., శిశిరానికి చోటీయకు..’ పాట ఇప్పుడు సరిపోతుంది.

నేను మరో అడుగు ముందుకేసి మీకో చాలెంజ్ విసురుతున్నాను. తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య, హోమ్‌లెస్‌లా రోడ్డుపైనో, పార్కులోనో ఓ గంట గడపండి. ఒక్కసారి కూడా చలికి ‘ఉహుహూ..’ అని వణకకుండా ఉండగలరా ! ఓడిపోతే ఒకరికి ఓ రగ్గు డొనేట్ చేసి రండి. ఐస్ బకెట్ చాలెంజ్‌లా, వెచ్చని హైదరాబాద్ కోసం ఇది హైదరాబాద్ బ్లాంకెట్ చాలెంజ్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement