స్వైన్‌ఫ్లూ జోరు
రోజుకు 3–4 అనుమానిత కేసులు
తాజాగా నేవీ ఉద్యోగికి వ్యాధి లక్షణాలు
విశాఖపట్నం : నగరంలో స్వైన్‌ఫ్లూ జోరు తగ్గడం లేదు. ఒక పక్క ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా స్వైన్‌ఫ్లూ మాత్రం వెనకడుగు వేయడం లేదు. దాదాపు నెల రోజుల క్రితం వెలుగు చూసిన ఈ మహమ్మారి ఆరంభంలో నగరంలోని సాలిపేటకు చెందిన ఒక మహిళను పొట్టనబెట్టుకుంది. ఆ తర్వాత నుంచి ఉధృత రూపం దాలుస్తూనే ఉంది. ఎక్కడో చోట తన ఉనికిని చాటుకుంటేనే ఉంది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం జనం రద్దీ ఎక్కువగా ఉండే 11 ప్రాంతాల్లో స్క్రీనింగ్ కేంద్రాలను, ప్రభుత్వ ఐడీ ఆస్పత్రి, కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. అక్కడ స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులను చేర్చుకుని చికిత్స అందజేస్తున్నారు. రోజుకు ముగ్గురు నలుగురు చొప్పున స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరుతూనే ఉన్నారు. వీరిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వారికి వైద్యమందిస్తున్నారు. లేనివారిని ఆస్పత్రుల నుంచి విడుదల చేస్తున్నారు. ప్రస్తు తం నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో 35 స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులున్నాయి. వీరిలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. మరికొంతమందికి సంబంధించి వైద్య నివేదికలు రావలసి ఉంది.
ప్రైవేటు ఆస్పత్రిలో నేవీ ఉద్యోగికి వైద్యం
శనివారం ఐఎన్‌ఎస్ కల్యాణి క్వార్టరులో ఉంటున్న నేవీ ఉద్యోగికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు మైదాన ప్రాంతాలకంటే నగరం నుంచే ఎక్కువగా వస్తున్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో విశాఖ ఉత్సవ్ జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలోని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తున్నందున వీరు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇందులో భాగంగా అవగాహన కోసం విశాఖ ఉత్సవ్‌లో ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
ల్యాబ్‌తో సత్వర చికిత్స
కొద్దిరోజుల క్రితం కేజీహెచ్‌లో స్వైన్‌ఫ్లూను నిర్ధారించే వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసుల శాంపిళ్లను తిరుపతి, హైదరాబాద్‌ల్లోని వైరాలజీ ల్యాబ్‌లకు పంపేవారు. ఈ శాంపిళ్ల రిపోర్టు రావడానికి మూడు నాలుగు రోజుల సమయం పట్టేది. అప్పటిదాకా ఆయా రోగులకు నామమాత్రపు చికిత్సను అందించేవారు. తాజాగా కేజీహెచ్‌లో వైరాలజీ ల్యాబ్ ఏర్పాటుతో గంటల వ్యవధిలోనే వ్యాధి లక్షణాలను స్పష్టం చేస్తూ రిపోర్టులు వస్తున్నాయి. దీంతో స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వారికి తక్షణమే అత్యవసర వైద్యం అందించే అవకాశం కలుగుతోంది.