భయం.. భయం
రాష్ట్రంలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
గాంధీలో బాలుడు మృతి
చికిత్స పొందుతున్న మరో 12 మంది
హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజుల్లో 6 వేలమందికి పైగా పరీక్షలు నిర్వహించగా, 70 మందికిపైగా ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారించారు. హైదరాబాద్‌లోనే 28 కేసులు నమోదు కావడం గమనార్హం. వారంరోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీబీనగర్‌కు చెందిన 10 నెలల బాలుడు గురువారం రాత్రి మృతి చెంద డంతో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 5కు చేరింది. ఇదే ఆస్పత్రిలో 12 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో చార్మినార్‌కు చెందిన మరో పదిమాసాల బాలుడు ఉన్నాడు. రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించి రిపో ర్టులు జారీలో తీవ్రజాప్యం జరుగుతోంది. వైద్యులు మాత్రం అనుమానిత ఫ్లూగా భావించి చికిత్స చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణై, రిపోర్టు వైద్యుడి చేతికి అందేసరికి బాధితులు మృత్యువాత పడుతున్నారు.
నగరంలో ప్రమాదకరంగా...
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రస్తుతం నగర వాతావరణంలో మరింత బలపడింది. 2009లో విదేశాల నుంచి హైదరా బాద్‌కు దిగుమతైన ఈ వైరస్ 15 రకాలుగా రూపాంతరం చెందినట్లు వైద్యులు చెబుతున్నా రు. గాలిలో అధిక తేమశాతం, శీతల గాలులతో వైరస్ మరింత బలపడుతోంది. జూలై,అక్టోబర్ మధ్యకాలంలో విస్తరించే స్వైన్‌ఫ్లూ వైరస్ ప్రస్తు తం సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతాపాన్ని చూపుతోంది. గర్భిణులు, చిన్నారులు, వృద్ధు లు, బాలింతలు, కాలేయ సంబంధిత వ్యాధు లు, ఆస్తమా బాధితులపై ప్రభావం చూపుతోం ది. ఫ్లూ జ్వరాలను సాధారణ జ్వరంగా భావి స్తుండటంతో వైరస్ వ్యాపించి పరిస్థితి విషమి స్తోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో మృతిచెం దిన వారంతా చివరిదశలో వచ్చిన వారే. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, బ్రీత్‌ఎనలైజర్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే పోలీసులకు ఫ్లూ భయం పట్టుకుంది.
డిప్యూటీ సీఎం దంపతులకు ఫ్లూ?
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆయన సతీ మణి ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నట్లు సమా చారం. వీరు గత 4 రోజులుగా నిమ్స్‌కు వచ్చి చికిత్స చేయించుకుని వెళ్తున్నారు. వైద్యులు వీరి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపా రు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, డిప్యూటీ సీఎం వైరల్ ఫివర్‌తో బాధపడుతున్నారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఇలా చేయండి..
►స్వైన్‌ఫ్లూ లక్షణాలు, దాని నుంచి రక్షించుకోవడానికి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జేవీ రెడ్డి చేసిన సూచనలివి...
తుమ్మినా, దగ్గినా వైరస్ గాలిలోకి ప్రవేశి స్తుంది. ఇలా బయటికొచ్చిన వైరస్ వాతావ రణంలో 2 గంటలకు పైగా జీవిస్తుంది.
►గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఊబ కాయులకు సులభంగా వ్యాపిస్తుంది. చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోకుండా ఉండటం మంచిది.
►ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి, తుమ్ములు, కళ్ల వెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి.
►ముక్కుకు మాస్కు ధరించాలి. అలాగే తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.
►వీలైనంత ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.
►జన సమూహ ప్రాంతాలకు వెళ్లకపోవ డమే ఉత్తమం.