సిటీపై స్వైన్ ఫ్లూ దాడి | Swine flu attacks again hyderabad | Sakshi
Sakshi News home page

సిటీపై స్వైన్ ఫ్లూ దాడి

Published Sat, Sep 12 2015 2:51 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

సిటీపై స్వైన్ ఫ్లూ దాడి - Sakshi

సిటీపై స్వైన్ ఫ్లూ దాడి

వారంలో ఇద్దరు మృతి..  గడచిన 10 రోజుల్లో 31 మందికి నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపైనా పంజా విసురుతోంది. స్వైన్‌ఫ్లూ సోకి వారం రోజుల వ్యవధిలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు మృతి చెందారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు 254 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 31 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో 20 రోజుల్లో చలికాలం మొదలు కానున్న నేపథ్యంలో స్వైన్‌ఫ్లూ మరింత విజృంభించే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి సెప్టెంబర్ 10 నాటికి రెండు నెలల్లో 63 మంది చనిపోవడం స్వైన్‌ఫ్లూ తీవ్రతను తెలియజేస్తోంది.
 
 వైద్య యంత్రాంగం నిర్లక్ష్యం...: స్వైన్‌ఫ్లూ కేసులు గత నెల నుంచే పెరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం నిర్లక్ష్యం వీడటం లేదు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారులు ఇప్పటికీ సరైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించ లేదు. స్వైన్‌ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల రూపకల్పన జరగనే లేదు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆసుపత్రులు, సినిమా హాళ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ఫ్లూ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు     జనాభా ఎక్కువగా ఉండే పట్టణాల్లో ఫ్లూ పై  అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలి. కానీ, ఇలాంటి చర్యలు ఎక్కడా కనిపించడం లేదు.
 
 స్వైన్‌ఫ్లూతో బాలింత మృతి
 స్వైన్‌ఫ్లూ చికిత్స పొందుతూ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం బాలింత మృతి చెందింది. మెదక్ జిల్లా శంకరంపేట మండలం గవ్వలపల్లికి  చెందిన మరియమ్మ (26) ఈనెల 2న తీవ్ర జ్వరంతో గాంధీ ఆసుపత్రిలో చేరిం ది. వైద్యులు నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. గర్భిణీ అయిన మరియమ్మకు పురిటి నొప్పులు రావడంతో 9వ తేదీన సిజేరియన్ చేశారు. ఆమె కవలలకు జన్మనిచ్చింది. శిశువులను చిన్నపిల్లల వార్డుకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఏఎంసీ వార్డులో చికిత్స పొందుతున్న మరియమ్మ శుక్రవారం మృతి చెందింది.
 
 
 మరో మహిళ కూడా..: ముషీరాబాద్‌కు చెందిన అక్తర్‌బేగం (50) ఈనెల 5న తీవ్ర జ్వరంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపించారు. చికిత్స పొందుతూ ఆమె  6న మృతి చెందింది. అయితే ఈనెల 9 న అందిన నివేదికలో అక్తర్‌బేగంకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన జగ్గమ్మ(20) రెండు రోజుల క్రితం స్వై న్‌ఫ్లూ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం అందిన నివేదికలో స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. మరో ఇద్దరు స్వై న్‌ఫ్లూ లక్షణాలతో గాంధీలో చికిత్స పొందుతున్నారు. వీరి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపినట్లు వైద్యులు తెలిపారు.
 
 ఈ జాగ్రత్తలు పాటించండి
 - రెండేళ్లలోపు చిన్నపిల్లలు, 65 ఏళ్ల పైబడిన వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంటితో పాటు చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి.
- స్వైన్‌ఫ్లూ బాధితులు రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదు. ఎక్కువగా నీళ్లు తాగాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కుకు, నోటికి చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి.
- శీతాకాలంలో ఫ్లూ అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. దగ్గు, జలు బు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణా లు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
- స్వైన్‌ఫ్లూ ఉన్నవారు తప్పకుండా మాస్కులు ధరించాలి. వారికి ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలి.
- స్వైన్‌ఫ్లూ రాకుండా ముందుగానే వ్యాక్సిన్ వేసుకోవడం ఉత్తమమైన పని.
- శీతాకాలంలో సాధ్యమైనంత వరకు రద్దీ ప్రదేశాల్లో తిరగకుండా ఉండటం మేలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement