
సైకిలెక్కి.. ఫైన్ కట్టి..
హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే హరగోపాల్ సిటీలో రెండుసార్లు తప్పులు చేశారట. సైకిల్ రూల్స్ అతిక్రమించి కోర్టులో ఫైన్ కట్టారట.
ప్రొఫెసర్ హరగోపాల్: హక్కుల ఉద్యమకారుడు
జ్ఞాపకం: హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే హరగోపాల్ సిటీలో రెండుసార్లు తప్పులు చేశారట. సైకిల్ రూల్స్ అతిక్రమించి కోర్టులో ఫైన్ కట్టారట. తన ఊరి గుట్టెక్కి చూసిన సిటీ విద్యుత్ వెలుగులు.. ఈ మహానగరంలో డబుల్ డెక్కర్‌లో పైన కిటికీ పక్కనే కూర్చుని ఎంజాయ్ చేసిన వైనం.. నాలుగు రూపాయల కిరాయి ఇంట్లో, కిరోసిన్ స్టవ్‌తో వంట చేసుకున్న సందర్భం ఎన్నటికీ మరువలేనంటారు. అక్షరాభ్యాసం నుంచి హైదరాబాద్ సిటీలో చదువు వరకు ప్రొఫెసర్ హరగోపాల్‌కు కేవలం రూ. 2400 ఖర్చయిందట. పౌర ఉద్యమాల రథసారథి జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే..
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు సమీపంలోని మొగిలిగిద్ద మా ఊరు. అక్కడి నుంచి హైదరాబాద్ రావడం అంటే అమెరికా వెళ్లినట్టే. ఒకే ఒక బస్సుండేది. ఉదయం బయల్దేరితే రాత్రికి హైదరాబాద్‌కు వచ్చేదా బస్సు. ఊరి బయట ఓ పెద్ద గుట్టమీద నిలబడి సరిగ్గా రాత్రి 7 గంటల సమయంలో రోజూ హైదరాబాద్ వైపే చూసేవాణ్ణి. ‘అబ్బ ఎంత కరెంటు.. ఎంత వెలుగు.. పున్నమి చంద్రుడిలా ఉంది కదా?’ అని ఫ్రెండ్స్‌తో అనేవాణ్ణి. హైదరాబాద్ వెలుగు చూడ్డానికే ఆ టైంలో గుట్టెక్కేవాళ్ళం.
అబ్బ.. ఏం సిటీ!
అదేమి అదృష్టమో 1960లో పీయూసీ కోసం 15 ఏళ్లకే హైదరాబాద్ వచ్చాను. భారీ భవంతులు, నిజాం కట్టడాలు, కళాకృతులు.. ఆ సంస్కృతి ఆనవాళ్లు, ఎటు చూసినా చెరువులు, చెట్లు.. పచ్చందనాలు అబ్బురపరిచేవి. వారానికోసారైనా పబ్లిక్ గార్డెన్‌కు వెళ్లడం అలవాటు. సిటీలో కేవలం నాలుగే థియేటర్లు ఉండేవి. అవి సాగర్ (అబిడ్స్), కమల్ (చాదర్‌ఘాట్), దీపక్ (చిక్కడపల్లి).. ఇంకోటి గుర్తులేదు. వాటిల్లో ఇంగ్లీష్ సినిమాలే ఆడేవి. బెస్ట్ సెలక్ట్ చేసుకుని చూసి కథను ఫ్రెండ్స్‌కు చెప్పేవాణ్ణి.
మెహందీలో.. అద్దె గది
వెదికి వెదికి మెహందీలో ఓ అద్దె గది తీసుకున్నా. దానికి కిరాయి నెలకు 4 రూపాయలు. స్వయం పాకమే ఆధారం. అమ్మ ఇచ్చిన పచ్చళ్లు, అప్పుడప్పుడు వండుకునే ఆకుకూరలు, ఇవే నా భోజనంలో ప్రధానం. తర్వాత సుల్తాన్‌బజార్‌లోని ఐడియల్ హోటల్ భోజనం గురించి విని.. ఓ వ్యక్తితో రోజూ కేరియర్ తెప్పించుకోవడం మొదలుపెట్టా. అతనికి నెలకు రూ.2 ఇచ్చేవాణ్ణి. హోటల్‌లో నెలకు రూ.10 ఇచ్చి ఒక్కసారే టిక్కెట్లు కొనేవాణ్ణి. ఒక పూట తెచ్చే కేరియరే రెండు పూటలా తినేవాణ్ణి. దాంతో నా కిరోసిన్ స్టౌ నా రూమ్‌లో గెస్ట్‌గానే మిగిలిపోయింది.
అమ్మో.. పోలీస్
ఓ సైకిల్ కొనుకున్నాను. అప్పుడది ఫ్యాషన్. స్టేటస్ సింబల్ కూడా. సిటీలో డబుల్ డెక్కర్ బస్సులే ఉండేవి. అందులో పై అంతస్తులో ఎక్కి, కిటికీ పక్కన కూర్చుని సిటీని చూస్తుంటే మనసు పులకించేది. ద్విచక్ర వాహనాలు చాలా తక్కువ. కార్లు చూడటం ఓ వింతే. ముంబై మాదిరి ట్యాక్సీలుండేవి. నా సైకిల్‌కు ఓసారి ైలైట్ లేక.. మరోసారి సురేశ్ అనే ఫ్రెండ్‌ను ఎక్కించుకుని డబుల్ సవారీ చేయడంతో పోలీస్‌కు దొరికిపోయి, తర్వాత కోర్టుకు వెళ్లి రూ.5 చొప్పున జరిమానా కట్టాను.
మదీనాకెళ్లానమ్మా!
హైకోర్టుకు దగ్గరలో ఉండే మదీనాకు వెళ్లడం అప్పట్లో గొప్ప. అక్కడ టీ రేటెక్కువ. బన్‌తో కలిపి రూ.1 ఉండేది. చాలామంది వచ్చేవాళ్లు. ఆ కాసేపు వాళ్ల కళ్లల్లో స్టార్ హోటల్‌కు వెళ్లినంత ఫీలింగ్ ఉండేది. నేనూ ఎంతో గ్రేట్‌గా టీ తాగేవాణ్ణి. ఆ విషయాలన్నీ అమ్మకు ఉత్తరంలో రాసేవాణ్ణి. మా వాడు మదీనకు వెళ్లాడు అని అందరికీ అమ్మ చెప్పేదట.
సాయంవేళ.. అదో అనుభవం
ఇప్పుడున్న బిర్లామందిర్ ప్రాంతాన్ని అప్పట్లో నౌబత్‌పహడ్ అని పిలిచేవాళ్లు. అదో పెద్ద గుట్ట. అక్కడ కూర్చుంటే సిటీ మొత్తం కన్పించేది. సాయంత్రం వేళ ఫ్రెండ్స్‌తో వెళ్లేవాణ్ణి. చాలా విషయాలు తెలిసేవి.
అబ్బ.. ఆ ఇడ్లీ ఇంకా గుర్తే
ఇప్పుడు రవీంద్రభారతి ఉన్న పరిసరాల్లో గోపీ హోటల్ ఉండేది. అక్కడ కేవలం ఇడ్లీ మాత్రమే అమ్మేవాళ్లు. ఇది తినడానికి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్లంతా వచ్చేవాళ్లు. ఎంత బాగుండేదో.
అమ్మాయిలను.. కన్నెత్తి చూడలేదు
స్కూల్ లైఫ్‌లో పదేళ్లూ ఓ అమ్మాయి నా క్లాస్‌మేట్. ఒక్కసారి కూడా మాట్లాడిన పాపానపోలేదు. సిటీకొచ్చాక కూడా అదే పరిస్థితి. బీఏ చదివేటప్పుడు ముగ్గురమ్మాయిలు క్లాస్‌లో ఉండేవాళ్లు. ఒకరివైపు ఒకరం చూసుకున్నదే లేదు. నాటి సామాజిక పరిస్థితులు అలా చేశాయేమో? ఇప్పటి దారుణాలను చూస్తే అదే మంచిదేమో అన్పిస్తోంది.
ఆ జ్ఞాపకం.. మరువలేనిది
అమ్మా క్షేమం అంటూ.. ఊరికి ఉత్తరం పంపడం, నాన్న నుంచి ఉత్తరం ఎప్పుడొస్తుందాని కాలేజీ పోస్టుబాక్సు వైపు ఎదురు చూడటం.. ఈ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తే.
- వనం దుర్గాప్రసాద్