బూటిజం..
చలికాలం వచ్చేసిందంటే, జనం వెచ్చదనం కోసం వెంపర్లాడతారు. అవకాశం దొరికితే దుప్పటి ముసుగు తన్నేసి ముడుచుకుపోతారు. ముసుగు తన్నేసే అవకాశం ఎల్లవేళలా ఉండదు కదా! చలి తాకిడి ఎంతగా వణికిస్తున్నా, పనుల కోసం బయటకు రాక తప్పదు. బయటకు వచ్చేటప్పుడు స్వెటర్లు, శాలువలు.. జాకెట్లు, జర్కిన్లు.. మఫ్లర్లు, మంకీక్యాపులు.. దొరికినవి దొరికినట్టుగానే చుట్టేసుకుని, ముసుగువీరుల్లా వీధుల్లోకి వస్తారు. వెచ్చదనం కోసం పైపైనే కప్పుకునే వారు, పాదాలను మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడూ వాడే చెప్పులు లేదా షూస్‌తోనే సరిపెట్టేసుకుంటారు. అయితే, ఫ్యాషన్‌ప్రియుల తీరే వేరు.
ఏ కాలంలోనైనా కళాపోషణలో తీసిపోరు. నిజానికి మిగిలిన కాలాలతో పోలిస్తే, ఫ్యాషన్‌కు అనువైనది. మిరుమిట్లు గొలిపే రంగు రంగుల ఉలెన్ దుస్తులను ధరించవచ్చు. కాలిపిక్కల వరకు కవర్ చేసే బూట్లు తొడగవచ్చు. చలికాలంలో ఎన్ని రకాల దుస్తులు తొడిగినా, వాటికి నప్పే బూట్లు ధరిస్తేనే వింటర్ అలంకరణ పూర్తయినట్లని ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం. పెపె పంప్స్, ఉలెన్ బూట్స్, టైగర్ ప్రింటెడ్ బూట్స్ వంటి వెరైటీ బూట్లు ఈ సీజన్‌లో సరికొత్తగా అందుబాటులోకి రావడంతో అమ్మాయిలు వీటిని ధరించి ట్రెండీగా కనిపిస్తున్నారు. పెన్సిల్ కట్ జీన్స్, స్కర్ట్స్ ధరించినప్పుడు వాటికి జతగా మోకాలి వరకు కప్పి ఉంచే బూట్లు ధరిస్తే, ఆ లుక్కే అదరహో! అనిపిస్తుంది. బూట్లు ధరించినప్పుడు యాక్సెసరీలు తక్కువగా ధరించడం మంచిది. అలాగైతేనే, అందరి దృష్టీ బూట్లపై నిలుస్తుంది.
టాప్ టిప్స్..
బూట్లు ధరించినప్పుడు టిప్ టాప్‌గా కనిపించాలంటే, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఫ్యాషన్ నిపుణులు సూచించే టాప్ టిప్స్ ఇవే..
డెనిమ్ షార్ట్ ప్యాంట్, మందంగా ఉండే స్కేటర్ స్కర్ట్ వంటి వాటిపై బూట్లు ధరిస్తే, తప్పనిసరిగా స్టాకింగ్స్ వాడాలి.
అలాంటప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించాలంటే, జుట్టును బన్‌లా ముడి వేసుకుంటే చాలు.
పొడవాటి స్వెట్టర్లు, లాంగ్ జాకెట్లు ధరించినట్లయితే, వాటికి బ్రౌన్‌కలర్ బూట్లు బాగా నప్పుతాయి.
పూర్తిగా నల్లని దుస్తులే ధరించేటప్పుడు మాత్రం నల్లని బూట్లే ధరించాలి. వాటికి నప్పేలా రెడ్/ఆరెంజ్/స్కైబ్లూ స్కార్ఫ్‌లు
ధరిస్తే అద్భుతంగా కనిపిస్తారు.
లేతరంగుల దుస్తులు ధరించినట్లయితే, వాటిపైకి యానిమల్ ప్రింటెడ్ బూట్లు ట్రెండీగా ఉంటాయి.
లేసులు ఉన్న బూట్లు, లెదర్ బూట్లను ధరించేటప్పుడు స్టాకింగ్స్ వాడటం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోవాలి.
- సిద్ధాంతి