
ఇప్పటికైతే ఆ యోచన లేదు
విశ్వనాథన్ ఆనంద్.. అరవైనాలుగు గళ్ల సామ్రాజ్యానికి రారాజుగా అందరికీ తెలుసు.
విశ్వనాథన్ ఆనంద్.. అరవైనాలుగు గళ్ల సామ్రాజ్యానికి రారాజుగా అందరికీ తెలుసు. తెలుపు, నలుపు పావులతో ప్రపంచ ఖ్యాతి పొందిన ఈ మాస్టర్ తనకు చెస్ నేర్పింది మాత్రం అమ్మే అని చెబుతున్నాడు. శుక్రవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆనంద్.. సిటీతో తనకున్న అనుబంధాన్ని సిటీప్లస్‌తో పంచుకున్నాడు.
- కంచుకట్ల శ్రీనివాస్
అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన రెండు మెగా టోర్నమెంట్లలో విజేతగా నిలిచింది హైదరాబాద్‌లోనే. అంతేకాదు జూనియర్ చాంపియన్ ట్రోఫీలో కూడా ఇక్కడ పాల్గొన్నాను. అందుకే హైదరాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. చారిత్రక సంపదకు నిదర్శనంగా కనిపించే భాగ్యనగరంలో అన్ని టూరిస్ట్ స్పాట్‌లు ఇష్టమే. చార్మినార్ అంటే చాలా ఇష్టం. ఇక హైదరాబాద్ వస్తే ఇక్కడి బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్లను. ఇక్కడ బంధువులు కూడా ఉన్నారు. ఇప్పట్లో సిటీలో చెస్ ట్రేనింగ్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచనైతే లేదు.
బ్రెయిన్ గేమ్..
దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది విద్యార్థులు చెస్‌ను ప్రత్యేక హాబీగా ఎంచుకున్నారు. హైదరాబాద్‌లో చెస్ క్రీడకు ఆదరణ పెరుగుతోంది. ప్రతి స్కూల్‌లో విద్యార్థులు ఈ క్రీడను ప్రత్యేకంగా ఎంచుకోవడం శుభపరిణామం. చెస్ అనేది బ్రెయిన్ గేమ్ అని మరచిపోవద్దు. ఈ క్రీడను ఎంచుకుంటే అందుకు తగ్గట్టుగా కృషి చేయాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఫిట్‌నెస్ కూడా చాలా అవసరం. శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పుడే మన మెదడు చురుకుగా ఆలోచిస్తుంది. అప్పుడే ఈ రంగంలో రాణించగలం. ఇక తెలుగుతేజం కోనేరు హంపికి మంచి భవిష్యత్తు ఉంది.