నేను సంపాదించుకున్నది అదే.. | I earned good name with Hyderabad state chief minister | Sakshi
Sakshi News home page

నేను సంపాదించుకున్నది అదే..

Published Sun, Sep 14 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

నేను సంపాదించుకున్నది అదే..

నేను సంపాదించుకున్నది అదే..

బూర్గుల రామకృష్ణారావు.. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి! ఆయన నడతే అతని వారసులకు సంపదైంది. ఆ సంపదను రెండింతలు చేసి ఆ పరంపరను నిలిపాడు రామకృష్ణారావు తమ్ముడి కొడుకు బూర్గుల నర్సింగ రావ్! కమ్యూనిస్ట్ లీడర్‌గా, ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్‌గా పనిచేసి ప్రస్తుతం ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారాయన. నేడు... బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి.. ఈ సందర్భంగా నర్సింగరావు తన పెద్దనాన్న గురించి మననం చేసుకున్నారు. విశేషాలు ఆయన మాటల్లోనే..
 
 పెద్దనాన్న (బూర్గుల రామకృష్ణారావు) మృదుస్వభావి. లిబరల్‌గా ఉండేవారు. తెలుగు, ఉర్దూ, పర్షియన్, సంస్కృతం, ఇంగ్లిష్ భాషల్లో దిట్ట. మా కుటుంబంలో ఇంగ్లిష్ మా పెద్దనాన్న, నాన్నతోనే మొదలైంది. పెద్దనాన్నకు మరాఠీ, కన్నడ భాషలూ తెలుసు. కేరళకు తొలి గవర్నర్‌గా వెళ్లి మలయాళం కూడా నేర్చుకున్నాడు. ఉమర్‌ఖయ్యాం పర్షియన్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. ఇక్కడి ధర్మవంత్ స్కూల్లో స్కూలింగ్, నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్ చేసి పుణే ఫెర్గ్యూసన్ కాలేజ్‌లో బీఏ, ముంబైలో ఎల్‌ఎల్‌బీ చేశారు. సిటీకి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించారు. పెదనాన్న దగ్గర పీవీ నరసింహారావు జూనియర్‌గా ఉండేవారు.
 
 ఫుల్‌టైమ్ పాలిటిక్స్..
 1944, 45 నుంచి ఫుల్‌టైమ్ పాలిటిక్స్‌లోకొచ్చారు. ఆయన హైదరాబాద్ స్టేట్‌కి ముఖ్యమంత్రి అయి ‘దిల్‌కుషా’లోకి మారేంత వరకు మాది ఉమ్మడి కుటుంబమే.  ఆంధ్రజన సంఘం, ఆంధ్రమహాసభ రెండింట్లోనూ యాక్టివ్‌గా ఉండేవారు. రెండో ఆంధ్రమహాసభకు పెద్దనాన్నే అధ్యక్షుడు. గాంధీగారి ప్రభావం చాలా ఉంది ఆయన మీద.  క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో అక్కడ గాంధీ నిరాహారదీక్ష చేస్తే, ఇక్కడ పెద్దనాన్నా నిరాహార దీక్ష చేశారు. ఆయనను చూసి నేనూ ఉపవాసం ఉన్నాను.  నాపై  ఆయన ప్రభావం అంతలా ఉండేది.  
 
 ఒక్కమాటా అనలేదు..
 నేను కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడినై అండర్ గ్రౌండ్‌కీ వెళ్లాను. నేను అరెస్ట్ అయినప్పుడు పెద్దనాన్న మినిస్టర్ కూడా. మా నాన్న చాలా కోపిష్టి. ఆయనకు విరుద్ధం పెద్దనాన్న. నేను విడుదలై వచ్చాక నా మీద కోపంతో నాన్న అరుస్తుంటే.. ‘వాడిమీద అట్లా అరవకు, నెమ్మదిగా చెప్పు’ అనేవారు పెద్దనాన్న. అంతేతప్ప ఎప్పుడూ నా దారి మార్చుకొమ్మని అనలేదు. 1952లో ముల్కీ ఉద్యమమప్పుడు.. నేను నిజాం కాలేజ్‌లో ఎంఏ చదువుతున్నాను. సిటీ కాలేజ్ నుంచి కోఠీ ఇప్పటి ఈఎన్‌టీ హాస్పిటల్ వరకు పెద్ద ర్యాలీ తీశాం. కోఠీ వరకు వచ్చాక నేను క్యాంపస్ వెళ్లిపోయాను. ర్యాలీ అబిడ్స్‌వైపు మళ్లింది. అందులో కొందరు స్టూడెంట్స్‌కి ఈఎన్‌టీ హాస్పిటల్ ఆవరణలో ముఖ్యమంత్రి కారు కనిపించేసరికి లోపలకు వచ్చి కారును కాల్చేశారు. అయితే మా పెద్దమ్మ ఆ కారులో హాస్పిటల్‌లో జరుగుతున్న ఓ మహిళామండలి మీటింగ్‌కి వచ్చింది. కారును కాల్చేస్తున్నప్పుడు ఆమె మీటింగ్‌లో ఉంది. ‘కొడుకు కాబట్టి రామకృష్ణారావు ఏమనట్లేద’ని పెదనాన్నను కొందరు కామెంట్ చే శారు.   
 
ఆయన చెప్పలేదు.. నేనూ ఇబ్బంది పెట్టలేదు
 కమ్యూనిస్ట్ ముద్రతో ప్రభుత్వ ఉద్యోగానికి దూరంగా ఉన్నా. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నా.. కానీ ఉద్యోగం ఇప్పించమని ఆయనను అడగలేదు. ఆయనా రెకమెండ్ చేయలేదు. ఒక్కసారి.. జైలు నుంచి వచ్చాక మళ్లీ కాలేజ్‌లో చేరడానికి  పర్మిషన్ ఇప్పించమని అడిగా. అప్పుడు ఉస్మానియా వీసీ అలియావర్ జంగ్. అలియావర్‌జంగ్‌కి ఓ ఉత్తరం రాసి నన్ను వెళ్లి కలవమని చెప్పారు. ఆయనకు ఫోన్ కూడా చేశారు. అలియావర్ జంగ్‌ని వెళ్లి కలిశా... ‘అసలు అటెండెన్స్ లేకుండా పర్మిషన్ ఎలా ఇస్తారు?’అన్నారాయన.
 
 ‘మీరు తలుచుకుంటే అవుతుంది’ అన్నా. ‘కుదరదు’ అని కరాఖండిగా చెప్పి మా పెద్దనాన్నకు ఫోన్ చేశారు ‘పర్మిషన్ ఇవ్వడం వీలుకాదు. అంతమాత్రాన వర్రీ కావల్సిందేం లేదని చెప్పండి. నవంబర్‌లో ఎగ్జామ్స్ రాయమనండి’ అని. ఇంకోసారి.. చైనాలో జరుగుతున్న ఓ స్టూడెంట్ కాన్ఫరెన్స్‌కి వెళ్లేందుకు పాస్‌పోర్ట్‌కి అప్లయ్ చేసుకుంటే రిజెక్ట్ అయింది. పెద్దనాన్నకి చెప్తే నవ్వి ఊరుకున్నారు అప్పటికి. నెల్లాళ్ల తర్వాత అడిగారు నీ పాస్‌పోర్ట్ ఏమైంది? అని. ‘మీ గవర్నమెంట్ ఇవ్వనంది కదా’ అన్నా.  అప్పటికి సెలైంట్‌గా ఊరుకొని సెంట్రల్ మినిస్టర్‌కి  నాకు పాస్‌పోర్ట్ జారీ చేయమని ఉత్తరం రాశారు ! అంతే! ఈ రోజు హైదరాబాద్ సమాజంలో నాకున్న స్థానం... రెస్పెక్ట్.. నా అంతట నేను సంపాదించుకుందే! ఆయన గౌరవాన్ని కాపాడానే తప్ప ఇరకాటంలో పెట్టలేదు. ఆయన మాకు నేర్పిన విలువా అదే!
 -  సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement