మన దేశం గురించి నమ్మలేని నిజం | India in Dangerous countries | Sakshi
Sakshi News home page

మన దేశం గురించి నమ్మలేని నిజం

Published Wed, Mar 5 2014 2:24 PM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

మన దేశం గురించి నమ్మలేని నిజం

మన దేశం గురించి నమ్మలేని నిజం

ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో 3వ స్థానంలో భారత్‌
1,2 స్థానాల్లో  ఇరాక్‌, పాకిస్థాన్‌
2013లో భారత్‌లో 212 బాంబు పేలుళ్లు
2013లో భారత్‌లో బాంబు దాడి మృతుల సంఖ్య 130
2004 -2013 మధ్య భారత్‌లో 298 మందుపాతర పేలుళ్లు
2004 -2013 మధ్య భారత్‌లో మరణాలు - 1,337
ఇరాక్, పాక్, భారత్లలోనే 75 శాతం పేలుళ్లు!

మన దేశం గురించి మీరు ఇప్పుడు ఒక నమ్మలేని నిజం తెలుసుకోబోతున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో మన దేశం పేరు కూడా ఉంది. భారతీయుడిగా బాధపడవలసిన వార్త ఇది. నిత్యం బాంబుదాడులతో దద్దరిల్లే ఆఫ్ఘనిస్థాన్‌, సిరియాకన్నా మనం మరింత ప్రమాదకరస్థితిలో ఉన్నామని ప్రభుత్వ నివేదికే వెల్లడిస్తోంది. ఈ విషయంలో ఇరాక్‌, పాకిస్తాన్‌ తర్వాత స్థానం మనదే కావడం ఆందోళనకలిగించే అంశం. బౌద్ధం పుట్టిన భూమిపై బాంబులు పేలడం బాధాకరం.

ఎప్పుడు ఏ బాంబు పేలి మరణాలు సంభవిస్తాయో తెలీని ప్రమాదకర వాతావరణం భారత్‌లోనే ఎక్కువగా ఉందని నేషనల్‌ బాంబ్‌ డాటా సెంటర్‌ (ఎన్బిడిసి) నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ఇలాంటి వాతావరణమున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. నిరంతరం బాంబుదాడులు, పేలుళ్లు జరిగే ఇరాక్‌, పాకిస్థాన్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా తర్వాతి స్ధానంలో భారత్‌ ఉంది. ఉగ్రవాదుల బాంబు దాడులు, మావోయిస్టుల పేలుళ్లు భారత్‌లో నిత్యకృత్యమయ్యాయి. దీంతో మరణాల సంఖ్య కూడా ఊహించనంత ఉంటోంది. ఒక్క 2013లోనే భారత్‌లో 212 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ సంఖ్య తాలిబన్లు అత్యంత యాక్టివ్‌గా ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌ కన్నా రెట్టింపు. 2012తో పోలిస్తే బాంబు పేలుళ్లు, దాడుల సంఖ్య తగ్గినా భారత్‌లో ఇప్పటికీ ఆందోళనకర పరిస్థితే ఉంది. 2013లో జరిగిన బాంబు పేలుళ్లు, దాడుల్లో మన దేశంలో 130 మంది చనిపోయారు. దాదాపు 5 వందల మంది గాయపడ్డారు.

గడచిన దశాబ్ధంలో అంటే 2004 నుంచీ 2013 వరకూ భారత్‌లో 298 మందుపాతర పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 1,337 మంది చనిపోయారు. ప్రపంచంలో జరుగుతున్న 75 శాతం పేలుళ్లు భారత్‌, పాక్‌, ఇరాక్‌లోనే జరుగుతున్నాయని ఎన్బిడిసి నివేదికలో పేర్కొన్నారు. ప్రజలు లక్ష్యంగా జరిగే దాడులు భారత్‌లో 58 శాతం ఉండగా, ఇతర దేశాల్లో 69 శాతం ఉంది. భద్రతా దళాలు, ప్రభుత్వ ఆస్తుల పైనా దాడులు కొనసాగుతున్నాయి. అప్రమత్తత కారణంగా భద్రతా దళాలు తమపై దాడుల సంఖ్యను 40 శాతం మేరకు తగ్గించుకోగలిగాయి. అయితే ప్రజలపై జరుగుతున్న దాడులపై మాత్రం ఈ అప్రమత్తత లేదనేది సుస్పష్టంగా తెలుస్తోంది.

భారత్‌లో ఈశాన్య రాష్ట్రాల్లోనూ, మావోయిస్టు ప్రభావిత బీహార్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 80 శాతం మందు పాతర పేలుళ్లు జరుగుతున్నాయి. జమ్ముకాశ్మీర్‌లో బాంబు దాడి ఘటనలు 50 శాతం మేర పెరిగాయి. నివేదిక వివరాలు చూస్తుంటే సగటు భారతీయుడికి వర్తమానంతో పాటు భవిష్యత్‌ భారతంపై ఆందోళన కలగకమానదు. ఈ నేపధ్యంలో అప్రమత్తతతో పాటు ఉగ్రవాదుల, మావోయిస్టుల కదలికలను కనిపెట్టగలిగే వ్యవస్థలను రూపొందించడం అత్యవసరమని రక్షణ, భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. దాడులకు సంబంధించి పథక రచన సమయంలోనే గుర్తించి కుట్రలను విఫలం చేయగలగడం, దాడులను సమర్థంగా తిప్పికొట్టగలగడం అతి ముఖ్యమంటున్నారు. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే విషయంలో ఇజ్రాయిల్‌ లాంటి దేశాలు అనుసరిస్తోన్న మార్గాల నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకోవాలని నిపుణులు  సూచిస్తున్నారు. దేశ రక్షణ, ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వాలు రాజీపడకుండా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని ఫణంగా పెట్టవద్దని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement