
సాక్షి,న్యూఢిల్లీ: రోజూ తీసుకునే తొలి ఆహారం బ్రేక్‌ఫాస్ట్‌పై భారతీయులు భారీగానే వెచ్చిస్తున్నారని డైనింగ్ పరిశ్రమపై పరిశోధించిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ వెల్లడించింది. 2015లో భారతీయులు ఉదయం తీసుకునే అల్పాహారంపై చేసిన ఖర్చు కంటే 2016లో 56 శాతం అధికంగా వెచ్చించారని ఈ నివేదిక పేర్కొంది. రోజువారీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన శక్తిని సమీకరించుకునేందుకు బ్రేక్‌ఫాస్ట్ కీలకమని ప్రజలు గుర్తించడంతోనే రెస్టారెంట్లు కిటకిటలాడుతున్నాయని తెలిపింది.
ఆమ్లెట‍్ల వంటి నాన్ వెజ్ ఐటెమ్సే కాకుండా ఇతర ఆహార పదార్థాలనూ భారతీయులు అల్పాహారం కోసం ఇష్టంగా తీసుకుంటున్నారని పేర్కొంది. బెంగుళూర్,ఢిల్లీ,ముంబయి సహా పలు భారతీయ నగరాల్లో అల్పాహారంపై చేసే ఖర్చు గణనీయంగా పెరిగిందని తెలిపింది. పోషకాహారం ప్రాధాన్యతను ప్రజలు గుర్తించడంతో కూడా బ్రేక్‌ఫాస్ట్‌పై భారతీయులు చేసే ఖర్చు పెరిగేందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు రోజూ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడం, అల్పాహారం తీసుకోవడంలో జాప్యం చేయడం వంటివి దీర్ఘకాలంలో పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.