
30 ప్లస్ మహిళల కోసం సినీనటి డిజైనింగ్ వేర్
సినిమా పాటల్లో పల్లవికో రకం, చరణానికో తరహా కాస్ట్యూమ్స్‌లో తళుక్కుమనడం కథానాయికలకు మామూలే.
సినిమా పాటల్లో పల్లవికో రకం, చరణానికో తరహా కాస్ట్యూమ్స్‌లో తళుక్కుమనడం కథానాయికలకు మామూలే. అందుకే డ్రెస్ సెన్స్‌లో వారు ముందంజలో ఉంటారు. సినీ నేపథ్యం నేర్పించిన ఫ్యాషన్ పాఠాలను ఔపోసన పట్టిన జయసుధ ఫ్యాషన్ డిజైనర్‌గా మారిపోయారు. సంప్రదాయ డిజైన్లకు నయా పోకడలు మిక్స్ చేసి సహజమైన అందానికి ప్రతీకగా నిలిచే డిజైన్లను ఆవిష్కరిస్తున్నారు. ఈ కలెక్షన్లను జే8 బై జయసుధ పేరుతో బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారాలో ప్రదర్శనకు ఉంచారు. సోమవారం మొదలైన ఈ ఎక్స్‌పో ఇవాళ్టితో ముగుస్తుంది. ఈ సందర్భంగా జయసుధను సిటీప్లస్ పలకరించింది.
నిజానికి చెప్పాలంటే నేను ఏ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేయలేదు. ఆడపిల్లగా పుట్టడమే నాకు మొదటి స్ఫూర్తి. సినిమా రంగంలోకి వచ్చిన కొత్తల్లోనే నాకు రకరకాల కాస్ట్యూమ్స్, డిజైనర్ కలెక్షన్ల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. సినిమాల్లో నా పాత్రలకు సంబంధించి నాకు ఇచ్చే కాస్ట్యూమ్స్‌ను ఎంతో ఇష్టంగా వేసుకునేదాన్ని. ఆ ఇష్టం, ఇంట్రెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్‌ను ఇప్పుడు ప్రవృత్తిగా మార్చింది.
30 ప్లస్ కోసం..
కొత్తదనాన్ని ఈ తరం అమ్మాయిలు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అలాగని సంప్రదాయాన్ని ఏ కోశానా వదులుకోవడం లేదు. యువతుల కోసం, ఇరవై నుంచి ముప్పయ్ ఏళ్ల మధ్య ఉన్న మగువల కోసం ఎందరో డిజైనర్లు రకరకాల కలెక్షన్ తీసుకొస్తున్నారు. నేను 30 ప్లస్ మహిళల కోసం ఎక్కువగా డిజైన్ చేస్తుంటాను. వారు మాత్రం డిజైనింగ్ వేర్ వేసుకోవాలనుకోరా..? అందుకే వారి కోసం నా దగ్గర సరికొత్త డిజైన్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి.
లేటెస్ట్.. ట్రెడిషనల్..
చీరల్లో ఎన్ని క్రియేటివిటీలు చూపించొచ్చో, ఎన్ని రకాల ఫ్యాబ్రిక్‌లు ఉన్నాయో అన్ని రకాలనూ కలిపి ఫ్యుషన్ శారీస్‌గా మలుస్తుంటాను. రాసిల్క్, కోటా, కంఫర్ట్ కాటన్, జ్యూట్, సీక్వెన్స్.. ఇలా అన్ని రకాలు మిక్స్ చేసిన శారీస్‌ను ఇప్పుడు ఎక్కువగా ప్రిఫ ర్ చేస్తున్నారు. హైదరాబాదీ అమ్మాయిలు కల్చర్‌లో, రిచ్‌నెస్‌లో, యూనిక్‌నెస్‌లో.. ఇలా అన్నింట్లో నంబర్ వన్‌గా, స్పెషల్‌గా కనబడాలని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఆరేళ్ల కిందట జే8 స్టార్ట్ చేశాను. నేను డిజైన్ చేసే కలెక్షన్ ఆధునికంగా ఉంటూనే, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. చీరలు, చుడీదార్లు, అనార్కలి టాప్స్ ఇలా అన్ని రకాల ట్రెడిషనల్ వేర్‌ని డిజైన్ చేస్తున్నాను.
- శిరీష చల్లపల్లి