కిరణ్ బేడీ
భారతదేశం ఎంతో గొప్పగా శ్లాఘించిన ఓ మహిళా పోలీసు అధికారి, ప్రతి యువతికి ఆదర్శంగా నిలిచిన తొలి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ అవకాశం కోసం బిజెపివైపు చూస్తున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్తోపాటు ఆమె అవినీతి వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. అయితే ఆ తరువాత ఆమె అరవింద్ కేజరీవాల్ను వ్యతిరేకించారు. న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేసిన కిరణ్ బేడీ మొదటి నుంచి బిజెపి పట్ల సానుభూతితోనే ఉన్నారు. ఆమె నరేంద్ర మోడీకి అనుకూలంగా ప్రకటనలు కూడా చేశారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆమె బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. వాస్తవారినికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందుకు రమ్మని కోరింది. అయితే అప్పట్లో ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. మారిన రాజకీయ పరిస్థితులలో ఇప్పుడు ఆమె సిద్దంగా ఉన్నారు.
అసెంబ్లీని రద్దుచేయండి, ఎన్నికలకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ చెప్పడంతో బీజేపీ శ్రేణులు అందుకు సమాయత్తమవుతున్నాయి. ఢిల్లీ పీఠాన్ని అధిష్టించేందుకు బిజెపి తగిన ఎత్తులు వేస్తోంది. ఈ తరుణంలో కిరణ్ బేడీ కూడా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించే అకాశం వస్తే వదులుకోవడానికి సిద్దం లేరు. ఢిల్లీ సీఎం కావాలనుకుంటున్నారా? అని కిరణ్ బేడీని ప్రశ్నిస్తే '' అడిగితే సీఎం పదవిని స్వీకరిస్తాను' అని ఆమె ట్వీట్ చేయడంతో ఢిల్లీతోపాటు దేశమంతటా ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. పలువురు నేతలు కూడా కిరణ్ బేడీ సిఎం కావాలని కోరుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో కిరణ్ బేడి కనక బిజెపిలో చేరితే ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అవకాశం కల్పిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. తాను గత 35-40 ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటున్నానని, తన మిగిలిన జీవితాన్ని ఢిల్లీ సంక్షేమం కోసం త్యాగం చేస్తానని కూడా ఆమె చెప్పారు. గుజరాత్ తరహా అభివృద్ధిని ఢిల్లీలో కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. ఈ మాటలను బట్టి ఆమె త్వరలోనే బిజెపిలో చేరే అవకాశం ఉంది.