కిషన్-అక్బర్ తేరో నామ్ | kishan - akbar tero nam | Sakshi
Sakshi News home page

కిషన్-అక్బర్ తేరో నామ్

Published Sun, Nov 30 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

కిషన్-అక్బర్ తేరో నామ్

కిషన్-అక్బర్ తేరో నామ్

narendrayan-18
ఇంతకీ మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్  హిందువా? ముస్లిమా?  దేవాలయాలలో, దర్గాలలో, ఆయా మతస్తుల వేడుకల్లో తలలో నాలుకలా కలసిపోయే వారు నిజాం ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్! ఈ నేపథ్యంలో ఒక సందర్భంలో ఒకరు,  మీరు హిందువు కాదు ముస్లిం అని భావిస్తున్నాను అన్నారు. అన్యాపదేశంగా సమాధానం ఆశించారు. ప్రజల మహారాజ్  ఇలా అన్నారు, ఆశువుగా..
మై హూ హిందూ/మై హూ ముసల్మాన్/హర్ మజబ్ హై మెరా ఇమాన్
‘షాద్’కా మజబ్ షాద్ హీ జానే/ ఆజాదీ ఆజాద్ హీ జానే’
‘నేను హిందువును/ నేను ముసల్మాన్‌ను/అన్ని మతాలూ నా ధర్మంలోనివే
‘షాద్’ మతమేమిటో షాద్ కే తెలుసు /విముక్తునికే ముక్తి తెలుసు’
 

‘షాద్’ మిత్రుడు పఠాన్!
సుకవి జీవించు ప్రజల నాల్కలపైన అన్నట్లు కిషన్ ప్రసాద్ కలంపేరుతో ఏర్పడింది మహబూబ్ నగర్ జిల్లాలోని ‘షాద్’నగర్ ! ‘హైదరాబాద్ తెహజీబ్ (అన్యోన్యత)’ అంటే ఏమిటి? ఎవరైనా ప్రశ్నిస్తే కిషన్ ప్రసాద్ జీవితాన్నే ఉదహరించవచ్చు!  ‘షాద్’ (సంతుష్ట) తత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తి నవాబ్ అక్బర్ యార్‌జంగ్ బహదూర్. ఖైబర్ కనుమ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన పఠాన్‌ల కుటుంబీకుడు. 16వ ఏట లా చదివేందుకు హైదరాబాద్ వచ్చాడు. మాజీ రాష్ట్రపతి జాకీర్‌హుస్సేన్ తండ్రి, న్యాయవాది ఫిదాహుస్సేన్ ఖాన్ దగ్గర సహాయకునిగా పనిచేశారు. న్యాయవాదిగా, హైకోర్టు న్యాయమూర్తిగా, నిజాం హోంశాఖ కార్యదర్శిగా పదోన్నతులు పొందారు.

‘జకత్’తో పాటు ప్రతి గురువారం పేదలకు దానధర్మాలు చేసేవారు. అన్ని ఉపవాసాలూ పాటించేవారు. 80 ఏళ్ల సాఫల్య జీవనంలో ఒక్కపర్యాయం కూడా ప్రార ్థనను విస్మరించలేదు. 72వ ఏట హజ్ యాత్ర చేశారు. జమైతె-ఎ-అహ్మదీయ సభ్యుడైనప్పటికీ అన్ని సమూహాల ముస్లింలు గౌరవించేవారు. బూర్గుల రామకృష్ణరావు, మాడపాటి హనుమంతరావు వంటి పెద్దలూ అభిమానించేవారు. మహాత్మాగాంధీ హత్య నేపథ్యంలో నిజాం కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా పెద్దలంతా ఆయన్ను కోరారు.
 
వివాదానికి ఎవరు అతీతులు..?

అందరూ మెచ్చేవారూ  ఒక్కోసారి వివాదాస్పదం అవుతారు! సందర్భం 1936 ఆగస్ట్ 1. కృష్ణ జన్మాష్టమి. యంగ్‌మెన్స్ కాయస్థ యూనియన్ ఆఫ్ హైదరాబాద్  ఆధ్వర్యంలో హుస్సేనీ ఆలంలోని రాజా నర్సింగరావు బహదూర్ దేవిడీలో బహిరంగ సభ. హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మీర్జాయార్‌జంగ్ బహదూర్ అధ్యక్షుడు. నగర ప్రముఖులు, హిందూ-ముస్లిం అశేష ప్రజానీకం హాజరయ్యారు. మహారాజా కిషన్ ప్రసాద్ రచించిన హిందూముస్లింల సఖ్యతను శ్లాఘించే ప్రార్థనా గీతంతో సభ మొదలైంది. హైకోర్ట్ న్యాయమూర్తి నవాబ్ అక్బర్ యార్‌జంగ్ ప్రధాన ఉపన్యాసం ప్రారంభించారు ‘శ్రీకృష్ణ: హిందూ ప్రవక్త’ అనే అంశంపై! ఖురాన్ ను, ఉదార విశ్వాసులను ఉటంకిస్తూ వినూత్న ప్రతిపాదనలు తెచ్చారు!
 
ఉదహరించబడని ప్రవక్త!
ప్రతి ఒక్కరికీ మార్గదర్శకుడు ఉంటారు (13:7) ఇంతకు ముందు కూడా మార్గదర్శకులు పంపబడ్డారు. అందులో పేర్లు ఉదహరింపబడ్డవారే కాదు, ఉదహరింపబడని వారూ ఉన్నారు (40 :78) అనే రెండు ప్రవచనాలను ఖురాన్ నుంచి ఉదహరించారు. ఈ నేపథ్యంలో ‘కృష్ణుడు ఖురాన్‌లో ఉదహరింపబడనప్పటికీ ఆయన పూర్వపు ప్రవక్త కాదని ఎందుకు అనుమానించాలి? సమస్త ఆసియాపై సాంస్కృతిక ప్రభావాన్ని చూపిన మార్గదర్శి గ్రీస్‌కు ఈజిప్ట్‌కు మార్గదర్శి కాడా? నబీలు- పైగంబర్‌లు, రుషులు-మునులు, ప్రవక్త-అవతారము అనే పదాల సారూప్యతలను గుర్తించాలన్నారు. ఖురాన్ ప్రకారం ఏ ముస్లిమూ ప్రవక్తల పట్ల హెచ్చుతగ్గులు పాటించరన్నారు. నోవా-అబ్రహాం-జీసస్‌ల పరంపరలోని చివరి ప్రవక్త అయిన మహ్మద్ ప్రవక్తతో పాటు ‘ఉదహరించబడని ప్రవక్త’  శ్రీకృష్ణునికి అలాహిసలామ్‌లు (ఆశీర్వాదాలు శాంతి అనుగ్రహింపబడు గాక) అర్పించారు.
 
అధికారులకు, పత్రికలకు నిజాం ఫర్మానా!
నగరంలో కలకలం!  ముస్లింలు ప్రార్థించే ప్రవక్తలతోపాటు అక్బర్ యార్‌జంగ్ శ్రీకృష్ణునికి అలాహిసలామ్‌లు చెబుతారా? సాంప్రదాయ ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు సైతం ఈ తరహా వాస్తవ విరుద్ధ కల్పనలను అంగీకరించరని పత్రికల్లో విమర్శలొచ్చాయి. నిజాంపై ఒత్తిడులు, లిఖిత ఫిర్యాదులూ!  నిజాం ఆయన భరతం పడతారని, ఉద్యోగం ఊడగొడతారని కొందరు చెవులు కొరుక్కున్నారు. ‘ప్రస్తుత శాంతియుత పరిస్థితులకు విఘాతం కల్గించే రీతిలో ప్రభుత్వాధికారులు, మత-రాజకీయ అంశాలపై వ్యాఖ్యానాలు చేయరాదని, పత్రికలూ ప్రోత్సహించరాద’ని 1936 ఆగస్ట్ 22న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశం జారీ చేశారు. నిజాంకు, కిషన్ ప్రసాద్‌కు అక్బర్ యార్‌జంగ్‌పై ఉన్న గౌరవం గురించి తెలియని వారి ఆశలు ఫలించలేదు.
 
‘ఉపన్యాసం’ ఇచ్చిన నాలుగు నెలలకు హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ కావాల్సిన అక్బర్ యార్‌జంగ్ పదవీకాలాన్ని అసాధారణ రీతిలో నిజాం రెండేళ్లు పొడిగించారు. ఆ తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించారు. నాలుగేళ్లు ఆ పదవిలో ఉన్నారు. అక్బర్ యార్‌జంగ్ తన అంతరాత్మ ప్రబోధించిన సత్యాన్ని నిర్భయంగా శిరసెత్తి ప్రసంగించారు! ‘వివిధ మతాల మధ్య ఐకమత్యం పెంచేందుకు కృషి చేయాల’ని అన్ని మతాలవారికీ ఆయన హితవు పలికారు! కిషన్ ప్రసాద్-అక్బర్ యార్ జంగ్ వేర్వేరు వ్యక్తులా!
 ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement