Akbar yarjang
-
రజ్వీ.. లాతూర్ ప్రకంపన
హైదరాబాద్ స్టేట్ శతాబ్దాలుగా మత సామరస్యానికి చిరునామాగా నిలిచింది. పాలకులు ఢిల్లీ సుల్తానులకు ఆ తర్వాత బ్రిటిష్ వారికి నమ్మకస్తులుగా మారారు. స్వతంత్ర రాజ్యానికి ఉండాల్సిన అన్ని హంగులూ ఉన్నా, ప్రజల రక్షణ భాధ్యతలను ‘పై’వారికి అప్పగించారు. వారి వారసుడు ఏడో నిజాం. కిషన్ ప్రసాద్, అక్బర్ యార్జంగ్ వంటి సామరస్య వ్యక్తిత్వాలు లేని లోటు ఆయన అధికారానికి చరమగీతం పాడింది. మత భావనలు తీవ్రంగా వీచాయి. అధికారం అనే దీపం ఆరకూడదని నిజాం విఫలయత్నాలు చేశాడు! ఈ క్రమంలో కాశిం రజ్వీ కథ! ‘మజ్లిస్-ఎ-ఇత్తెహాద్-ఉల్ ముసల్మీన్’ అధ్యక్షుడు బహదూర్ యార్జంగ్ 1946లో అకస్మికంగా మరణించిన వైనం (Legends and Anecdotes of Hyderabad ) గురించి చెప్పుకున్నాం కదా! ఆయనోసారి హైదరాబాద్ స్టేట్‌లోని లాతూర్ (ప్రస్తుతం మహారాష్ట్ర) వెళ్లారు. పార్టీ కార్యాలయం కోసం తగిన వసతి చూడమని పార్టీ సభ్యులను కోరారు. ఒక వ్యక్తి తన ఇంటిని పార్టీ కార్యాలయానికి ఇస్తాన న్నాడు. క్షణాల్లో ఇంట్లోని సామాన్లను వీధుల్లోకి విసిరేశాడు. అధ్యక్షుడు హృదయానికి హత్తుకున్న ఆ కార్యకర్త సయ్యద్ కాశిం రజ్వీ ! బహదూర్ యార్జంగ్ మరణానంతరం సహజంగానే పార్టీ అధ్యక్షుడయ్యాడు. హైదరాబాద్‌కు ‘ప్రకంపనలను’ పరిచయం చేశాడు. ఖడ్గంతోనే ముస్లింలు హిందుస్థాన్‌కు పాలకులయ్యారన్నాడు. ఆయన ఉపన్యాసాలు కొందరిని ఉద్వేగపరచాయి. సామరస్య జీవనాన్ని కోరుకునే అధిక సంఖ్యాకులైన ముస్లింలకు ఆందోళన కలిగించాయి. స్వతంత్ర రాజ్యంగా అవతరించబోతోన్న బ్రిటిష్ పాలిత భారత్‌లో కలవకుండా, నిజాం స్వతంత్ర రాజుగా ఉండాలని రజ్వీ ఆయనలో రాజ్యకాంక్షను రగిలించాడు. ‘మై హూ నా’ అన్నాడు. ఎర్రకోటపై నిజాం జెండా రెపరెపలాడుతుందని, బెంగాల్ సముద్రజలాలు ఆయన పాద ప్రక్షాళన చేస్తాయని అభివర్ణించాడు. ప్రధానమంత్రిని తరిమారు! ‘నైజాం రాజ్య రక్షణ’ కోసం రజాకార్స్ అనే పేరుతో పారా మిలటరీ దళాన్ని ఏర్పరచాడు రజ్వీ! నాయకుని కోసం ప్రాణత్యాగం చేస్తామని, హైదరాబాద్ స్టేట్ విలీనం కాకుండా చివరి క్షణం వరకూ పోరాడుతామని సభ్యులతో ప్రమాణం చేయించాడు. ఫీల్డ్ మార్షల్ దుస్తుల్లో ఉండేవాడు. హోదాలను బట్టి ఇతరులు తుపాకులు, కత్తులు, కర్రలు చేతబట్టేవారు. ఏడాదిపాటు ‘యథాతథ స్థితి’ని గౌరవించేందుకు ఒప్పందానికి రావాలని 1947లో కేంద్ర ప్రభుత్వం, నిజాం ప్రభుత్వమూ భావించాయి. ఢిల్లీకి బయలుదేరిన నిజాం ప్రతినిధి బృందాన్ని రజాకార్లు అడ్డుకున్నారు. హైదరాబాద్ స్టేట్ ప్రధానమంత్రిపై చేయి చేసుకున్నారు! సౌమ్యుడైన ప్రధానమంత్రి సర్ మీర్జా ఇస్మాయిల్ స్టేట్ వదిలే వరకూ రజ్వీ మనుషులు తరిమారు. ఈ నేపథ్యంలోనే, నిజాం అధికార కాంక్షను నిరసిస్తూ, హైదరాబాద్ స్టేట్ భారత్‌లో అంతర్భాగం కావడం అనివార్యమని వార్తలు రాసిన షోయబుల్లాఖాన్ హత్యకు గురయ్యాడు. నిజాం ప్రధానమంత్రిగా నియమించిన నవాబ్ చట్టారీ స్థానంలో నిజాం నిర్ణయాన్ని పరిహసిస్తూ మీర్ లాయక్ అలీని ప్రధానమంత్రిగా రజ్వీ నియమించాడు. 1948 నాటి ఈ పరిస్థితుల్లో అధికసంఖ్యాకులు వలసపోయారు. అల్పసంఖ్యాకులు వలసవచ్చారు. పోలీస్ చర్యకు ‘రజ్వీ’ ఆహ్వానం! నిజాం నవాబుకు వత్తాసుగా ఎన్నో డాంబికాలు పలికిన రజ్వీ, హైదరాబాద్ స్టేట్ ఇండియాలో విలీనం కావాలని భావించిన షోయబుల్లాఖాన్ మరణానికి కారకుడైన రజ్వీ, పోలీస్ చర్యను ఆహ్వానించిన వారిలో ముందు వరుసలో ఉన్నాడు! 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్య ప్రారంభమైంది (17 పోలో గ్రౌండ్స్‌తో హైదరాబాద్ ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉండేది!). నాలుగు రోజుల్లోనే నిజాం బేషరతుగా లొంగిపోయాడు. అనుయాయులతో రజ్వీ అరెస్టయ్యాడు. హిందు-ముస్లిం-క్రిస్టియన్ న్యాయమూర్తుల స్పెషల్ ట్రిబ్యునల్ రజ్వీ బృందంపై విచారణను ప్రారంభించింది. లా చదివిన రజ్వీ తన కేసును తానే వాదించుకున్నాడు. 1950 సెప్టెంబర్ 10న ట్రిబ్యునల్ విధించిన ఏడేళ్ల జైలుశిక్షను హైదరాబాద్, పూణెలలో పూర్తిచేసుకున్నాడు. ‘వా’హెద్! పూణెలోని ఎరవాడ జైలు నుంచి విడుదలైన రజ్వీని ఆయన అనుయాయి, న్యాయవాది కమిల్ అడిక్‌మెట్‌లో ఉన్న తన నివాసానికి కారులో తీసుకువచ్చాడు. పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు! 140 మందికి ఆహ్వానాలు వెళ్లగా 40 మంది వచ్చారు. ‘పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించే సాహసి లేరా’ అనే రజ్వీ పిలుపునకు స్పందన రాలేదు. 12 ఏళ్లు దాటిన ఏ పురుషుడైనా అధ్యక్షుడు కావచ్చని నిబంధన సవరించారు. అబ్దుల్ వాహెద్ ఒవైసీ అనే యువకుడు అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ దీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ ముస్లింల యోగక్షేమాల పరిరక్షణ ధ్యేయమని పార్టీ ప్రకటించింది. ఆ మేరకు ముస్లిమేతరులనూ పార్టీ పదవులకు, ఉన్నత స్థానాలకు ఎంపిక చేస్తోంది. ఎంఐఎం పార్టీకి ప్రస్తుతం ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షుడు. మరో కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో శాసనసభాపక్షనేత. కన్నీరు కరవైంది! తాను దక్కన్లో పుట్టాను దక్కన్‌లోనే మరణిస్తానని గతంలో చెప్పుకున్న రజ్వీ, పార్టీ అప్పగింతలు పూర్తయిన తర్వాత తనకు భారత్‌లో భవిష్యత్ లేదని, పాకిస్థాన్ వెళ్తానని ప్రకటించాడు. పోలీస్ చర్య పూర్తయిన తొమ్మిదేళ్లకు సెప్టెంబర్ 18న పాకిస్థాన్ పయనమయ్యాడు. కమిల్ ముంబై వరకూ వెళ్లి సెండాఫ్ పలికారు. రజ్వీని పాకిస్థాన్‌లో ఎవ్వరూ రిసీవ్ చేసుకోలేదు. మద్దతు పలకలేదు. గుర్తించలేదు. ఇండియా నుంచి, ముఖ్యంగా దక్కన్ నుంచి కరాచీకి వెళ్లి బాధలు పడుతున్న వారికి న్యాయవాదిగా సేవలు అందించాడు. 67వ ఏట 1970 జనవరి 15న కరాచీలో రజ్వీ చనిపోయాడు. హైదరాబాద్‌లో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలని కలగన్న కాశిం రజ్వీ.. తాను పుట్టిన నేలకు సుదూరాన ఏర్పడ్డ మత రాజ్యం పాకిస్థాన్‌లో మరణించాడు. అక్కడ రజ్వీ కోసం ఏ ఒక్కరూ కన్నీరు పెట్టలేదు! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
కిషన్-అక్బర్ తేరో నామ్
narendrayan-18 ఇంతకీ మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ హిందువా? ముస్లిమా? దేవాలయాలలో, దర్గాలలో, ఆయా మతస్తుల వేడుకల్లో తలలో నాలుకలా కలసిపోయే వారు నిజాం ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్! ఈ నేపథ్యంలో ఒక సందర్భంలో ఒకరు, మీరు హిందువు కాదు ముస్లిం అని భావిస్తున్నాను అన్నారు. అన్యాపదేశంగా సమాధానం ఆశించారు. ప్రజల మహారాజ్ ఇలా అన్నారు, ఆశువుగా.. మై హూ హిందూ/మై హూ ముసల్మాన్/హర్ మజబ్ హై మెరా ఇమాన్ ‘షాద్’కా మజబ్ షాద్ హీ జానే/ ఆజాదీ ఆజాద్ హీ జానే’ ‘నేను హిందువును/ నేను ముసల్మాన్‌ను/అన్ని మతాలూ నా ధర్మంలోనివే ‘షాద్’ మతమేమిటో షాద్ కే తెలుసు /విముక్తునికే ముక్తి తెలుసు’ ‘షాద్’ మిత్రుడు పఠాన్! సుకవి జీవించు ప్రజల నాల్కలపైన అన్నట్లు కిషన్ ప్రసాద్ కలంపేరుతో ఏర్పడింది మహబూబ్ నగర్ జిల్లాలోని ‘షాద్’నగర్ ! ‘హైదరాబాద్ తెహజీబ్ (అన్యోన్యత)’ అంటే ఏమిటి? ఎవరైనా ప్రశ్నిస్తే కిషన్ ప్రసాద్ జీవితాన్నే ఉదహరించవచ్చు! ‘షాద్’ (సంతుష్ట) తత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తి నవాబ్ అక్బర్ యార్జంగ్ బహదూర్. ఖైబర్ కనుమ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన పఠాన్ల కుటుంబీకుడు. 16వ ఏట లా చదివేందుకు హైదరాబాద్ వచ్చాడు. మాజీ రాష్ట్రపతి జాకీర్‌హుస్సేన్ తండ్రి, న్యాయవాది ఫిదాహుస్సేన్ ఖాన్ దగ్గర సహాయకునిగా పనిచేశారు. న్యాయవాదిగా, హైకోర్టు న్యాయమూర్తిగా, నిజాం హోంశాఖ కార్యదర్శిగా పదోన్నతులు పొందారు. ‘జకత్’తో పాటు ప్రతి గురువారం పేదలకు దానధర్మాలు చేసేవారు. అన్ని ఉపవాసాలూ పాటించేవారు. 80 ఏళ్ల సాఫల్య జీవనంలో ఒక్కపర్యాయం కూడా ప్రార ్థనను విస్మరించలేదు. 72వ ఏట హజ్ యాత్ర చేశారు. జమైతె-ఎ-అహ్మదీయ సభ్యుడైనప్పటికీ అన్ని సమూహాల ముస్లింలు గౌరవించేవారు. బూర్గుల రామకృష్ణరావు, మాడపాటి హనుమంతరావు వంటి పెద్దలూ అభిమానించేవారు. మహాత్మాగాంధీ హత్య నేపథ్యంలో నిజాం కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా పెద్దలంతా ఆయన్ను కోరారు. వివాదానికి ఎవరు అతీతులు..? అందరూ మెచ్చేవారూ ఒక్కోసారి వివాదాస్పదం అవుతారు! సందర్భం 1936 ఆగస్ట్ 1. కృష్ణ జన్మాష్టమి. యంగ్మెన్స్ కాయస్థ యూనియన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హుస్సేనీ ఆలంలోని రాజా నర్సింగరావు బహదూర్ దేవిడీలో బహిరంగ సభ. హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మీర్జాయార్జంగ్ బహదూర్ అధ్యక్షుడు. నగర ప్రముఖులు, హిందూ-ముస్లిం అశేష ప్రజానీకం హాజరయ్యారు. మహారాజా కిషన్ ప్రసాద్ రచించిన హిందూముస్లింల సఖ్యతను శ్లాఘించే ప్రార్థనా గీతంతో సభ మొదలైంది. హైకోర్ట్ న్యాయమూర్తి నవాబ్ అక్బర్ యార్జంగ్ ప్రధాన ఉపన్యాసం ప్రారంభించారు ‘శ్రీకృష్ణ: హిందూ ప్రవక్త’ అనే అంశంపై! ఖురాన్ ను, ఉదార విశ్వాసులను ఉటంకిస్తూ వినూత్న ప్రతిపాదనలు తెచ్చారు! ఉదహరించబడని ప్రవక్త! ప్రతి ఒక్కరికీ మార్గదర్శకుడు ఉంటారు (13:7) ఇంతకు ముందు కూడా మార్గదర్శకులు పంపబడ్డారు. అందులో పేర్లు ఉదహరింపబడ్డవారే కాదు, ఉదహరింపబడని వారూ ఉన్నారు (40 :78) అనే రెండు ప్రవచనాలను ఖురాన్ నుంచి ఉదహరించారు. ఈ నేపథ్యంలో ‘కృష్ణుడు ఖురాన్లో ఉదహరింపబడనప్పటికీ ఆయన పూర్వపు ప్రవక్త కాదని ఎందుకు అనుమానించాలి? సమస్త ఆసియాపై సాంస్కృతిక ప్రభావాన్ని చూపిన మార్గదర్శి గ్రీస్‌కు ఈజిప్ట్‌కు మార్గదర్శి కాడా? నబీలు- పైగంబర్లు, రుషులు-మునులు, ప్రవక్త-అవతారము అనే పదాల సారూప్యతలను గుర్తించాలన్నారు. ఖురాన్ ప్రకారం ఏ ముస్లిమూ ప్రవక్తల పట్ల హెచ్చుతగ్గులు పాటించరన్నారు. నోవా-అబ్రహాం-జీసస్‌ల పరంపరలోని చివరి ప్రవక్త అయిన మహ్మద్ ప్రవక్తతో పాటు ‘ఉదహరించబడని ప్రవక్త’ శ్రీకృష్ణునికి అలాహిసలామ్లు (ఆశీర్వాదాలు శాంతి అనుగ్రహింపబడు గాక) అర్పించారు. అధికారులకు, పత్రికలకు నిజాం ఫర్మానా! నగరంలో కలకలం! ముస్లింలు ప్రార్థించే ప్రవక్తలతోపాటు అక్బర్ యార్జంగ్ శ్రీకృష్ణునికి అలాహిసలామ్లు చెబుతారా? సాంప్రదాయ ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు సైతం ఈ తరహా వాస్తవ విరుద్ధ కల్పనలను అంగీకరించరని పత్రికల్లో విమర్శలొచ్చాయి. నిజాంపై ఒత్తిడులు, లిఖిత ఫిర్యాదులూ! నిజాం ఆయన భరతం పడతారని, ఉద్యోగం ఊడగొడతారని కొందరు చెవులు కొరుక్కున్నారు. ‘ప్రస్తుత శాంతియుత పరిస్థితులకు విఘాతం కల్గించే రీతిలో ప్రభుత్వాధికారులు, మత-రాజకీయ అంశాలపై వ్యాఖ్యానాలు చేయరాదని, పత్రికలూ ప్రోత్సహించరాద’ని 1936 ఆగస్ట్ 22న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశం జారీ చేశారు. నిజాంకు, కిషన్ ప్రసాద్‌కు అక్బర్ యార్జంగ్పై ఉన్న గౌరవం గురించి తెలియని వారి ఆశలు ఫలించలేదు. ‘ఉపన్యాసం’ ఇచ్చిన నాలుగు నెలలకు హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ కావాల్సిన అక్బర్ యార్జంగ్ పదవీకాలాన్ని అసాధారణ రీతిలో నిజాం రెండేళ్లు పొడిగించారు. ఆ తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించారు. నాలుగేళ్లు ఆ పదవిలో ఉన్నారు. అక్బర్ యార్జంగ్ తన అంతరాత్మ ప్రబోధించిన సత్యాన్ని నిర్భయంగా శిరసెత్తి ప్రసంగించారు! ‘వివిధ మతాల మధ్య ఐకమత్యం పెంచేందుకు కృషి చేయాల’ని అన్ని మతాలవారికీ ఆయన హితవు పలికారు! కిషన్ ప్రసాద్-అక్బర్ యార్ జంగ్ వేర్వేరు వ్యక్తులా! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి