'గూగుల్'లో మోడీ టాప్!
కమలం పార్టీ ప్రధాని అభ్యర్థిగా జాతీయ రాజకీయ యవనికపైకి దూసుకొచ్చిన నరేంద్ర మోడీ తన హవా కొనసాగిస్తున్నారు. కాషాయ పార్టీని కేంద్రంలో మళ్లీ పట్టాలెక్కించగల సత్తా ఉన్న నేతగా నీరాజనాలు అందుకుంటున్న ఈ గుజరాతీ నాయకుడు తదనుగుణంగా పనిచేసుకుపోతున్నారు. ప్రగతిపథంలో గుజరాత్ను పరుగులెత్తించిన మోడీపై భారం వేసి వచ్చే లోక్సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు బీజేపీ సిద్ధమయింది. 'నమో' మంత్రంతో యూపీఏ హ్యాట్రిక్ను అడ్డుకోవాలని వ్యూహాలు పన్నుతోంది.
జాతీయ స్థాయిలో మోడీకి ఆదరణ పెరుగుతున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆన్లైన్లోనూ ఆయన హవా నడుస్తోంది. ఇంటర్నెట్లో వెతికిన రాజకీయ నాయకుల్లో మోడీదే మొదటిస్థానం. గూగుల్లో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో సెర్చ్ చేసిన భారత రాజకీయ నాయకుల్లో మోడీ టాప్లో నిలిచారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా చెప్పబడుతున్న రాహుల్ గాంధీ రెండో స్థానంలో నిలిచారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తృతీయ స్థానంలో ఉన్నారు. మన్మోహన్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్, జయలలిత, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, సుష్మా స్వరాజ్, దిగ్విజయ్ సింగ్ మోస్ట్ సెర్చెడ్ పొలిటీషియన్ల జాబితాలో ఉన్నారు.
ఇక రాజకీయ పార్టీల విషయానికొస్తే బీజేపీ కోసం నెటిజన్లు ఎక్కువగా శోధించినట్టు ట్రెండ్స్ వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఓటరు గుర్తింపు ఎలా పొందాలనేది అత్యధికులు వెదికిన అంశం. ఎలక్ట్రోరల్ నెంబర్ ఎలా గుర్తించాలి, ఆన్లైన్లో ఓటరు గుర్తింపు పొదడం ఎలా, ఓటు ఎలా వేయాలనే దాని గురించి కూడా ఎక్కువ మంది శోధించారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఎన్నికల్లో ఎవరికి ఓటేయ్యాలో పట్టణ ఓటర్లలో 42శాతం మంది ఇంకా నిర్ణయించుకోలేదట. 'అర్బన్ ఇండియన్ ఓటర్స్' పేరుతో గూగుల్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. పార్టీని చూసి ఓటేస్తామని 35 శాతం మంది తెలిపారు. స్థానిక అభ్యర్థికే మద్దతిస్తామని 36 మంది పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరనేది చూసి ఓటేస్తామని 11శాతం మంది చెప్పడం విశేషం. పట్టణ యువత ఆన్లైన్తో గాఢమైన బంధాన్ని కొనసాగిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని భావిస్తున్నట్టు గూగుల్ ఇండియా సర్వేతో తేలింది.