చిలిపి కృష్ణమ్మ
ఢిల్లీలో పుట్టి.. ముంబైలో పెరిగిన ఈ ముద్దుగుమ్మ ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. ఫ్యాషన్ రంగం నుంచి సినిమాల వైపు వచ్చిన సిమేర్ మోటియాని.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటానంటోంది. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో బుధవారం ‘డిజైర్’ డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రారంభానికి విచ్చేసిన సిమేర్‌ను సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.
..:: శిరీష చల్లపల్లి
నేను ఆడపిల్లనైనా.. అల్లరిలో మాత్రం శ్రీకృష్ణుడి రేంజ్ నాది. మా నాన్న ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అమ్మ ప్రొఫెషనల్ బ్రైడల్ డిజైనర్.. ఒక తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పుడు మా నాన్న ఆఫీస్‌కు వెళ్లకుండా ఫైల్స్, ఇంపార్టెంట్ కాగితాలు దాచేసేదాన్ని. ఆ ఫైల్స్ వెతుక్కునే పనిలో లేట్ అయిపోయి నాన్న ఆఫీస్‌కి వెళ్లడం మానేసేవాడు. ఇంకోసారి ఫ్రెండ్స్‌తో కలసి టూర్ వెళ్లడానికి ట్రైన్ ఎక్కాం. ట్రైన్ కదలడం స్టార్ట్ అయ్యాక.. మేం ఎక్కాల్సిన ట్రైన్ కాకుండా.. మరేదో ఎక్కామనుకున్నాం. రన్నింగ్ ట్రైన్ నుంచే అందరం సినిమా రేంజ్‌లో ప్లాట్‌ఫాం మీదికి దూకేశాం. మేమెక్కిన ట్రైన్ కరెక్టేనని తర్వాతగానీ తెలియలేదు. ఎంత అల్లరి పిల్లనైనా.. కల్చర్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే కథ క్ నేర్చుకున్నా. దేశవిదేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చాను.
సిటీ చుట్టేశా..
డిగ్రీలో ఉండగా.. ఒకసారి ఫ్రెండ్స్‌తో కాఫీ షాప్‌నకు వెళ్లాను. ఓ మోడలింగ్ ఏజెన్సీ వాళ్లు నన్ను చూసి.. ‘మోడలింగ్ చేస్తారా’ అంటూ అప్రోచ్ అయ్యారు. అలా ఫ్యాషన్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాను. తర్వాత కొద్ది రోజులకే ‘మలబార్ గోల్డ్’ యాడ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలసి చేసే అవకాశం వచ్చింది. అప్పుడే మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చాను. తర్వాత సేమ్ యాడ్ తమిళంలో సూర్యతో కలసి చేశాను.
అలా యాడ్స్ చేస్తూ వెళ్లిపోయాను. అందరూ మెచ్చుకోవడంతో నాకూ ఆసక్తి పెరిగింది. యాక్టింగ్ కోర్సులో చేరా. అప్పుడే ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో హైదరాబాద్‌లోనే ఉన్నాను. అప్పుడు సిటీలోని టూరిస్ట్ స్పాట్స్ అన్నీ చుట్టేశాను. చుడి బజార్‌లో ‘మీనాకారి గాజులు’, చార్మినార్ దగ్గర ‘ముత్యాల హారం’ కొని స్నేహితులకు బహుమతిగా పంపించాను. సర్వీలో హలీమ్ బాగా నచ్చింది.
గుడ్ ఇంప్రెషన్..
సిటీకి వచ్చిన కొత్తలో కొంత ఇబ్బందిగా ఫీలయ్యాను. అయితే మంచు లక్ష్మి నా గురించి స్పెషల్ కేర్ తీసుకోవడంతో ఇక్కడి మనుషుల మీద నాకు మంచి ఇంప్రెషన్ కలిగింది. ఇక నా సెకండ్ సినిమా‘ది ఓనర్’ అనే ఇంటర్నేషనల్ మూవీ. ఆ ఫిల్మ్ గిన్నిస్ రికార్డ్ కూడా సాధించింది. ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. పూరిజగన్నాథ్ డెరైక్షన్‌లో నటించాలని ఉంది. నాకు భర్తగా వచ్చేవాడు మహేష్‌బాబు అంత హ్యాండ్సమ్‌గా, సూర్య అంత మంచితనంతో ఉండాలని కోరుకుంటున్నా.