రాజకీయాల్లోకి మరోవారసుడు | New descendant in politics | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి మరోవారసుడు

Published Sat, Jan 25 2014 7:10 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి - Sakshi

నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

వారసులు లేకుండా దేశ రాజకీయాలను  ఊహించడం కష్టం. అందూలోనూ కుటుంబ రాజకీయ వారసత్వానికి కాంగ్రెస్ పెట్టింది పేరు. వారసత్వం లేకపోతే కాంగ్రెస్ కు మనుగడేలేదు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి  మరో వారసుడు రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు. జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో  ముఖ్యపాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి  నేదరుమల్లి జనార్ధన్ రెడ్డి పెద్ద కుమారుడు రామ్ కుమార్ రెడ్డి తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకోబోతున్నారు.

జనార్ధన రెడ్డికి ఆరోగ్యం క్షీణించడంతో ఆయనే తన పెద్ద కుమారుడిని రాజకీయాలలోకి తీసుకురావాలన్న యోచనలో ఉన్నారు. 1989 శాసనసభ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి విజయం సాధించిన  నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయ్యారు. సిఎంగా ఉండి తమను పట్టించుకోకపోవడంతో 1994 ఎన్నికల్లో  ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనను ఓడించారు. ఆ తరువాత ఆయన  ఎంపిగా కేంద్రంలోకి వెళ్లారు.  1999లో తన సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. 2004 శాసనసభ  ఎన్నికల్లో కూడా ఆమె వెంకటగిరి నుంచి విజయం సాధించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో స్థానం కూడా సంపాదించారు. మంత్రిగా తన నియోజకవర్గ ప్రజలను మెప్పించలేకపోయారు. ఆ తరువాత  2009 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. కార్యకర్తలను, నాయకులను, నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఓటమిపాలైనట్లు చెబుతారు.

 ప్రస్తుతం రాజ్యలక్ష్మి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జనార్థన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమంత బాగాలేదు. దాంతో  వచ్చే శాసనసభ ఎన్నికలలో వెంకటగిరి స్థానంలో కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని పోటీకి దించాలని నేదురుమల్లి దంపతులు భావిస్తున్నారు. అయితే   ప్రస్తుతం కోటలోని ఎన్బీకేఆర్ కళాశాల కరస్పాండెంట్గా  ఉన్న రామ్ కుమార్కు  రాజకీయ అనుభవం బొత్తిగాలేదు. అయినా రాజకీయాలోకి రావాలన్న ఆసక్తి ఉంది.  పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీ, టీడీపీలలో చేరిపోయారు. అంతేకాకుండా  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆశాజనకంగా లేదు.  ఈ పరిస్థితులలో  ఎన్నికల బరిలోకి  దిగాలా? వద్దా? అన్న  ఆలోచనలో రామ్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ విషయమై ఆయన వెంకటగిరి నేతలతో, గతంలో తన తండ్రికి సన్నిహితంగా ఉన్నవారితో   మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement