వీధినెన్ని చిత్రాలు!
వీధుల్లో ఏముంటాయి? సంస్కృతి ఉంటుంది. సంప్రదాయాలుంటాయి. నాగరికత మూలాలుంటాయి. జీవన సత్యాలు.. సంతోషాలు.. దుఃఖాలు.. కోపతాపాలు.. బాధ్యతలు.. బంధాలు.. మానవ సంబంధాలూ ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే రేపటి రోజున మరపురాని తీపి గుర్తులు అవుతాయి. డెసిసివ్, క్యాండిడ్ ‘క్లిక్’లు దొరికినపుడే మజా. లిప్తపాటులో అపురూప సంతకాన్ని లిఖించడంపైనే దృష్టి ఉండాలి. లేదంటే ఆ ఎమోషన్, ఆ స్టిల్ మారిపోతాయి. అందుకే స్ట్రీట్ ఫొటోగ్రాఫర్ వినోద్‌మున్నా మెడలో ఓ కెమెరా వేసుకుని వీధుల వెంట అన్వేషిస్తాడు. మంచి ఫొటోల కోసం తపిస్తాడు. ఆ క్లిక్‌లే అతనికి కిక్ ఇస్తాయి. ఇటీవల ఆదివారం వినోద్‌మున్నా సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర్లో తీసిన పోతరాజు వేషధారణలోని మరుగుజ్జుల ఫొటో (పేజీ 1లోనిది) ఆ కోవలోనిదే.
ఫొటోలు నచ్చితేనే సభ్యత్వం...
24 ఏళ్ల వినోద్ ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని రాంకీలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఫొటోలు తీయడం ఇంట్రెస్ట్. రెండేళ్ల నుంచి సీరియస్‌గా ప్రవృత్తిలో మునిగిపోయాడు. సెలవు వచ్చిందంటే ‘స్ట్రీట్ ఫొటోగ్రాఫర్’ పాత్రలోకి మారిపోతాడు. ఈయన ఇండియాలో ‘దట్స్ లైఫ్’లో మెంబర్. దీని ఫౌండర్ కౌషల్ పారిక్. ‘దట్స్ లైఫ్’ అంటే ఇండియన్ స్ట్రీట్ ఫొటోగ్రాఫర్స్ కలెక్టివ్. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. గ్రూపులోని సభ్యులందరికీ ఏకగ్రీవంగా సదరు వ్యక్తి పంపిన ఫొటోలు నచ్చితేనే కొత్త మెంబర్‌గా తీసుకుంటారు. అలా వినోద్ 13వ మెంబర్‌గా ఈ సంవత్సరం జనవరిలో జాయిన్ అయ్యాడు. దక్షిణభారత దేశం నుంచి ఈ గ్రూపులో చోటు దక్కించుకున్న ఏకైక సభ్యుడు వినోద్. 2007లో ప్రారంభమైన ఈ గ్రూపునకు ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది. పలు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్‌కు వీరి ఫొటోలు ఎంపికయ్యాయి. వినోద్ త్వరలో ఫ్లోరైడ్‌పై ఫొటో స్టోరీని విడుదల చేయనున్నారు.
వినోద్‌కు మొట్టమొదట పేరు తెచ్చిన ఫొటో
జాలర్లు వలలు సరిచేస్తుండగా వలల్లో చిక్కుకున్న చేపల కోసం కాకి వాలుతున్నప్పుడు తీసిన ఫొటో. ఫొటోగ్రఫీలో వినోద్... పలు అవార్డులను సైతం గెలుచుకున్నారు. ‘గ్రాండ్‌పోజ్ స్ల్పాష్’ పోటీలో రన్నరప్‌గా, ‘వర్కింగ్ ఎల్డర్లీ’లో స్పెషల్‌మెన్షన్‌గా వినోద్ ఫొటోలు ఎంపికయ్యాయి. పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్ (‘పీహెచ్ ఫీచర్’, ‘ఆర్ట్ ఫొటోఫీచర్’, ‘121 క్లిక్స్’) లకు ఈయన ఫొటోలు ఎంపికయ్యాయి.