Environmental Engineer
-
Muthu Nandini: పర్యావరణహిత భవనం! ఈ ముత్తు నందిని ప్యాలెస్..
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్‌లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచి్చనట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్‌చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభి్రపాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం.. కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చెప్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పొడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పొట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్‌ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్‌లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాట ప్రాంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. ఇవి చదవండి: Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను' -
జీతం.. జీవితం.. త్రిశంకు స్వర్గం
సాక్షి, కర్నూలు: ప్రతి పురపాలక సంఘంలో పర్యావరణ ఇంజనీర్‌ను నియమించాలని 15 ఏళ్ల క్రితం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అపహాస్యమవుతోంది. మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2010లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని 127 పురపాలక సంఘాల్లో(నగర పంచాయతీలు మినహాయించి) పర్యావరణ ఇంజనీర్ల నియామకం చేపట్టారు. థర్డ్ పార్టీ పద్ధతిన విశ్వ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్సీయూఈఎస్(రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్) ఆధ్వర్యంలో ఇందుకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ శాస్త్రంలో ఎంటెక్, ఎమ్మెస్సీ, బీటెక్, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. సెక్షన్ హెడ్లతో సమానమైన అధికారాలు ఉంటాయని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే తొలుత నెలకు రూ.30వేలు జీతమిస్తామని ప్రకటించినా.. రూ.16,866లతో సరిపెట్టారు. ఇదేమని ప్రశ్నిస్తే.. నచ్చితే చెయ్యి, లేదంటే వెళ్లిపోమనే సమాధానం ఎదురైంది. శిక్షణ అనంతరం విధుల్లో చేరిన వీరు అందించే సూచనలు, సలహాలను పలువురు రెగ్యులర్ పారిశుద్ధ్య అధికారులు, కమిషనర్లు పెడచెవిన పెట్టడం ప్రారంభించారు. క్రమంగా ప్రాధాన్యత తగ్గిపోవడం, జీతాల విషయంలోనూ అన్యాయం జరగడంతో ప్రస్తుతం వీరి సంఖ్య రెండు రాష్ట్రాల్లో కలిపి 35కు చేరుకుంది. 2014 నాటికి ప్రతి పురపాలక సంఘానికి రెగ్యులర్ పర్యావరణ ఇంజనీరు ఉండాలని 2012లో ఒక జీఓ విడుదలైనా.. అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. రాష్ట్ర విభజనతో మొదటికే మోసం పర్యావరణ ఇంజనీర్ల ఉద్యోగాలు రాష్ట్ర విభజన అనంతరం ఉండీ లేనట్లుగా మారాయి. ఆర్సీయూఈఎస్ ఏ రాష్ట్రం పరిధిలో పని చేయాలనే విషయంలో స్పష్టత కరువైంది. గత ఏడాది ఏప్రిల్‌తో వీరి ఉద్యోగ ఒప్పంద గడువు ముగిసిపోగా.. జూన్ వరకు పొడిగించారు. ఆ తర్వాత కూడా పరిస్థితి గందరగోళంగా మారడంతో ఉద్యోగులంతా రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని మున్సిపల్ శాఖ డెరైక్టర్‌ను కలిసి తమ గోడు వినిపించగా.. ఈ ఏడాది మార్చి వరకు గడువు పొడిగించారు. మున్సిపాలిటీల్లో చైర్మర్లు, కమిషనర్ల అభీష్టం మేరకే పర్యావరణ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. అయితే గత జూన్ తర్వాత నుంచి వీరి జీతభత్యాలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం ఈ వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తోంది. జీతాల బిల్లును ఆర్సీయూఈఎస్కి పంపినా తిప్పి పంపడం ఉద్యోగులను కలవరపరుస్తోంది. రాయలసీమలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు 40 ఉండగా.. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు కార్పొరేషన్ మినహాయిస్తే మిగిలిన మున్సిపాలిటీల్లో పర్యావరణ ఇంజనీర్ల ఊసే కరువైంది. ఆ బాధ్యతలను సివిల్ ఇంజనీర్లకు అప్పగించి మమ అనిపిస్తున్నారు. కర్నూలు కార్పొరేషన్ సహా నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో ఇదే తరహా పరిస్థితి నెలకొంది. సీమ పరిధిలో ప్రస్తుతం వైఎస్ఆర్ కడప కార్పొరేషన్, రాయచోటి మున్సిపాలిటీల్లో మాత్రమే ఇద్దరు పర్యావరణ ఇంజినీర్లు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. రెగ్యులర్ సివిల్ ఇంజనీర్లను పర్యావరణ ఇంజనీర్లుగా కాగితాల్లో చూపుతున్నా.. వీరికి కెమికల్, బయాలాజికల్ అంశాలపై అవగాహన లేకపోవడం గమనార్హం. స్వచ్ఛ భారత్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేస్తున్నా.. ఇదే విషయంతో ముడిపడిన పర్యావరణ ఇంజనీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
వీధినెన్ని చిత్రాలు!
వీధుల్లో ఏముంటాయి? సంస్కృతి ఉంటుంది. సంప్రదాయాలుంటాయి. నాగరికత మూలాలుంటాయి. జీవన సత్యాలు.. సంతోషాలు.. దుఃఖాలు.. కోపతాపాలు.. బాధ్యతలు.. బంధాలు.. మానవ సంబంధాలూ ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే రేపటి రోజున మరపురాని తీపి గుర్తులు అవుతాయి. డెసిసివ్, క్యాండిడ్ ‘క్లిక్’లు దొరికినపుడే మజా. లిప్తపాటులో అపురూప సంతకాన్ని లిఖించడంపైనే దృష్టి ఉండాలి. లేదంటే ఆ ఎమోషన్, ఆ స్టిల్ మారిపోతాయి. అందుకే స్ట్రీట్ ఫొటోగ్రాఫర్ వినోద్మున్నా మెడలో ఓ కెమెరా వేసుకుని వీధుల వెంట అన్వేషిస్తాడు. మంచి ఫొటోల కోసం తపిస్తాడు. ఆ క్లిక్లే అతనికి కిక్ ఇస్తాయి. ఇటీవల ఆదివారం వినోద్మున్నా సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర్లో తీసిన పోతరాజు వేషధారణలోని మరుగుజ్జుల ఫొటో (పేజీ 1లోనిది) ఆ కోవలోనిదే. ఫొటోలు నచ్చితేనే సభ్యత్వం... 24 ఏళ్ల వినోద్ ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని రాంకీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఫొటోలు తీయడం ఇంట్రెస్ట్. రెండేళ్ల నుంచి సీరియస్‌గా ప్రవృత్తిలో మునిగిపోయాడు. సెలవు వచ్చిందంటే ‘స్ట్రీట్ ఫొటోగ్రాఫర్’ పాత్రలోకి మారిపోతాడు. ఈయన ఇండియాలో ‘దట్స్ లైఫ్’లో మెంబర్. దీని ఫౌండర్ కౌషల్ పారిక్. ‘దట్స్ లైఫ్’ అంటే ఇండియన్ స్ట్రీట్ ఫొటోగ్రాఫర్స్ కలెక్టివ్. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 13 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. గ్రూపులోని సభ్యులందరికీ ఏకగ్రీవంగా సదరు వ్యక్తి పంపిన ఫొటోలు నచ్చితేనే కొత్త మెంబర్‌గా తీసుకుంటారు. అలా వినోద్ 13వ మెంబర్‌గా ఈ సంవత్సరం జనవరిలో జాయిన్ అయ్యాడు. దక్షిణభారత దేశం నుంచి ఈ గ్రూపులో చోటు దక్కించుకున్న ఏకైక సభ్యుడు వినోద్. 2007లో ప్రారంభమైన ఈ గ్రూపునకు ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది. పలు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్‌కు వీరి ఫొటోలు ఎంపికయ్యాయి. వినోద్ త్వరలో ఫ్లోరైడ్పై ఫొటో స్టోరీని విడుదల చేయనున్నారు. వినోద్‌కు మొట్టమొదట పేరు తెచ్చిన ఫొటో జాలర్లు వలలు సరిచేస్తుండగా వలల్లో చిక్కుకున్న చేపల కోసం కాకి వాలుతున్నప్పుడు తీసిన ఫొటో. ఫొటోగ్రఫీలో వినోద్... పలు అవార్డులను సైతం గెలుచుకున్నారు. ‘గ్రాండ్పోజ్ స్ల్పాష్’ పోటీలో రన్నరప్‌గా, ‘వర్కింగ్ ఎల్డర్లీ’లో స్పెషల్మెన్షన్గా వినోద్ ఫొటోలు ఎంపికయ్యాయి. పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్ (‘పీహెచ్ ఫీచర్’, ‘ఆర్ట్ ఫొటోఫీచర్’, ‘121 క్లిక్స్’) లకు ఈయన ఫొటోలు ఎంపికయ్యాయి.