జీతం.. జీవితం.. త్రిశంకు స్వర్గం | Salary Thrissanku heaven .. life .. | Sakshi
Sakshi News home page

జీతం.. జీవితం.. త్రిశంకు స్వర్గం

Published Mon, Jan 19 2015 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

జీతం.. జీవితం.. త్రిశంకు స్వర్గం

జీతం.. జీవితం.. త్రిశంకు స్వర్గం

సాక్షి, కర్నూలు: ప్రతి పురపాలక సంఘంలో పర్యావరణ ఇంజనీర్‌ను నియమించాలని 15 ఏళ్ల క్రితం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అపహాస్యమవుతోంది. మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2010లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని 127 పురపాలక సంఘాల్లో(నగర పంచాయతీలు మినహాయించి) పర్యావరణ ఇంజనీర్ల నియామకం చేపట్టారు.

థర్డ్ పార్టీ పద్ధతిన విశ్వ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్‌సీయూఈఎస్(రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్) ఆధ్వర్యంలో ఇందుకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ శాస్త్రంలో ఎంటెక్, ఎమ్మెస్సీ, బీటెక్, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. సెక్షన్ హెడ్‌లతో సమానమైన అధికారాలు ఉంటాయని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే తొలుత నెలకు రూ.30వేలు జీతమిస్తామని ప్రకటించినా.. రూ.16,866లతో సరిపెట్టారు.

ఇదేమని ప్రశ్నిస్తే.. నచ్చితే చెయ్యి, లేదంటే వెళ్లిపోమనే సమాధానం ఎదురైంది. శిక్షణ అనంతరం విధుల్లో చేరిన వీరు అందించే సూచనలు, సలహాలను పలువురు రెగ్యులర్ పారిశుద్ధ్య అధికారులు, కమిషనర్లు పెడచెవిన పెట్టడం ప్రారంభించారు. క్రమంగా ప్రాధాన్యత తగ్గిపోవడం, జీతాల విషయంలోనూ అన్యాయం జరగడంతో ప్రస్తుతం వీరి సంఖ్య రెండు రాష్ట్రాల్లో కలిపి 35కు చేరుకుంది. 2014 నాటికి ప్రతి పురపాలక సంఘానికి రెగ్యులర్ పర్యావరణ ఇంజనీరు ఉండాలని 2012లో ఒక జీఓ విడుదలైనా.. అమలుకు నోచుకోకపోవడం గమనార్హం.
 
రాష్ట్ర విభజనతో మొదటికే మోసం
పర్యావరణ ఇంజనీర్ల ఉద్యోగాలు రాష్ట్ర విభజన అనంతరం ఉండీ లేనట్లుగా మారాయి. ఆర్‌సీయూఈఎస్ ఏ రాష్ట్రం పరిధిలో పని చేయాలనే విషయంలో స్పష్టత కరువైంది. గత ఏడాది ఏప్రిల్‌తో వీరి ఉద్యోగ ఒప్పంద గడువు ముగిసిపోగా.. జూన్ వరకు పొడిగించారు. ఆ తర్వాత కూడా పరిస్థితి గందరగోళంగా మారడంతో  ఉద్యోగులంతా రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని మున్సిపల్ శాఖ డెరైక్టర్‌ను కలిసి తమ గోడు వినిపించగా.. ఈ ఏడాది మార్చి వరకు గడువు పొడిగించారు.

మున్సిపాలిటీల్లో చైర్మర్లు, కమిషనర్ల అభీష్టం మేరకే పర్యావరణ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. అయితే గత జూన్ తర్వాత నుంచి వీరి జీతభత్యాలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం ఈ వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తోంది. జీతాల బిల్లును ఆర్‌సీయూఈఎస్‌కి పంపినా తిప్పి పంపడం ఉద్యోగులను కలవరపరుస్తోంది. రాయలసీమలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు 40 ఉండగా.. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు కార్పొరేషన్ మినహాయిస్తే మిగిలిన మున్సిపాలిటీల్లో పర్యావరణ ఇంజనీర్ల ఊసే కరువైంది.

ఆ బాధ్యతలను సివిల్ ఇంజనీర్లకు అప్పగించి మమ అనిపిస్తున్నారు. కర్నూలు కార్పొరేషన్ సహా నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో ఇదే తరహా పరిస్థితి నెలకొంది. సీమ పరిధిలో ప్రస్తుతం వైఎస్‌ఆర్ కడప కార్పొరేషన్, రాయచోటి మున్సిపాలిటీల్లో మాత్రమే ఇద్దరు పర్యావరణ ఇంజినీర్లు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. రెగ్యులర్ సివిల్ ఇంజనీర్లను పర్యావరణ ఇంజనీర్లుగా కాగితాల్లో చూపుతున్నా.. వీరికి కెమికల్, బయాలాజికల్ అంశాలపై అవగాహన లేకపోవడం గమనార్హం. స్వచ్ఛ భారత్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేస్తున్నా.. ఇదే విషయంతో ముడిపడిన పర్యావరణ ఇంజనీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement