'ఖాన్'ల రాజకీయ ఆలోచనలు | Political views of Khans | Sakshi
Sakshi News home page

'ఖాన్'ల రాజకీయ ఆలోచనలు

Published Sat, Jan 18 2014 2:10 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్మాన్ ఖాన్,  షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ - Sakshi

సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్

 బాలీవుడ్‌ను ఏలుతున్న సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూక్ ఖాన్,  ఈ ముగ్గురు ఖాన్‌లు ఏ రాజకీయ పార్టీకి లేక పార్టీలకు మద్దతుదార్లు? అమ్మో అది చెప్పడం కష్టం. వారు బహిరంగంగా బయటపడి చెప్పారు. పరోక్షంగా వారు మాట్లాడే మాటలు, సందేశాల  ద్వారా తెలుసుకోవలసిందే. వారికి ఏ పార్టీ అంటే ఇష్టం? ముగ్గురికీ ఒకే పార్టీ అంటే ఇష్టమా? వారు పలు సందర్భాలలో మాట్లాడిన మాటలను పరిశీలిస్తే  ముగ్గురూ ఒక పార్టీకి చెందినవారు మాత్రం కాదు. ముగ్గురు ఖాన్లు వేరు వేరు పార్టీలకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లు అర్ధమవుతోంది.

కండల వీరుడు సల్మాన్ ఖాన్  గుజరాత్లో ఉత్తరాయన్ పండగ  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి పతంగులు ఎగురవేశారు. మోడీని తెగ పొగిడేశారు. ఆకాశానికెత్తేశారు.  ఉత్తమ గుణాలున్న వ్యక్తి దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  ఉత్తరాయన్ పండగ నేపథ్యంలో గుజరాత్లో మోడి పతంగుల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో సల్లూభాయ్ కూడా పాల్గొనడం విశేషం. సల్మాన్ ఖాన్ త్వరలో విడుదల కానున్న తన చిత్రం 'జై హొ'  ప్రమోషన్లో భాగంగా గుజరాత్లో పర్యటించారు.  ఈ సందర్భంగా మోడీతో కలిసిన లంచ్ చేశారు. ఉత్తరాయన్ పండుగ సందర్భంగా తాను సల్మాన్తో కలిసి లంచ్ చేసినట్లు మోడీ ట్విటర్లో ఫోటోతోసహా  పోస్ట్ చేశారు.

సినిమా ప్రచారం కోసం  ప్రయోగాలు చేసే అమీర్‌ ఖాన్‌ రాజకీయంగా చాలా అవగాహన గలవానిగా కనిపిస్తారు. రాజకీయంగా ఆయన ప్రాధాన్యత  అప్పుడప్పుడూ బయటపడుతునే ఉంటుంది. రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన జన్‌లోక్‌పాల్‌ ఉద్యమంలో అమీర్‌ ఖాన్ పాల్గొన్నారు.  ఆ సందర్భంగా ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఈ ఉద్యమంలో  పాల్గొనడం ఓ వ్యక్తికి, పార్టీకి మద్దతివ్వడం కాదని స్పష్టంగా చెప్పారు. ఢిల్లీలో  అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన తరువాత ఒక ఇంటర్వ్యూలో  కేజ్రీవాల్‌ను ప్రశంసించారు. అయితే పొగటంలో మాటను చాలా పొందుపుగా వాడారు. ఆ విధంగా జాగ్రత్తపడ్డారు.

 బాలీవుడ్‌ బాద్షా షారూక్ ఖాన్ మాత్రం ఔట్‌ రైట్‌గా సోనియా గాంధీకే జై అంటారు. అయితే ఆయన  ఆరాధనా భావానికి రాజకీయాలకు సంబంధం లేదని చెబుతారు. అనేక సినిమాల్లో రాహుల్‌ పేరుతో నటించిన షారూఖ్‌ నిజంగా కూడా రాహుల్‌ని అభిమానిస్తారు.  ఈడెన్‌ గార్డెన్స్‌లో టీమ్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ - డెక్కన్‌ ఛార్జర్స్‌ క్రికెట్ మ్యాచ్‌ను షారూక్‌ తన భార్య  గౌరితోపాటు రాహుల్‌, ప్రియాంక, రాబర్ట్‌ వధేరా అంతా కలిసే చూశారు. ఇక్కడ ఒకో విషయం చెప్పాలి. ప్రియాంక గాంధీకి షారూఖ్‌ ఖాన్‌ అంటే పిచ్చ అభిమానమట.

ఎంతైనా సినిమా హీరోలు కదా. వారి ఇబ్బందులు వారికి ఉంటాయి. అందువల్ల వారికి మనసులో రాజకీయ ఆలోచనలు ఏమైనా ఉన్నా బహిరంగంగా బయటపడరు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే ఎటూ తప్పదూ. అప్పటివరకు వారు అలా ఉండటమే శ్రేయస్కరం. ఈ ముగ్గురు ఖాన్‌లు బాలీవుడ్‌ను ఏలుతున్నా  సగటు ప్రేక్షకుడి ఆదరణ పొందడంలో మాత్రం సల్మానే కాస్త ముందున్నట్లు కనిపిస్తాడు. కండల వీరుడిగా మాస్‌లో మంచి ఇమేజ్‌ ఉంది సల్లూభాయ్‌కి. షారూఖ్‌తో పోల్చితే  ట్విట్టర్‌లో సల్మాన్‌ ఫాలోవర్స్‌ సంఖ్య తక్కువే.   సల్లూని ట్విట్టర్‌లో 59 లక్షల మంది ఫాలో అవుతుంటే, షారూక్ను  దాదాపు 65 లక్షల మంది  ఫాలో అవుతున్నారు.  అమీర్‌ ఖాన్ను   55 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement