కుర్ర హీరోల జోరు ఖాన్‌దాన్‌కి చుక్కెదురు | BOLLYWOOD MOVIES SPECIAL 2018 | Sakshi
Sakshi News home page

కుర్ర హీరోల జోరు ఖాన్‌దాన్‌కి చుక్కెదురు

Published Sun, Dec 30 2018 12:28 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

BOLLYWOOD MOVIES SPECIAL 2018 - Sakshi

షారుక్ ఖాన్‌, సల్మాన్ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌

బాలీవుడ్‌ ఖాన్‌దాన్‌లో ముగ్గురు ఖాన్స్‌ (సల్మాన్, షారుక్, ఆమిర్‌) బాక్సాఫీస్‌ను కింగ్స్‌లా రూల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఏడాదిలో ఎవరో ఒక ఖాన్‌ సినిమా మిస్‌ఫైర్‌ అయినా మిగతా ఇద్దరిలో ఎవరో ఒకరి గురి తప్పేది కాదు. కానీ ఈ ఏడాది ముగ్గురు ఖాన్స్‌ సినిమాలు ఢమాల్‌ అన్నాయి. బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్లు కూడా రాబట్టలేకపోవడం విశేషం. సల్మాన్‌ ‘రేస్‌ 3’, ఆమిర్‌ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌’, షారుక్‌ ‘జీరో’ మిశ్రమ ఫలితాన్నే ఇచ్చాయి.

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలు అన్నింట్లో బాలీవుడ్‌ పెద్దది. మిగతా ఇండస్ట్రీలకు పెద్దన్నయ్యలాగా. రీజినల్‌ సినిమాలు... తమ్ముళ్లు, చెలెళ్లు. సంవత్సరం పూర్తయ్యాక ఇంట్లో పిల్లలందరి ప్రోగ్రెస్‌ కార్డులు నాన్నారు సమీక్షించినట్టు.. అన్ని ఇండస్ట్రీలు బాలీవుడ్‌తో పోల్చి చూసుకుంటుంటాయి. వాళ్ల సబ్జెక్ట్‌లు (స్క్రిప్ట్‌లు), వాళ్ల క్లాస్‌ రూమ్‌లు (థియేటర్స్, ఆడియన్స్‌) వేరైనా అంతిమంగా ఎవరెంత శాతం సక్సెస్‌ సాధించారన్నది ముఖ్యం.  కానీ ఈ ఏడాది పెద్దన్నయ్య అనుకున్న రేంజ్‌లో పెర్ఫామ్‌ చేయలేదనే అనుకోవాలి. కొంత కాలంగా అన్ని ఇండస్ట్రీలకు కథలకు కొరత ఉందనే చెప్పాలి. బాలీవుడ్‌కు కథల కొరత సంభవించినప్పుడల్లా సౌత్‌ నుంచి కథలను అరువు తెచ్చుకుంటుంది.

ఒకవేళ సౌత్‌ నుంచి ఏమీ లేకపోతే? అలా ఈ ఏడాది వాళ్లకు దొరికిన బంగారు గని ‘బయోపిక్స్‌’. సుమారు అరడజను బయోపిక్స్‌ను రిలీజ్‌ చేసింది బాలీవుడ్‌ ఈ ఏడాది. హార్డ్‌ హిట్టర్స్‌ అయిన సీనియర్‌ బ్యాట్స్‌మెన్లు (హీరోలు) అందరూ డబుల్, ట్రిపుల్‌ సెంచరీలు కొడతారనుకుంటే స్లిప్‌కి క్యాచ్‌ ఇచ్చి వెంటనే పెవీలియన్‌ చేరుకున్నారు. కానీ.. అండర్‌ 19 నుంచి ప్రమోషన్‌ మీద వచ్చిన యంగ్‌ బ్యాట్స్‌మెన్‌ అందరూ రఫ్‌ ఆడించేయడమే ఈ ఏడాది బాలీవుడ్‌ స్పెషాలిటీ. సక్సెస్‌ కావాలంటే ఫార్ములానే అవసరం లేదు అని యంగ్‌స్టర్స్‌ తామందుకున్న రిజల్ట్‌తో నిరూపించారు.  ఎవరు కొడితే ఏంటి? గ్యాలరీ (థియేటర్‌)లో ఉన్న ఆడియన్స్‌ పాప్‌కార్న్‌కు నంజుగా మంచి అనుభూతిని అందించామా? లేదా? అన్నదే కదా ముఖ్యం. ఈ ఏడాది బాలీవుడ్‌ ఎలా గడిచిందంటే...

మన సౌత్‌ ఇండియన్‌ మార్కెట్లలో సినిమాల పండగ సంక్రాంతికి మొదలైతే బాలీవుడ్‌ వాళ్లకు రిపబ్లిక్‌ వీకెండ్‌ నుంచి స్టార్ట్‌ అవుతుంది. సీజన్‌ స్టార్ట్‌ అవ్వకముందే హిట్‌ సినిమాలేం వదులుతాములే అన్నట్టు రిపబ్లిక్‌ వీకెండ్‌ వరకూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్‌ కాలేదు. ఈ ఏడాదిని విక్రమ్‌ భట్‌ హారర్‌ చిత్రం ‘1921’తో మొదలుపెట్టారు. ప్రేక్షకులు దడుచుకోలేదు. ఏం ఫర్వాలేదు.. హారర్‌ పోతే పోయింది.. యాక్షన్, లవ్‌ సినిమాలున్నాయి కదా.. ఈ ఏడాదిని ధైర్యంగా దాటేయొచ్చు అనే దీమా బాక్సాఫీస్‌కి ఏర్పడింది.

తర్వాత సైఫ్‌ అలీఖాన్‌ ‘కళాకండీ’, అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన ‘ముక్కాబాజ్‌’ సినిమాలు రిలీజయ్యాయి. ‘ముక్కాబాజ్‌’లో హీరో వినీత్‌ తన పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే ప్రదర్శనైతే కనబరిచారు. ఆ తర్వాత ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్‌’ మంచి హిట్‌ సాధించింది. 2018లో వచ్చిన ఫస్ట్‌ హిట్‌. చరిత్రను వక్రీకరిస్తున్నారని కొందరు సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డంకులన్నీ దాటి థియేటర్స్‌ వరకూ చేరుకోగలిగిందీ సినిమా. మంచి హిట్‌. 300 కోట్ల కలెక్షన్స్‌. పద్మావతిని దక్కించుకోవాలన్న ఖిల్జీ (రణ్‌వీర్‌) ప్రయత్నం విఫలమైంది.  ‘పద్మావతి’ దక్కకపోయినా బాధపడకంటూ ఈ ఏడాది ఉన్న బెస్ట్‌ యాక్టర్‌ పురస్కారాలు రణ్‌వీర్‌ని సముదాయించాయి. అన్నట్లు.. సినిమాలో దక్కని దీపికా రియల్‌ లైఫ్‌లో రణ్‌వీర్‌కు దక్కారు.


దీపికా పదుకోన్‌

సందేశానికి పట్టం
‘పద్మావత్‌’ రిలీజ్‌ రోజే రిలీజ్‌ కావల్సిన అక్షయ్‌ కుమార్‌ ‘ప్యాడ్‌మ్యాన్‌’ క్లాష్‌ వద్దు సింగిల్‌ రిలీజే ముద్దు అంటూ ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. తక్కువ ఖర్చుతో శానిటరీ న్యాప్‌కిన్‌ తయారు చేసిన అరుణాచలం మురుగనాథన్‌ ఆశయానికి ‘ప్యాడ్‌మ్యాన్‌’ ద్వారా స్క్రీన్‌ రూపమిచ్చారు దర్శకుడు బాల్కీ. సందేశాత్మక సినిమా అయినా కాసుల వర్షం కురిపించింది. డిజిటల్‌ మార్కెట్‌ రానుందని హింట్‌ ఇస్తూ ఆ తర్వాతి వారంలో విక్కీ కౌశల్‌ ‘లవ్‌ ఫర్‌ స్క్వేర్‌ ఫూట్‌’ థియేటర్స్‌లో కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై, మంచి రెస్పాన్స్‌ రాబట్టుకుంది. సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్స్‌కు పెట్టింది పేరు నీరజ్‌ పాండే. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రకుల్, మనోజ్‌ బాజ్‌పాయ్‌లతో ముంబైలో జరిగిన ఓ స్కామ్‌ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘అయ్యారే’.

థ్రిల్లర్‌తో వచ్చే చిక్కేంటంటే ప్రేక్షకుడిని టెన్షన్‌ పెట్టకపోతే అసహనం అడగకుండానే వస్తుంది. ఈ సినిమాకి అలానే వచ్చింది. దాంతో అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌ ‘సోనూ కీ టీటు కి స్వీటీ’. కమర్షియల్‌గా వంద కోట్లు చేసేసింది. ‘సాగర సంగమం’లో భంగిమ అంటూ కమల్‌ హాసన్‌ని ఇబ్బంది పెట్టిన బుడతడు పెరిగి పెద్దయి బాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అవుతూ తీసిన ‘వెల్కమ్‌ టు న్యూయార్క్‌’ ఫ్లాప్‌గా నిలిచింది. నిర్మాతగా మారిన అనుష్కా శర్మ తన మూడో ప్రయత్నంగా నిర్మించిన సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ ‘పరీ’. అనుష్క పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డా సినిమాకు ఎక్కువ మార్కులేయడంలో పిసినారితనం చూపించారు ప్రేక్షకులు, విమర్శకులూ. హాట్‌ చిత్రాల సిరీస్‌ ‘హేట్‌ స్టోరీ 4’ దారుణంగా మిస్‌ఫైర్‌ అయింది.

ఇలియానాతో కలసి అజయ్‌ దేవగణ్‌ థియేటర్స్‌ మీద జరిపిన ‘రైడ్‌’ మంచి అనుభూతినిచ్చింది. కమర్షియల్‌గా బాక్సాఫీస్‌ సక్సెస్‌ అందుకుంది. నాలుగేళ్ల విరామం తర్వాత రాణీ ముఖర్జీ ‘హిచ్కీ’తో కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. ఎన్నేళ్లు గ్యాప్‌ ఇచ్చినా మీరంటే అంతే పిచ్చి అని ‘హిచ్కీ’కి మంచి సక్సెస్‌ అందించారు. కేవలం ఇండియాలోనే కాకుండా చైనా బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లు సాధించింది ‘హిచ్కీ’. తెలుగులో హిట్‌ వస్తే చాలు క్షణం ఆలోచించకుండా రీమేక్‌ చేయాలనుకుంటారు టైగర్‌ ష్రాఫ్‌. మన అడవి శేష్‌ ‘క్షణం’కి గన్‌లు, యాక్షన్‌ సీన్లు భారీగా జోడించి ‘భాగీ 2’గా విడుదల చేశారు. డబ్బులొచ్చినా కూడా అనుకున్నని అభినందనలు రాలేదు. మళ్లీ ‘భాగీ 3’గా 2020లో వస్తున్నాను అని ఆల్రెడీ టైగర్‌ ష్రాఫ్‌ అనౌన్స్‌ చేశారు కూడా. ఈ పార్ట్‌ 3 కోసం ఏ తెలుగు సినిమాను ఎంపిక చేసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మార్చిలో మజా లేదు
ఇర్ఫాన్‌ఖాన్‌ ‘బ్లాక్‌మెయిల్‌’ కామెడీకు బాగానే నవ్వుకున్నారు. మనోజ్‌ భాజ్‌పాయ్, టబుల ‘మిస్సింగ్‌’లో ఏదో మిస్సయిందన్నారు. సూజిత్‌ సర్కార్‌ తెరకెక్కించిన సున్నితమైన లవ్‌స్టోరీ ‘అక్టోబర్‌’. ఈ పరిమళం భలే ఉందే అంటూ మంచి హిట్‌ చేశారు ప్రేక్షకులు. వరుణ్‌ ధావన్‌ నటుడిగా ఒక మెట్టు ఎదిగారంటూ రాసుకొచ్చింది బాలీవుడ్‌ మీడియా. ‘బియాండ్‌ క్లౌడ్స్‌’ కొన్ని వర్గాల ఆడియన్స్‌కు మాత్రమే అనిపించుకుంది.  సుధీర్‌ మిశ్రా ‘దాస్‌ దేవ్‌’ను ఫర్వాలేదన్నారు. సో.. మార్చి నెల పెద్ద మజా లేకుండానే ముగిసింది.

టాప్‌లో సంజు
తండ్రీకొడుకులుగా ‘102 నాటౌట్‌’లో అమితాబ్, రిషీ కపూర్‌ చేసిన హంగామా ఆకట్టుకుంది. జీవితం పట్ల నిరాశలో ఉన్న కొడుకుకి జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పారు అమితాబ్‌. ప్రేక్షకులు కూడా థియేటర్స్‌కు పరిగెట్టి మరీ నేర్చుకున్నారు ఈ పాఠాలు. ఈ ఏడాది బెస్ట్‌ చిత్రాల్లో ఒకటైన ‘రాజీ’ మే 11న రిలీజైంది. మేఘన్‌ గుల్జార్‌ తెరకెక్కించిన ఈ పాకిస్థాన్‌– ఇండియన్‌ స్పై డ్రామా విపరీతంగా ఆకట్టుకుంది. ఆలియా భట్‌ నటనకు బాక్సాఫీస్‌ వంద కోట్లు ఇవిగో అంటూ ఆమె ఒళ్లో పోసింది. ఇందాక మాట్లాడుకున్న విక్కీ కౌశల్‌ ఈ సినిమాలోనూ మెరిశాడు. జాన్‌ అబ్రహామ్‌ పేట్రియాటిక్‌ డ్రామా ‘పరమాణు’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. న్యూ ఏజ్‌ సినిమా అంటూ కరీనా కపూర్, సోనమ్‌ కపూర్, స్వరా భాస్కర్‌ చేసిన ప్రయత్నం ‘వీరే ది వెడ్డింగ్‌’ ఎక్కువ నెగటీవ్‌ ఫీడ్‌బ్యాక్‌నే అందించింది. 

ఫస్ట్‌ డే అనుహ్య కలెక్షన్స్‌ సాధించినప్పటికీ యావరేజ్‌తో సరిపెట్టుకుంది. అక్క సోనమ్‌తో పాటు అదే రోజు తమ్ముడి హర్షవర్థన్‌ కపూర్‌ ‘బవేష్‌ జోషీ’ రిలీజైంది. పాజిటీవ్‌ రివ్యూస్‌ని పైసలుగా మార్చుకోవడంలో ఇబ్బంది పడింది ఈ సినిమా. హిందీలో రేస్‌ సిరీస్‌కు మంచి క్రేజ్‌ ఉంది. అందులోనూ మూడో పార్ట్‌ను సల్మాన్‌ ఖాన్‌ చేస్తున్నాడు అనేసరికి ఫ్యాన్స్‌ ఆశలు, బాక్సాఫీస్‌ ఆకలినీ పెంచేసుకుంది. రెంటినీ తీర్చడంలో దారుణంగా విఫలమైంది ‘రేస్‌ 3’. ఆ తర్వాత మోస్ట్‌ వెయిటెడ్‌ బయోపిక్‌ ‘సంజు’ రిలీజైంది. సంజయ్‌ దత్‌లా రణ్‌బీర్‌ కపూర్‌ నటించి కాదు జీవించి సినిమాను బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చేశారు. రాజ్‌కుమార్‌ హిరాణీ సినిమా స్టైల్‌లోనే నవ్వులు పూయిస్తూ చివర్లో ముక్కులూ తుడిపించారు. సంజయ్‌కు క్లీన్‌ ఇమేజ్‌ తీసుకొచ్చే భాగమే ఈ బయోపిక్‌ అని కామెంట్స్‌ గట్టిగానే వినిపించాయి. ఈ ఏడాది వరల్డ్‌ వైడ్‌ కలెక్షన్స్‌ లిస్ట్‌లో టాప్‌ స్థానం మాత్రం సంజుదే.

తాప్సీకి రెండు విజయాలు
స్పోర్ట్స్‌ డ్రామా ‘సూర్మ’లో తాప్సీ పర్ఫార్మెన్స్‌ సూపరమ్మా అని కితాబులిచ్చారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ పరిచయమైన చిత్రం ‘ధడక్‌’. మరాఠీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘సైరాట్‌’ రీమేక్‌గా రిలీజ్‌ అయిన ఈ చిత్రం నిరాశే మిగిల్చింది. జాన్వీ నటన గురించి మంచి విషయాలే చెప్పారు ప్రేక్షకులు. సంజయ్‌ దత్‌ ‘సాహెబ్‌ బీవీ అవుర్‌ గ్యాంగ్‌స్టర్‌’ ఫ్లాప్‌. అనిల్‌ కపూర్, ఐశ్వర్యా రాయ్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన ‘ఫ్యాన్నీ ఖాన్‌’ మంచి ఫలితమే ఇచ్చింది. తాప్సీ, రిషీ కపూర్‌ ముఖ్య పాత్రల్లో కనిపించిన చిత్రం ‘ముల్క్‌’. విమర్శకులు అద్భుతంగా ప్రశంసించారు. బాక్సాఫీస్‌ దగ్గర కూడా మంచి హిట్‌నే నమోదు చేసుకుంది.

ఓ స్త్రీ మళ్లీ రా
మలయాళ యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘కర్వాన్‌’. ఇర్ఫాన్‌ ఖాన్, మిథిలా పార్కర్‌లతో కలిసి దుల్కర్‌ చేసిన ఈ రోడ్‌ మూవీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. బాలీవుడ్‌కు మరో ఇంపార్టెంట్‌ వీక్‌ ఇండిపెండెన్స్‌ వీక్‌. అక్షయ్‌ కుమార్‌ ‘గోల్డ్‌’, జాన్‌ అబ్రహామ్‌ ‘సత్యమేవ జయతే’ బాక్సాఫీస్‌ దగ్గర పోటీపడ్డాయి. స్వాతంత్య్రం తర్వాత భారతదేశం ఫుట్‌బాల్‌ టీమ్‌ సాధించిన తొలి గోల్డ్‌ మెడల్‌ కథ ఇది అంటూ తెరకెక్కిన ‘గోల్డ్‌’ చిత్రం బాగానే ఆడింది. ‘దిల్‌ బర్‌’ సాంగ్‌తో స్పెషల్‌ క్రేజ్‌ సాధించిన ‘సత్యమేవ జయతే’ కూడా డీసెంట్‌గా రన్‌ అయింది. సోనాక్షి ‘హ్యాపీ ఫిర్‌ భాగ్‌ జాయేగీ’, డియోల్స్‌ (సన్నీ, బాబీ, ధర్మేందర్‌) చేసిన కామెడీ ‘యమ్లా పగ్లా దీవానా’ ఫ్లాప్స్‌గా నిలిచిచాయి. ‘ఓ స్త్రీ రేపు రా’ అనే చిన్న వాక్యానికి సంబంధించిన హారర్‌ స్టోరీని మనం చాలా సార్లే విన్నాం. ఇప్పుడు ఇదే లైన్‌తో దర్శక ద్వయం రాజ్‌–డీకే రచించిన ‘స్త్రీ’ చిత్రం పెద్ద హిట్‌. సినిమా హాళ్లలో కిందా మీదా పడి మరీ నవ్వుతూ తెచ్చుకున్న పాప్‌కార్న్‌ను వొలికించేశారు ఆడియన్స్‌. ఈ ఏడాది వసూళ్లలో టాప్‌లో నిలిచిన చిత్రాల్లో ఇది ఒకటి. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్‌ రావ్‌ నటించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ తీసే ప్లాన్స్‌లో ఉన్నారు దర్శక–నిర్మాతలు.

రీమేక్‌ కుదరలేదు
ఇంతియాజ్‌ అలీ సమర్పణలో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘లైలా మజ్ను’ ఫర్వాలేదనిపించుకుంది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాల చుట్టూ డార్క్‌ సినిమాలు తెరకెక్కించే అనురాగ్‌ కశ్యప్‌ తొలిసారి రూపొందించిన లవ్‌స్టోరీ ‘మన్‌మర్జియా’. విక్కీ కౌశల్, తాప్సీ, అభిషేక్‌ పోటీపడి మరీ నటించారు. సూపర్‌ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. ‘లవ్‌ సోనియ’, మిత్రోన్, బట్టీ గుల్‌ మీటర్‌ చాలు’ వచ్చినవి వచ్చినట్టుగా వెళ్లిపోయాయి. ‘పెళ్లి చూపులు’ రీమేక్‌గా రూపొందిన ‘మిత్రోన్‌’ రీమేక్‌ను చెడగొట్టారనే కామెంట్‌ను కూడా మూటగట్టుకుంది. రచయిత మంటో లైఫ్‌ ఆధారంగా నందితా దాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘మంటో’. మంటోగా నవాజుద్ధిన్‌ సిద్ధిఖీ నటనకు డిస్టింక్షన్‌ మార్కులు పడ్డాయి. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అనే కాన్సెప్ట్‌తో వరుణ్, అనుష్కా శర్మ చేసిన చిత్రం ‘సూయి ధాగా’. శరత్‌ కాత్రియా తెరకెక్కించిన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. పాకిస్థాన్, ఇండియా లాంటి అక్కాచెల్లెళ్లు అంటూ ఒకరంటే ఒకరికి పడని సిస్టర్స్‌ కథతో విశాల్‌ భరద్వాజ్‌ తెరకెక్కించిన ‘పటాకా’ యావరేజ్‌గా నిలిచింది.

గుడ్డిగా డబ్బులిచ్చేశారు
సల్మాన్‌ ఖాన్‌ తన బావమరిది ఆయుష్‌ శర్మను పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘లవ్‌యాత్రి’. నవరాత్రులు అయ్యేలోపు సినిమాను కూడా తీసేశారు. అదే రోజు రిలీజైన ఆయుష్మాన్‌ ఖురాన్‌ ‘అంధాధూన్‌’ వందకు వంద మార్కులు వేయించుకుంది. ప్రేక్షకులు ఈ సినిమాకి గుడ్డిగా డబ్బులిచ్చేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి థ్రిల్లర్‌ని చూడలేదన్నారు. హాలీవుడ్‌ లాంటి అసంబద్ధ థ్రిల్లర్‌లు, అర్థమయ్యేట్టు స్పూన్‌ ఫీడింగ్‌ కూడా చేయక్కర్లేదు అని హీరోను గుడ్డివాణ్ణి చేసి మరీ ఇంకా ఫార్ములా ఛట్రంలోనే కొట్టుమిట్టాడుతున్న కొందరి కళ్లైనా తెరిపించారు చిత్రదర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌.  ‘కాజోల్‌ హెలీకాఫ్టర్‌ ఈల’ సరిగ్గా ఆడలేదు. హారర్‌ థ్రిల్లర్‌ ‘తుంబాడ్‌’ మంచి రివ్యూస్‌ని అందుకున్నా క్యాష్‌ చేసుకోలేకపోయింది. అర్జున్‌ కపూర్‌ ‘నమస్తే ఇంగ్లాండ్‌’ దారుణంగా విఫలమైంది. ఆల్రెడీ ‘అంధాధూన్‌’ వంటి సూపర్‌ హిట్‌తో ఫామ్‌లో ఉన్న ఆయుష్మాన్‌ ఖురానా ‘బదాయి హో (శుభాకాంక్షలు)’కు మరోసారి బదాయి హో అన్నారు ఆడియన్స్‌. నీనా గుప్తా, గజ్‌రాజ్‌ పాత్రలు పోషించిన తీరుకు మంచి రెస్పాన్స్‌ లభించింది. మళ్లీ ఆమిర్‌ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌’ వరకూ చెప్పుకునే సినిమాలే రాలేదని చెప్పాలి.

దొంగలు కొల్లగొట్టలేకపోయారు
అమితాబచ్చన్, ఆమిర్‌ఖాన్‌ తొలిసారి కలసి రావడం, అదీ.. దొంగల్లా అనేసరికి ప్రేక్షకులంతా ఆమితానంద పడిపోయి నిలువు దోపిడీ ఇచ్చుకుందాం అనుకున్నారు. కానీ ఎందుకో ఈ థగ్స్‌ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టుకోవడంలో తడబడ్డారు. సినిమా విపరీతంగా నిరాశపరిచింది. సన్నీ డియోల్‌ ‘మొహల్లా అస్సీ’ కూడా సరిగ్గా ఆడలేదు. రిషీ కపూర్‌ ‘రాజ్మా చావ్లా’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ చేశారు. చావ్లా రుచి బాగుంది అన్నారు ఆడియన్స్‌.

మళ్లీ నిరాశ
సైఫ్‌ అలీఖాన్‌ తనయ సారాని పరిచయం చేస్తూ అభిషేక్‌ కపూర్‌  తీసిన ‘కేధార్‌నాథ్‌’ నిరాశపరిచింది. ఆ తర్వాత షారుక్‌ ఖాన్‌  ‘జీరో’ విడుదలైంది. ఎప్పుడో ‘అపూర్వ సహోదరులు’లో కమల్‌హాసన్‌ మరుగుజ్జు పాత్ర చేశారు. వీఎఫ్‌ఎక్స్‌ ద్వారా షారుక్‌ ఖాన్‌ను మరుగుజ్జును చేశారు దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌. ఈ మధ్య సరైన హిట్స్‌ ఇవ్వలేదు షారుక్‌. ఈసారి కచ్చితంగా హిట్‌ సాధిస్తాడని ఆశలు పెంచుకున్న అభిమానులకు చుక్కెదురైంది. ఈ ఏడాదికి  ‘సింబా’తో గుడ్‌బై చెప్పారు రణ్‌వీర్‌ సింగ్‌. ‘టెంపర్‌’ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి టాక్‌తో థియేటర్స్‌లో నడుస్తోంది.
సినిమా ఫలితాల్ని ముందే పసిగట్టలేం. కానీ మంచి ఫలితాలు అందుకోవాలనే అందరూ శ్రమిస్తారు. ఆ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని కోరుకుందాం. 2017కన్నా 2018 బాగుంది. 2019 మరింత పసందుగా ఉండాలని ఆకాంక్షిద్దాం.

యంగ్‌ స్టార్స్‌దే హవా
ఈ ఏడాది బాలీవుడ్‌ యంగస్టర్స్‌దే. విక్కీ కౌశల్‌ (లవ్‌ ఫర్‌ స్క్వేర్‌ ఫూట్, రాజీ, సంజు), ఆయుష్మాన్‌ ఖురానా (అంధాధూన్, బదాయి హో), రాజ్‌కుమార్‌ రావ్‌ (స్త్రీ)లదే హవా. వీళ్ల సినిమాలు విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ కూడా తెచ్చిపెట్టాయి. ఖాన్‌లను కాదని మరీ ఈ యంగ్‌ హీరో సినిమాల టికెట్స్‌ను తెంపారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ల సినిమాలు ఎలా ఉన్నాయో.


ఆయుష్మాన్‌ ఖురానా,రాజ్‌కుమార్‌ రావ్‌, విక్కీ కౌశల్‌

బిజినెస్‌ బావుంది!
గతేడాదితో పొలిస్తే ఈ ఏడాది బాలీవుడ్‌ బిజినెస్‌ 15 నుంచి 20 శాతం వరకూ పెరిగిందన్నారు ట్రేడ్‌ విశ్లేషకులు. 2017లో బాలీవుడ్‌ సినిమాల బిజినెస్‌ సుమారు 4,096 కోట్లు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య సుమారు 4,800 కోట్లకు చేరుకుంది. ముగ్గురి ఖాన్‌ల సినిమాలు రిలీజ్‌ అయినా కూడా కంటెంట్‌తో ఉన్న చిన్న సినిమాలే ఈ ఏడాది జాక్‌పాట్‌ అన్నారు. ‘సోనూకే టీటుకే స్వీటీ, స్త్రీ, అంధాధూన్, బదాయి హో’ వంటి చిన్న చిత్రాలు సర్‌ప్రైజ్‌ హిట్స్‌గా నిలిచాయి. కలెక్షన్స్‌లో ‘సంజు’ టాప్‌లో ఉన్నాడు.


రణ్‌బీర్‌

స్ట్రాంగ్‌ ఫీమేల్‌ క్యారెక్టర్స్‌
హీరోయిన్స్‌ గ్లామర్‌ పాత్రలకు మాత్రమే పరిమితమవకుండా ఈ ఏడాది స్ట్రాంగ్‌ ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ కొన్ని బాలీవుడ్‌ సినిమాల్లో కనిపించాయి. దీపికా పదుకోన్‌ (పద్మావత్‌), ఆలియా భట్‌ (రాజీ), రాణీ ముఖర్జీ (హిచ్కీ), తాప్సీ (ముల్క్, మన్‌మర్జియా), అనుష్కా శర్మ (సూయి ధాగా). అలాగే.. టబు (అంధాధూన్‌), నీనా గుప్తా (బదాయి హో) లాంటి పాత్రలన్నీ గుర్తుండటానికి కారణం గ్లామర్‌ మోతాదే కాకపోవడం విశేషం!

ఆలియా భట్‌

ట్రెండేంటి?
బయోపిక్స్‌తో పాటు ఈ ఏడాది కనిపించిన మరో ట్రెండ్‌ రీమిక్స్‌. పాత సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ను రీమిక్స్‌ చేసి సినిమాలకు క్రేజ్‌ తెచ్చుకోవాలనుకున్నారు. పాత పాట మ్యాజిక్‌ ఏ పాటా రిపీట్‌ చేయలేదన్నది మాత్రం వాస్తవం. అలాగే దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా పెళ్లిలు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యాయి.

– గౌతమ్‌ మల్లాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement