Race 3
-
ఆ టైమ్ వచ్చింది
దాదాపు ఏడాది పూర్తి కావొచ్చింది ‘రేస్ 3’ సినిమా విడుదలై. ఒక్క జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తప్ప ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లంతా తమ తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ బ్యూటీ తర్వాతి సినిమాపై ఇంకా ఎందుకు క్లారిటీ రాలేదబ్బా? అని బీటౌన్‌లో ఎంక్వైరీ చేసిన వారికి ‘ఆమె యాక్టింగ్ క్లాసులకు వెళుతోందని, అది కూడా లాస్ ఏంజిల్స్‌లోని ఇవనా చుబ్బుక్ స్టూడియోలో’ అని తెలిసింది. చార్లైజ్ త్రోన్, బ్రాడ్‌పిట్, జేమ్స్ ఫ్రాంకో వంటి హాలీవుడ్ స్టార్లు ఈ స్టూడియోలోనే యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్ల తర్వాత యాక్టింగ్ క్లాసులు ఏంటి? అని జాక్వెలిన్‌ని అడిగితే.. ‘‘దశాబ్దకాలంగా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాను. నా కెరీర్ తొలినాళ్లలో సినిమాల గురించి అర్థం చేసుకోవడానికి నాకు టైమ్ పట్టింది. కానీ నేనెప్పుడూ యాక్టింగ్ క్లాసులు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటున్నాను. ట్రైనింగ్ బాగుంది. నా కెరీర్లో ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేశాను. ఇప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్, ఎక్స్పరిమెంట్ .. ఇలా రెండు జానర్లను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయాల్సిన టైమ్ వచ్చిందని తెలిసింది. అందుకే ట్రైనింగ్ తీసుకుంటున్నాను’’ అన్నారు. తాను నటించిన ‘డ్రైవ్’ గురించి మాట్లాడుతూ – ‘‘నేను, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ఈ సినిమా విడుదల ఆగిపోలేదు. త్వరలోనే ఆడియన్స్ థియేటర్స్‌లో చూస్తారు’ అని చెప్పుకొచ్చారు జాక్వెలిన్. -
కుర్ర హీరోల జోరు ఖాన్‌దాన్‌కి చుక్కెదురు
బాలీవుడ్ ఖాన్దాన్లో ముగ్గురు ఖాన్స్ (సల్మాన్, షారుక్, ఆమిర్) బాక్సాఫీస్‌ను కింగ్స్‌లా రూల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఏడాదిలో ఎవరో ఒక ఖాన్ సినిమా మిస్‌ఫైర్ అయినా మిగతా ఇద్దరిలో ఎవరో ఒకరి గురి తప్పేది కాదు. కానీ ఈ ఏడాది ముగ్గురు ఖాన్స్ సినిమాలు ఢమాల్ అన్నాయి. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా రాబట్టలేకపోవడం విశేషం. సల్మాన్ ‘రేస్ 3’, ఆమిర్ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’, షారుక్ ‘జీరో’ మిశ్రమ ఫలితాన్నే ఇచ్చాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలు అన్నింట్లో బాలీవుడ్ పెద్దది. మిగతా ఇండస్ట్రీలకు పెద్దన్నయ్యలాగా. రీజినల్ సినిమాలు... తమ్ముళ్లు, చెలెళ్లు. సంవత్సరం పూర్తయ్యాక ఇంట్లో పిల్లలందరి ప్రోగ్రెస్ కార్డులు నాన్నారు సమీక్షించినట్టు.. అన్ని ఇండస్ట్రీలు బాలీవుడ్‌తో పోల్చి చూసుకుంటుంటాయి. వాళ్ల సబ్జెక్ట్‌లు (స్క్రిప్ట్‌లు), వాళ్ల క్లాస్ రూమ్‌లు (థియేటర్స్, ఆడియన్స్) వేరైనా అంతిమంగా ఎవరెంత శాతం సక్సెస్ సాధించారన్నది ముఖ్యం. కానీ ఈ ఏడాది పెద్దన్నయ్య అనుకున్న రేంజ్లో పెర్ఫామ్ చేయలేదనే అనుకోవాలి. కొంత కాలంగా అన్ని ఇండస్ట్రీలకు కథలకు కొరత ఉందనే చెప్పాలి. బాలీవుడ్‌కు కథల కొరత సంభవించినప్పుడల్లా సౌత్ నుంచి కథలను అరువు తెచ్చుకుంటుంది. ఒకవేళ సౌత్ నుంచి ఏమీ లేకపోతే? అలా ఈ ఏడాది వాళ్లకు దొరికిన బంగారు గని ‘బయోపిక్స్’. సుమారు అరడజను బయోపిక్స్‌ను రిలీజ్ చేసింది బాలీవుడ్ ఈ ఏడాది. హార్డ్ హిట్టర్స్ అయిన సీనియర్ బ్యాట్స్మెన్లు (హీరోలు) అందరూ డబుల్, ట్రిపుల్ సెంచరీలు కొడతారనుకుంటే స్లిప్‌కి క్యాచ్ ఇచ్చి వెంటనే పెవీలియన్ చేరుకున్నారు. కానీ.. అండర్ 19 నుంచి ప్రమోషన్ మీద వచ్చిన యంగ్ బ్యాట్స్‌మెన్ అందరూ రఫ్ ఆడించేయడమే ఈ ఏడాది బాలీవుడ్ స్పెషాలిటీ. సక్సెస్ కావాలంటే ఫార్ములానే అవసరం లేదు అని యంగ్‌స్టర్స్ తామందుకున్న రిజల్ట్‌తో నిరూపించారు. ఎవరు కొడితే ఏంటి? గ్యాలరీ (థియేటర్)లో ఉన్న ఆడియన్స్ పాప్‌కార్న్‌కు నంజుగా మంచి అనుభూతిని అందించామా? లేదా? అన్నదే కదా ముఖ్యం. ఈ ఏడాది బాలీవుడ్ ఎలా గడిచిందంటే... మన సౌత్ ఇండియన్ మార్కెట్లలో సినిమాల పండగ సంక్రాంతికి మొదలైతే బాలీవుడ్ వాళ్లకు రిపబ్లిక్ వీకెండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సీజన్ స్టార్ట్ అవ్వకముందే హిట్ సినిమాలేం వదులుతాములే అన్నట్టు రిపబ్లిక్ వీకెండ్ వరకూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఈ ఏడాదిని విక్రమ్ భట్ హారర్ చిత్రం ‘1921’తో మొదలుపెట్టారు. ప్రేక్షకులు దడుచుకోలేదు. ఏం ఫర్వాలేదు.. హారర్ పోతే పోయింది.. యాక్షన్, లవ్ సినిమాలున్నాయి కదా.. ఈ ఏడాదిని ధైర్యంగా దాటేయొచ్చు అనే దీమా బాక్సాఫీస్‌కి ఏర్పడింది. తర్వాత సైఫ్ అలీఖాన్ ‘కళాకండీ’, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘ముక్కాబాజ్’ సినిమాలు రిలీజయ్యాయి. ‘ముక్కాబాజ్’లో హీరో వినీత్ తన పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే ప్రదర్శనైతే కనబరిచారు. ఆ తర్వాత ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ‘పద్మావత్’ మంచి హిట్ సాధించింది. 2018లో వచ్చిన ఫస్ట్ హిట్. చరిత్రను వక్రీకరిస్తున్నారని కొందరు సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డంకులన్నీ దాటి థియేటర్స్ వరకూ చేరుకోగలిగిందీ సినిమా. మంచి హిట్. 300 కోట్ల కలెక్షన్స్. పద్మావతిని దక్కించుకోవాలన్న ఖిల్జీ (రణ్వీర్) ప్రయత్నం విఫలమైంది. ‘పద్మావతి’ దక్కకపోయినా బాధపడకంటూ ఈ ఏడాది ఉన్న బెస్ట్ యాక్టర్ పురస్కారాలు రణ్‌వీర్‌ని సముదాయించాయి. అన్నట్లు.. సినిమాలో దక్కని దీపికా రియల్ లైఫ్‌లో రణ్‌వీర్‌కు దక్కారు. దీపికా పదుకోన్ సందేశానికి పట్టం ‘పద్మావత్’ రిలీజ్ రోజే రిలీజ్ కావల్సిన అక్షయ్ కుమార్ ‘ప్యాడ్‌మ్యాన్’ క్లాష్ వద్దు సింగిల్ రిలీజే ముద్దు అంటూ ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. తక్కువ ఖర్చుతో శానిటరీ న్యాప్కిన్ తయారు చేసిన అరుణాచలం మురుగనాథన్ ఆశయానికి ‘ప్యాడ్‌మ్యాన్’ ద్వారా స్క్రీన్ రూపమిచ్చారు దర్శకుడు బాల్కీ. సందేశాత్మక సినిమా అయినా కాసుల వర్షం కురిపించింది. డిజిటల్ మార్కెట్ రానుందని హింట్ ఇస్తూ ఆ తర్వాతి వారంలో విక్కీ కౌశల్ ‘లవ్ ఫర్ స్క్వేర్ ఫూట్’ థియేటర్స్‌లో కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై, మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్‌కు పెట్టింది పేరు నీరజ్ పాండే. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్, మనోజ్ బాజ్‌పాయ్‌లతో ముంబైలో జరిగిన ఓ స్కామ్ ఆధారంగా రూపొందించిన చిత్రం ‘అయ్యారే’. థ్రిల్లర్‌తో వచ్చే చిక్కేంటంటే ప్రేక్షకుడిని టెన్షన్ పెట్టకపోతే అసహనం అడగకుండానే వస్తుంది. ఈ సినిమాకి అలానే వచ్చింది. దాంతో అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద హిట్ ‘సోనూ కీ టీటు కి స్వీటీ’. కమర్షియల్‌గా వంద కోట్లు చేసేసింది. ‘సాగర సంగమం’లో భంగిమ అంటూ కమల్ హాసన్‌ని ఇబ్బంది పెట్టిన బుడతడు పెరిగి పెద్దయి బాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం అవుతూ తీసిన ‘వెల్కమ్ టు న్యూయార్క్’ ఫ్లాప్‌గా నిలిచింది. నిర్మాతగా మారిన అనుష్కా శర్మ తన మూడో ప్రయత్నంగా నిర్మించిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ‘పరీ’. అనుష్క పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడ్డా సినిమాకు ఎక్కువ మార్కులేయడంలో పిసినారితనం చూపించారు ప్రేక్షకులు, విమర్శకులూ. హాట్ చిత్రాల సిరీస్ ‘హేట్ స్టోరీ 4’ దారుణంగా మిస్‌ఫైర్ అయింది. ఇలియానాతో కలసి అజయ్ దేవగణ్ థియేటర్స్ మీద జరిపిన ‘రైడ్’ మంచి అనుభూతినిచ్చింది. కమర్షియల్‌గా బాక్సాఫీస్ సక్సెస్ అందుకుంది. నాలుగేళ్ల విరామం తర్వాత రాణీ ముఖర్జీ ‘హిచ్కీ’తో కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఎన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా మీరంటే అంతే పిచ్చి అని ‘హిచ్కీ’కి మంచి సక్సెస్ అందించారు. కేవలం ఇండియాలోనే కాకుండా చైనా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది ‘హిచ్కీ’. తెలుగులో హిట్ వస్తే చాలు క్షణం ఆలోచించకుండా రీమేక్ చేయాలనుకుంటారు టైగర్ ష్రాఫ్. మన అడవి శేష్ ‘క్షణం’కి గన్లు, యాక్షన్ సీన్లు భారీగా జోడించి ‘భాగీ 2’గా విడుదల చేశారు. డబ్బులొచ్చినా కూడా అనుకున్నని అభినందనలు రాలేదు. మళ్లీ ‘భాగీ 3’గా 2020లో వస్తున్నాను అని ఆల్రెడీ టైగర్ ష్రాఫ్ అనౌన్స్ చేశారు కూడా. ఈ పార్ట్ 3 కోసం ఏ తెలుగు సినిమాను ఎంపిక చేసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చిలో మజా లేదు ఇర్ఫాన్‌ఖాన్ ‘బ్లాక్మెయిల్’ కామెడీకు బాగానే నవ్వుకున్నారు. మనోజ్ భాజ్‌పాయ్, టబుల ‘మిస్సింగ్’లో ఏదో మిస్సయిందన్నారు. సూజిత్ సర్కార్ తెరకెక్కించిన సున్నితమైన లవ్‌స్టోరీ ‘అక్టోబర్’. ఈ పరిమళం భలే ఉందే అంటూ మంచి హిట్ చేశారు ప్రేక్షకులు. వరుణ్ ధావన్ నటుడిగా ఒక మెట్టు ఎదిగారంటూ రాసుకొచ్చింది బాలీవుడ్ మీడియా. ‘బియాండ్ క్లౌడ్స్’ కొన్ని వర్గాల ఆడియన్స్‌కు మాత్రమే అనిపించుకుంది. సుధీర్ మిశ్రా ‘దాస్ దేవ్’ను ఫర్వాలేదన్నారు. సో.. మార్చి నెల పెద్ద మజా లేకుండానే ముగిసింది. టాప్‌లో సంజు తండ్రీకొడుకులుగా ‘102 నాటౌట్’లో అమితాబ్, రిషీ కపూర్ చేసిన హంగామా ఆకట్టుకుంది. జీవితం పట్ల నిరాశలో ఉన్న కొడుకుకి జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పారు అమితాబ్. ప్రేక్షకులు కూడా థియేటర్స్‌కు పరిగెట్టి మరీ నేర్చుకున్నారు ఈ పాఠాలు. ఈ ఏడాది బెస్ట్ చిత్రాల్లో ఒకటైన ‘రాజీ’ మే 11న రిలీజైంది. మేఘన్ గుల్జార్ తెరకెక్కించిన ఈ పాకిస్థాన్– ఇండియన్ స్పై డ్రామా విపరీతంగా ఆకట్టుకుంది. ఆలియా భట్ నటనకు బాక్సాఫీస్ వంద కోట్లు ఇవిగో అంటూ ఆమె ఒళ్లో పోసింది. ఇందాక మాట్లాడుకున్న విక్కీ కౌశల్ ఈ సినిమాలోనూ మెరిశాడు. జాన్ అబ్రహామ్ పేట్రియాటిక్ డ్రామా ‘పరమాణు’ సూపర్ హిట్‌గా నిలిచింది. న్యూ ఏజ్ సినిమా అంటూ కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్ చేసిన ప్రయత్నం ‘వీరే ది వెడ్డింగ్’ ఎక్కువ నెగటీవ్ ఫీడ్‌బ్యాక్‌నే అందించింది. ఫస్ట్ డే అనుహ్య కలెక్షన్స్ సాధించినప్పటికీ యావరేజ్‌తో సరిపెట్టుకుంది. అక్క సోనమ్‌తో పాటు అదే రోజు తమ్ముడి హర్షవర్థన్ కపూర్ ‘బవేష్ జోషీ’ రిలీజైంది. పాజిటీవ్ రివ్యూస్‌ని పైసలుగా మార్చుకోవడంలో ఇబ్బంది పడింది ఈ సినిమా. హిందీలో రేస్ సిరీస్‌కు మంచి క్రేజ్ ఉంది. అందులోనూ మూడో పార్ట్‌ను సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు అనేసరికి ఫ్యాన్స్ ఆశలు, బాక్సాఫీస్ ఆకలినీ పెంచేసుకుంది. రెంటినీ తీర్చడంలో దారుణంగా విఫలమైంది ‘రేస్ 3’. ఆ తర్వాత మోస్ట్ వెయిటెడ్ బయోపిక్ ‘సంజు’ రిలీజైంది. సంజయ్ దత్లా రణ్‌బీర్ కపూర్ నటించి కాదు జీవించి సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేశారు. రాజ్‌కుమార్ హిరాణీ సినిమా స్టైల్లోనే నవ్వులు పూయిస్తూ చివర్లో ముక్కులూ తుడిపించారు. సంజయ్‌కు క్లీన్ ఇమేజ్ తీసుకొచ్చే భాగమే ఈ బయోపిక్ అని కామెంట్స్ గట్టిగానే వినిపించాయి. ఈ ఏడాది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లిస్ట్‌లో టాప్ స్థానం మాత్రం సంజుదే. తాప్సీకి రెండు విజయాలు స్పోర్ట్స్ డ్రామా ‘సూర్మ’లో తాప్సీ పర్ఫార్మెన్స్ సూపరమ్మా అని కితాబులిచ్చారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ పరిచయమైన చిత్రం ‘ధడక్’. మరాఠీ బ్లాక్‌బస్టర్ హిట్ ‘సైరాట్’ రీమేక్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం నిరాశే మిగిల్చింది. జాన్వీ నటన గురించి మంచి విషయాలే చెప్పారు ప్రేక్షకులు. సంజయ్ దత్ ‘సాహెబ్ బీవీ అవుర్ గ్యాంగ్‌స్టర్’ ఫ్లాప్. అనిల్ కపూర్, ఐశ్వర్యా రాయ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన ‘ఫ్యాన్నీ ఖాన్’ మంచి ఫలితమే ఇచ్చింది. తాప్సీ, రిషీ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించిన చిత్రం ‘ముల్క్’. విమర్శకులు అద్భుతంగా ప్రశంసించారు. బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి హిట్‌నే నమోదు చేసుకుంది. ఓ స్త్రీ మళ్లీ రా మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘కర్వాన్’. ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పార్కర్లతో కలిసి దుల్కర్ చేసిన ఈ రోడ్ మూవీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. బాలీవుడ్‌కు మరో ఇంపార్టెంట్ వీక్ ఇండిపెండెన్స్ వీక్. అక్షయ్ కుమార్ ‘గోల్డ్’, జాన్ అబ్రహామ్ ‘సత్యమేవ జయతే’ బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డాయి. స్వాతంత్య్రం తర్వాత భారతదేశం ఫుట్‌బాల్ టీమ్ సాధించిన తొలి గోల్డ్ మెడల్ కథ ఇది అంటూ తెరకెక్కిన ‘గోల్డ్’ చిత్రం బాగానే ఆడింది. ‘దిల్ బర్’ సాంగ్‌తో స్పెషల్ క్రేజ్ సాధించిన ‘సత్యమేవ జయతే’ కూడా డీసెంట్‌గా రన్ అయింది. సోనాక్షి ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ’, డియోల్స్ (సన్నీ, బాబీ, ధర్మేందర్) చేసిన కామెడీ ‘యమ్లా పగ్లా దీవానా’ ఫ్లాప్స్‌గా నిలిచిచాయి. ‘ఓ స్త్రీ రేపు రా’ అనే చిన్న వాక్యానికి సంబంధించిన హారర్ స్టోరీని మనం చాలా సార్లే విన్నాం. ఇప్పుడు ఇదే లైన్‌తో దర్శక ద్వయం రాజ్–డీకే రచించిన ‘స్త్రీ’ చిత్రం పెద్ద హిట్. సినిమా హాళ్లలో కిందా మీదా పడి మరీ నవ్వుతూ తెచ్చుకున్న పాప్‌కార్న్‌ను వొలికించేశారు ఆడియన్స్. ఈ ఏడాది వసూళ్లలో టాప్‌లో నిలిచిన చిత్రాల్లో ఇది ఒకటి. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ప్లాన్స్‌లో ఉన్నారు దర్శక–నిర్మాతలు. రీమేక్ కుదరలేదు ఇంతియాజ్ అలీ సమర్పణలో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘లైలా మజ్ను’ ఫర్వాలేదనిపించుకుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాల చుట్టూ డార్క్ సినిమాలు తెరకెక్కించే అనురాగ్ కశ్యప్ తొలిసారి రూపొందించిన లవ్‌స్టోరీ ‘మన్మర్జియా’. విక్కీ కౌశల్, తాప్సీ, అభిషేక్ పోటీపడి మరీ నటించారు. సూపర్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. ‘లవ్ సోనియ’, మిత్రోన్, బట్టీ గుల్ మీటర్ చాలు’ వచ్చినవి వచ్చినట్టుగా వెళ్లిపోయాయి. ‘పెళ్లి చూపులు’ రీమేక్‌గా రూపొందిన ‘మిత్రోన్’ రీమేక్‌ను చెడగొట్టారనే కామెంట్‌ను కూడా మూటగట్టుకుంది. రచయిత మంటో లైఫ్ ఆధారంగా నందితా దాస్ తెరకెక్కించిన చిత్రం ‘మంటో’. మంటోగా నవాజుద్ధిన్ సిద్ధిఖీ నటనకు డిస్టింక్షన్ మార్కులు పడ్డాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ అనే కాన్సెప్ట్‌తో వరుణ్, అనుష్కా శర్మ చేసిన చిత్రం ‘సూయి ధాగా’. శరత్ కాత్రియా తెరకెక్కించిన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. పాకిస్థాన్, ఇండియా లాంటి అక్కాచెల్లెళ్లు అంటూ ఒకరంటే ఒకరికి పడని సిస్టర్స్ కథతో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ‘పటాకా’ యావరేజ్‌గా నిలిచింది. గుడ్డిగా డబ్బులిచ్చేశారు సల్మాన్ ఖాన్ తన బావమరిది ఆయుష్ శర్మను పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘లవ్యాత్రి’. నవరాత్రులు అయ్యేలోపు సినిమాను కూడా తీసేశారు. అదే రోజు రిలీజైన ఆయుష్మాన్ ఖురాన్ ‘అంధాధూన్’ వందకు వంద మార్కులు వేయించుకుంది. ప్రేక్షకులు ఈ సినిమాకి గుడ్డిగా డబ్బులిచ్చేశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి థ్రిల్లర్‌ని చూడలేదన్నారు. హాలీవుడ్ లాంటి అసంబద్ధ థ్రిల్లర్లు, అర్థమయ్యేట్టు స్పూన్ ఫీడింగ్ కూడా చేయక్కర్లేదు అని హీరోను గుడ్డివాణ్ణి చేసి మరీ ఇంకా ఫార్ములా ఛట్రంలోనే కొట్టుమిట్టాడుతున్న కొందరి కళ్లైనా తెరిపించారు చిత్రదర్శకుడు శ్రీరామ్ రాఘవన్. ‘కాజోల్ హెలీకాఫ్టర్ ఈల’ సరిగ్గా ఆడలేదు. హారర్ థ్రిల్లర్ ‘తుంబాడ్’ మంచి రివ్యూస్‌ని అందుకున్నా క్యాష్ చేసుకోలేకపోయింది. అర్జున్ కపూర్ ‘నమస్తే ఇంగ్లాండ్’ దారుణంగా విఫలమైంది. ఆల్రెడీ ‘అంధాధూన్’ వంటి సూపర్ హిట్‌తో ఫామ్‌లో ఉన్న ఆయుష్మాన్ ఖురానా ‘బదాయి హో (శుభాకాంక్షలు)’కు మరోసారి బదాయి హో అన్నారు ఆడియన్స్. నీనా గుప్తా, గజ్రాజ్ పాత్రలు పోషించిన తీరుకు మంచి రెస్పాన్స్ లభించింది. మళ్లీ ఆమిర్ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ వరకూ చెప్పుకునే సినిమాలే రాలేదని చెప్పాలి. దొంగలు కొల్లగొట్టలేకపోయారు అమితాబచ్చన్, ఆమిర్‌ఖాన్ తొలిసారి కలసి రావడం, అదీ.. దొంగల్లా అనేసరికి ప్రేక్షకులంతా ఆమితానంద పడిపోయి నిలువు దోపిడీ ఇచ్చుకుందాం అనుకున్నారు. కానీ ఎందుకో ఈ థగ్స్ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టుకోవడంలో తడబడ్డారు. సినిమా విపరీతంగా నిరాశపరిచింది. సన్నీ డియోల్ ‘మొహల్లా అస్సీ’ కూడా సరిగ్గా ఆడలేదు. రిషీ కపూర్ ‘రాజ్మా చావ్లా’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. చావ్లా రుచి బాగుంది అన్నారు ఆడియన్స్. మళ్లీ నిరాశ సైఫ్ అలీఖాన్ తనయ సారాని పరిచయం చేస్తూ అభిషేక్ కపూర్ తీసిన ‘కేధార్నాథ్’ నిరాశపరిచింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ ‘జీరో’ విడుదలైంది. ఎప్పుడో ‘అపూర్వ సహోదరులు’లో కమల్‌హాసన్ మరుగుజ్జు పాత్ర చేశారు. వీఎఫ్ఎక్స్ ద్వారా షారుక్ ఖాన్‌ను మరుగుజ్జును చేశారు దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్. ఈ మధ్య సరైన హిట్స్ ఇవ్వలేదు షారుక్. ఈసారి కచ్చితంగా హిట్ సాధిస్తాడని ఆశలు పెంచుకున్న అభిమానులకు చుక్కెదురైంది. ఈ ఏడాదికి ‘సింబా’తో గుడ్‌బై చెప్పారు రణ్వీర్ సింగ్. ‘టెంపర్’ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి టాక్‌తో థియేటర్స్‌లో నడుస్తోంది. సినిమా ఫలితాల్ని ముందే పసిగట్టలేం. కానీ మంచి ఫలితాలు అందుకోవాలనే అందరూ శ్రమిస్తారు. ఆ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలని కోరుకుందాం. 2017కన్నా 2018 బాగుంది. 2019 మరింత పసందుగా ఉండాలని ఆకాంక్షిద్దాం. యంగ్ స్టార్స్‌దే హవా ఈ ఏడాది బాలీవుడ్ యంగస్టర్స్దే. విక్కీ కౌశల్ (లవ్ ఫర్ స్క్వేర్ ఫూట్, రాజీ, సంజు), ఆయుష్మాన్ ఖురానా (అంధాధూన్, బదాయి హో), రాజ్‌కుమార్ రావ్ (స్త్రీ)లదే హవా. వీళ్ల సినిమాలు విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టాయి. ఖాన్‌లను కాదని మరీ ఈ యంగ్ హీరో సినిమాల టికెట్స్‌ను తెంపారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ల సినిమాలు ఎలా ఉన్నాయో. ఆయుష్మాన్ ఖురానా,రాజ్‌కుమార్ రావ్, విక్కీ కౌశల్ బిజినెస్ బావుంది! గతేడాదితో పొలిస్తే ఈ ఏడాది బాలీవుడ్ బిజినెస్ 15 నుంచి 20 శాతం వరకూ పెరిగిందన్నారు ట్రేడ్ విశ్లేషకులు. 2017లో బాలీవుడ్ సినిమాల బిజినెస్ సుమారు 4,096 కోట్లు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య సుమారు 4,800 కోట్లకు చేరుకుంది. ముగ్గురి ఖాన్ల సినిమాలు రిలీజ్ అయినా కూడా కంటెంట్‌తో ఉన్న చిన్న సినిమాలే ఈ ఏడాది జాక్‌పాట్ అన్నారు. ‘సోనూకే టీటుకే స్వీటీ, స్త్రీ, అంధాధూన్, బదాయి హో’ వంటి చిన్న చిత్రాలు సర్ప్రైజ్ హిట్స్‌గా నిలిచాయి. కలెక్షన్స్‌లో ‘సంజు’ టాప్‌లో ఉన్నాడు. రణ్‌బీర్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమవకుండా ఈ ఏడాది స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కనిపించాయి. దీపికా పదుకోన్ (పద్మావత్), ఆలియా భట్ (రాజీ), రాణీ ముఖర్జీ (హిచ్కీ), తాప్సీ (ముల్క్, మన్మర్జియా), అనుష్కా శర్మ (సూయి ధాగా). అలాగే.. టబు (అంధాధూన్), నీనా గుప్తా (బదాయి హో) లాంటి పాత్రలన్నీ గుర్తుండటానికి కారణం గ్లామర్ మోతాదే కాకపోవడం విశేషం! ఆలియా భట్ ట్రెండేంటి? బయోపిక్స్‌తో పాటు ఈ ఏడాది కనిపించిన మరో ట్రెండ్ రీమిక్స్. పాత సూపర్ హిట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేసి సినిమాలకు క్రేజ్ తెచ్చుకోవాలనుకున్నారు. పాత పాట మ్యాజిక్ ఏ పాటా రిపీట్ చేయలేదన్నది మాత్రం వాస్తవం. అలాగే దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా పెళ్లిలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. – గౌతమ్ మల్లాది -
ఇప్పుడు వంటూర్ వంతు
సల్మాన్ ఖాన్ మనసుకు నచ్చాలే కానీ అవకాశాలకు కొదవ ఉండదు అంటుంటారు ముంబై మీడియా. అంతలా ప్రోత్సహిస్తుంటారు తన మనసుకి దగ్గరైనవారిని. కత్రినా కైఫ్, జాక్వెలిన్, జరీన్ ఖాన్.. ఇలా సల్మాన్ ఎంకరేజ్ చేసిన తారల లిస్ట్ పెద్దగానే ఉంది. రీసెంట్గా సూరజ్ పాంచోలీ, తన బామ్మరిది ఆయుష్ శర్మను కూడా తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా హీరోలుగా పరిచయం చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి భాయ్ మనసుని దోచేసుకున్న లూలియా వంటూర్ కూడా జాయిన్ అయ్యారని సమాచారం. ఈ రొమేనియన్ యాక్టర్ సల్మాన్ మనసు దోచేసుకున్నారనే టాక్ ఎప్పటినుంచో ఉంది. ఆల్రెడీ సల్మాన్ ‘రేస్ 3’ సినిమాలో సల్మాన్ రాసిన ‘సెల్ఫిష్’ సాంగ్‌ను పాడారు లూలియా. దర్శకుడు ప్రేమ్ సోనీ రూపొందించబోయే లేటెస్ట్ సినిమాలో లూలియా వంటూర్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారట సల్మాన్. రణ్‌దీప్ హుడా హీరోగా నటించనున్న ఈ సినిమాను సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్‌పై నిర్మించాలనుకుంటున్నారని సమాచారం. సో.. సల్మాన్ పరిచయం చేసిన నాయికలలాగే లూలియా వంటూర్ కూడా పెద్ద సక్సెస్‌ను అందుకుంటారో లేదో వేచి చూడాలి. -
పాక్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రేస్ 3. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారతీయ సినీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. తొలి షో నుంచే డివైడ్ టాక్ రావటంలో కలెక్షన్ల పరంగా కూడా రేస్ 3 వెనకపడింది. సల్మాన్ స్టామినా కారణంగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా.. భారీ రికార్డ్‌లు నమోదయ్యే అవకాశం మాత్రం కనిపించటంలేదు. ఇండియన్ ఆడియన్స్ రిజెక్ట్ చేసిన ఈ సినిమాను పాకిస్తాన్ ప్రేక్షకులు మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇండియాలో రిలీజ్ అయిన 8 రోజుల తరువాత పాకిస్తాన్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అక్కడ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అక్కడి లోకల్ సినిమాల కంటే ఎక్కువగా రేస్ 3కే కలెక్షన్లు వస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాక్ కూడా బాగుండటంతో ముందు ముందు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షాలు కీలక పాత్రల్లో నటించారు. -
సల్మాన్ రికార్డ్.. వరుసగా 13వ సారి!
భారతీయ సినిమా వందకోట్ల మార్కెట్ రేంజ్‌ను దాటి చాలా కాలం అవుతోంది. కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదు రీజినల్ సినిమాలు కూడా వందకోట్ల మార్క్‌ను ఈజీగా అందుకుంటున్నాయి. అయితే ఈ రికార్డ్ ను వరుసగా సాధించిన స్టార్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ లిస్ట్ అందరికంటే టాప్ ప్లేస్ లో ఉన్న కండలవీరుడు సల్మాన్ ఖాన్. వరుసగా 13 సినిమాలను వందకోట్ల మార్క్ దాటించిన సల్మాన్, ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేయలేని అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాయాడు. దంబాగ్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సల్లూభాయ్ ఆ సినిమాతోనే వందకోట్ల మార్క్‌కు గేట్లు ఎత్తేశాడు. అప్పటి నుంచి వరుసగా తాను హీరోగా నటించిన ప్రతీ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటాడం విశేషం. అంతేకాదు ప్రేమ్ రతన్ ధన్ పాయో, జైహో, ట్యూబ్‌లైట్ లాంటి ఫ్లాప్ సినిమాలలో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించిన సల్మాన్ మాస్ ఆడియన్స్‌లో తనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన రేస్ 3 విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా దారుణమైన రివ్యూస్ వచ్చిన కలెక్షన్ల విషయంలో మాత్రం సినిమా జెట్ స్పీడుతో దూసుకెళుతుండటం విశేషం. -
సల్మాన్ ఖాన్ చెత్త నటుడు..!
ప్రముఖ సర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌పై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వరస్ట్ బాలీవుడ్ యాక్టర్, వరస్ట్ ఇండియన్ యాక్టర్ అని గూగుల్‌లో వెతకగా సల్మాన్ ఖాన్ ఫొటోతో పాటు అతడి వివరాలు రావడంతో ఫ్యాన్స్ కంగుతిన్నారు. తమ అభిమాన నటుడ్ని వరస్ట్ యాక్టర్‌గా చూపించటం జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు యాంటీ ఫ్యాన్స్ కొందరు రేస్-3 లో సల్మాన్ నటన చూశాక గూగుల్ ఇలా చేసి ఉంటుందంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే భారతీయ ప్రముఖుల గురించి గూగుల్ నెటిజన్లకు షాక్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం భారత దేశ తొలి ప్రధాని ఎవరు అన్న సమాధానానికి నెహ్రూకి సంబంధించిన సమాచారం రాగా.. ఫొటో మాత్రం నరేంద్ర మోదీది ప్రత్యక్షం కావటంతో చాలా మంది కంగుతున్నారు. ఈ విషయం కాస్తా వైరల్ కావటం.. అదే సమయంలో విమర్శలకు దారితీయటం జరిగింది. దీంతో పొరపాటును గమనించిన గూగుల్.. ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది. -
వంద కోట్ల క్లబ్లో రేస్ 3
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రేస్ 3 విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన పొందినా కలెక్షన్లపరంగా దూసుకుపోతోంది. రేస్ 3 రూ వంద కోట్ల క్లబ్లో అవలీలగా చోటు దక్కించుకుంది. ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరిన సల్మాన్ నాలుగో సినిమాగా నమోదైందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకూ సల్మాన్ నటించిన భజరంగిభాయ్‌జాన్, సుల్తాన్, టైగర్ జిందాహై మూడు రోజుల్లో వంద కోట్ల వసూళ్ల మార్క్‌ను అధిగమించాయి. ఇక రేస్ 3 శుక్రవారం రూ 29.17 కోట్లు, శనివారం 38.14 కోట్లు, ఆదివారం రూ 39.14 కోట్లు కలెక్ట్ చేసిందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. రేస్ 3లో సల్మాన్‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా, బాబీ డియోల్, సాఖిబ్ సలీం, అనిల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రేస్ ఫ్రాంచైజ్‌లో గతంలో సైఫ్ అలీఖాన్ నటించగా, రేస్ 3లో బాలీవుడ్ కండలవీరుడు ఎంటరయ్యాడు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - రేస్ 3
-
ఆ సినిమాకు కలెక్షన్ల సునామీ
సాక్షి, ముంబై : ‘ఇస్ రేస్ కా సికిందర్ మై హూ’ (ఈ రేసులో విజేతను నేనే)’ అంటూ రేస్ 3 సినిమాలో సల్మాన్ ఖాన్ చెప్పినట్లుగానే బాక్సాఫీస్ వద్ద తానే విజేతనని మరోసారి రుజువు చేసుకుంటున్నారు. సల్మాన్ ‘ఈద్’ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ... శుక్రవారం విడుదలైన రేస్ 3 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే 29.17 కోట్ల రూపాయలు వసూలు చేసి 2018 బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. అంతేకాకుండా సల్మాన్ కెరీర్లో.. మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా(సుల్తాన్ 36.54 కోట్లు, ఏక్ థా టైగర్ 32.93 కోట్లు) గుర్తింపు దక్కించుకుంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన ఎదుర్కొన్నప్పటికీ ఆదివారం నాటికి 67.31 కోట్ల రూపాయలు వసూలు చేసిన రేస్ 3 సల్మాన్ సత్తా ఏమిటో నిరూపించింది. విడుదలైన రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. మరో వారం రోజుల పాటు పెద్ద సినిమాలేవీ రిలీజ్ అయ్యే అవకాశం లేకపోవడంతో రేస్ 3 భారీ వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. రేస్ సిరీస్‌లో మూడో భాగంగా రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, రమేష్ తౌరాని సంయుక్తంగా నిర్మించారు. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, బాబీడియోల్, సాకిబ్ సలీమ్, డైసీషా ప్రధాన పాత్రల్లో నటించారు. -
సల్మాన్ ఖాన్ ‘రేస్-3’ రివ్యూ
టైటిల్ : రేస్-3 జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైసీ షా, ఫ్రెడ్ఢీ దారువాలా, షకీబ్ సలీం సంగీతం : సలీం సులేమాన్ దర్శకత్వం : రెమో డిసౌజా నిర్మాత : రమేష్ ఎస్ తౌరాని, సల్మా ఖాన్ 2008లో వచ్చిన ‘రేస్’, 2013లో రిలీజైన ‘రేస్ 2’, ఇప్పుడు 2018 జూన్ 15న (శుక్రవారం) ‘రేస్ 3’... ఈ మూడూ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలే. వీటన్నింటి కథామూలం ఒక్కటే. ‘‘తలతన్నేవాడుంటే వాడి తాడి తన్నేవాడొకడుంటాడు’’ అనే సామెత మన తెలుగులో చాలా ఫేమస్. అదే కాన్సెప్ట్‌తో ఎన్ని సినిమాలొచ్చినా సినీ ప్రియులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఈ సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే ప్రతి ఒక్క సినిమాని పోల్చి చూడటం సహజం అని ఒప్పుకోక తప్పదు. అందుకే సిరీస్‌గా వచ్చిన సినిమాలన్నింటిలోకి ఏది బావుందో తప్పనిసరిగా పోలిక వస్తుంది. అలా పోలిస్తే మిగతా రెండు రేసుల కంటే ఈ రేస్ కొంచెం ఎక్కువ అంచనాలతోనే విడుదలైందని చెప్పాలి. రేస్ సిరీస్ హీరోతో సహా అన్ని పాత్రలూ డాన్లు, మాఫియా, ఇంటర్నేషనల్ క్రిమినల్స్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌తో నిండి ఉంటాయి. సినిమా అంతా పూర్తిగా ట్విస్టులతో నిండి ఉంటుంది. ఈ సిరీస్‌లో ముఖ్యంగా మూడు ‘రేస్’లతోను అనుబంధం ఉన్న నటుడు అనిల్‌కపూర్. ఈయన ఒక్కరే ‘రేస్’, ‘రేస్–2’, ‘రేస్–3’ అన్నింటిలో నటించారు. మొదటి రెండు సినిమాలకు దర్శకులుగా పనిచేసిన బాలీవుడ్ ద్వయం ‘అబ్బాస్–మస్తాన్’లను కాదని మూడో భాగం దర్శకత్వ బాధ్యతలు మరో బాలీవుడ్ దర్శకుడు రెమో డిసౌజాకు అప్పగించారు చిత్ర హీరో మరియు నిర్మాతల్లో ఒకరైన ‘సల్మాన్ ఖాన్ ’. నిర్మాతల్లో ఒకరైన రమేశ్ తౌరాని ‘రేస్ 3’ కథను తీసుకుని సల్మాన్‌ఖాన్ దగ్గరికి వెళితే ‘సినిమా చేస్తాను కాని కథలో కొన్ని మార్పులతో పాటు దర్శకుడిగా ‘రెమో డిసౌజా’ను తీసుకోవా’లని సూచించారట. ఆ విషయాన్ని సల్మానే స్వయంగా రేస్ ప్రమోషన్ టైమ్‌లో మీడియాకు చెప్పారు. అలా ఈ ప్రొడక్షన్లోకి వచ్చిన దర్శకుడు ‘రెమో’ సినిమాను ఎలా తెరకెక్కించారో తెలుసుకుందాం... ముఖ్య తారాగణం షంషేర్ సింగ్‌గా ‘అనిల్‌కపూర్’ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. ఇతను చుట్టూ అల్లిన కథే ‘రేస్–3’ అని చెప్పొచ్చు. షంషేర్ సింగ్ అన్న కొడుకు సిఖిందర్ సింగ్ పాత్రలో నటించారు ‘సల్మాన్‌ఖాన్’. అనిల్ కపూర్ కవలపిల్లలుగా నటి డైసీ షా (సంజన సింగ్) మరియు సాఖిబ్ సలీమ్ (సూర జ్ సింగ్) నటించారు. య‹శ్ అనే ఓ ముఖ్య పాత్రలో హీరో బాబీ డియోల్ నటించారు. ఈ సింగ్ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా వీళ్లందరికీ ట్రబుల్ షూటర్ లాగా పనిచేసే పాత్రలో నటించారు ‘బాబీ డియోల్’. సినిమా మొత్తం ఏ ఫ్రేమ్‌లో చూసినా వీరే ఉంటారు. సినిమా కథా కమామీషు... అనిల్ కపూర్ మారణాయుధాలను అమ్మే వ్యాపారి. అతని అన్న కూడా ఇదే వ్యాపారంలో ఉంటాడు. ఓ లోకల్ లీడర్‌తో ఏర్పడిన వైరం అన్న ప్రాణాలు తీసేస్తుంది. అన్న భార్యను, కొడుకును తీసుకుని అనిల్ కపూర్ విదేశాలు పారిపోతాడు. వదినను తన భార్యగా చేసుకుంటాడు. ఈ ఇద్దరికీ కవలపిల్లలు (కొడుకు, కూతురు సాఖిబ్ సలీమ్, డైసీషా) పుడతారు. బిడ్డలిద్దరూ తండ్రితో పాటు ఉంటూ వ్యాపార శత్రువులకు పోటీగా నిలుస్తారు. ఓ రోజు అనిల్ కపూర్‌ని ఎటాక్ చేస్తారు యాంటీ గ్యాంగ్. ఆ గ్యాంగ్ అధినేత డ్రగ్ మాఫియాలో ఆరితేరిన ఫ్రీడీ దారువాలా (రానా). తండ్రిపై జరిగిన ఎటాక్‌కు కారణం ఎవరో తెలుసుకుని ఇమ్మీడియట్‌గా ఫ్రీడి మీదకి వెళతారు డైసీ, సాఖిబ్. అలా వెళ్లిన తన తమ్ముడు, చెల్లెలు ప్రమాదంలో ఉన్నారని తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వారిద్దరినీ విడిపించటానికి అక్కడికి వెళతాడు. అది సల్మాన్ ఇంట్రడక్షన్. అలా వీరు ముగ్గురు విలన్ గ్యాంగ్‌తో ఫైట్ చేస్తుంటే వీరికి తోడుగా ట్రబుల్ షూటర్ బాబీ డియోల్ జాయిన్ అవుతాడు. అందరూ అక్కడి నుండి సేఫ్‌గా బయటపడతారు. అనిల్ కపూర్ పిల్లలందర్నీ రమ్మని చెప్పి తన ఫ్యామిలీ లాయర్ ద్వారా ఆస్తి పంపకాలు చేస్తాడు. ఆస్తిలో 50 శాతం వాటాను తన పిల్లలైన డైసీషా, సాఖిబ్‌లకు మిగతా 50 శాతం వాటాను సల్మాన్ ఖాన్‌కు రాస్తున్నట్టు ప్రకటిస్తాడు అనిల్‌కపూర్. అది విని స్వతహాగా కోపంగా ఉండే తన పిల్లలు ఆవేశపడిపోతారు. అక్కడి నుండి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ప్రారంభమవుతాయి. కానీ అవేమి పెద్ద ప్రాబ్లమ్స్ కావు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ అందరూ ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తుంటారు. ఈ టైమ్‌లో అందరూ పార్టీ చేసుకుంటుంటే పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ తమ లవర్స్‌తో వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు, కానీ ఆ నలుగురు మాత్రం ఒంటరిగా ఉంటారు. వచ్చినవారందరూ ఎంజాయ్ చేస్తున్నారు మనం మాత్రం ఇలా ఉన్నాం అని డైసీషా అంటే మీకెవ్వరికీ ఏమీ లేదేమో కానీ నాకు మాత్రం లవర్ ఉంది అని బాబీ డియోల్ తన లవర్ ‘జాక్వెలిన్ ఫెర్నాండజ్’ గురించి చెప్తాడు. అందరూ వారి వారి కబుర్లు చెప్పుకుంటారు. ఇదిలా వుంటే అనిల్ కపూర్ చిన్ననాటి స్నేహితుడు భారత్ దేశం నుండి ఫోన్ చేసి, అర్జంట్‌గా కలవాలని ఓ మంచి డీల్‌తో వచ్చానని చెప్తాడు. సరే అని అతన్ని కలిసి విషయం తెలుసుకున్న అనిల్ కపూర్ ఫ్యామిలీ అందర్నీ పిలిచి తను ఒప్పుకున్న డీల్ గురించి చెప్తాడు అనిల్ కపూర్. ఆ డీల్ సారాంశం ఏంటంటే.. భారత్‌లో ఓ 7 స్టార్ హోటల్ ఉంది. ఆ హోటల్లో 8 మంది మంత్రులు అమ్మాయిలతో ఉండటాన్ని రహస్య కెమెరాల ద్వారా చిత్రించి, వాటిని ఆ మంత్రులకే పంపి బిజినెస్ ప్రపోజల్ పెడతారు. ఆ వీడియోలన్నీ ఉన్న హార్డ్‌డిస్క్ వేరే కంట్రీలో ఓ లాకర్లో ఉన్న సమాచారం నా దగ్గర ఉంది. ఆ హార్డ్ డిస్క్ నా కిస్తే మీకు బిలియన్ డాలర్ల మనీ ఇస్తాను, అది డీల్ అని చెప్తాడు అనిల్ కపూర్ ఫ్రెండ్. అక్కడి నుండి హార్డ్ డిస్క్‌ను ఎలా తీసుకొచ్చారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కథ ప్రీ–క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఇక్కడనుండి కథలో ఉన్న చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా రివీల్ అవుతుంటాయి. బాబీ డియోల్ తన గర్ల్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెస్ అసలు అతని ప్రేయసియేనా? సల్మాన్ లవరా? అనే డౌట్ ప్రేక్షకులకు ఉంటుంది. ఎప్పుడూ తన తమ్ముడు, చెల్లెలిని కంటికి రెప్పలా కాపాడుకుంటాననే సల్మాన్ ఆస్తి వివాదాల వల్ల చివరి దాకా అలానే ఉన్నాడా? వీరి జీవితాల్లోకి జాక్వెలిన్ సడన్ ఎంట్రీకి కారణం ఏంటి? బాబీ డియోల్ క్యారెక్టర్ వెనక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటి? ఎనిమిది మంత్రుల వీడియోలు ఏమయ్యాయి? అన్నది క్లైమాక్స్‌లో చూడాల్సిందే. హైలైట్స్ – తారాగణం, గత చిత్రాలతో పోల్చితే సల్మాన్ సూపర్ స్టార్ కింద లెక్క. – వండర్ఫుల్ విజువల్స్. – బ్యాగ్రౌండ్ స్కోర్. – పంచ్ డైలాగ్స్. – అద్భుతమైన లొకేషన్స్. – ఆసక్తికరమైన మలుపులు. మైనస్ – కథ, కథనాల్లో ఎక్కడా స్పీడ్ లేదు. – స్లో నారేషన్. – స్టోరీలో డ్రామా లోపించడం. – పాత్రధారులంతా పాత్రల్లో లీనమైనట్లుగా కనిపించదు. – సాంగ్స్ చెప్పుకోదగ్గ విధంగా లేవు. - శివ మల్లాల -
సల్మాన్ వేట మొదలైంది..!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రేస్ 3. ఘనవిజయం సాధించిన రేస్ సిరీస్‌లో మూడో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రెమో డిసౌజా దర్శకుడు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రేస్ 3 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దంగల్ పేరిట ఉన్న శాటిలైట్ రైట్స్ రికార్డ్‌ను రేస్ 3 బద్ధలు కొట్టింది. దీంతో రిలీజ్ కు ముందే సల్మాన్ రికార్డ్ ల వేట మొదలైందంటున్నారు ఫ్యాన్స్. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దంగల్ చిత్ర శాటిలైట్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు సల్మాన్ హీరోగా నటించిన రేస్ 3 శాటిలైట్ రైట్స్ ఏకంగా 130 కోట్లు పలికినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో మీడియాలో వస్తున్న వార్తలను ఖండించలేదు. దీంతో ఆమిర్ రికార్డ్‌ను సల్మాన్ బద్ధలు కొట్టాడంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సల్మాన్ కు ఈద్ బరిలో సూపర్ హిట్ రికార్డ్ ఉంది. అందుకే రేస్ 3 చిత్రాన్ని కూడా రంజాన్ కానుకగా జూన్ 15న రిలీజ్ చేస్తున్నారు. జాక్వలిన్ ఫెర్నాండెజ్, అనిల్ కపూర్, బాబీడియోల్, సాకిబ్ సలీమ్, డైసీషా ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సల్మాన్ ఖాన్, రమేష్ తౌరాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
పాంచ్ పటాకా
స్క్రిప్ట్ నచ్చితే ఎన్ని సినిమాలనైనా పట్టాలెక్కించేస్తుంటా అంటున్నారు బాలీవుడ్ భాయ్ సల్మాన్. లేటెస్ట్ మూవీ ‘రేస్ 3’ రిలీజ్‌కి రెడీగా ఉండగానే ‘భరత్’ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలు కాకుండా ‘కిక్’ సీక్వెల్ ‘కిక్ 2’, ‘దబాంగ్ 3’ కొరియోగ్రాఫర్,డైరెక్టర్ రెమో డిసౌజాతో ఓ డ్యాన్స్ ఫిల్మ్ కూడా ఓకే చేశారు. వరుసగా సినిమాలు ఒప్పుకోవడం గురించి సల్మాన్ మాట్లాడుతూ – ‘‘ఏదైనా స్క్రిప్ట్ వినగానే నచ్చిందంటే చేసేస్తాను. ఫస్ట్ నరేషన్లో ఎగై్జట్ చే స్తే ఓకే అనేస్తాను. కథ విన్న తర్వాత రేపు చెబుతాను, ఆ తర్వాత చెబుతాను అన్నానంటే ఆ సినిమా ఎప్పటికీ పట్టాలెక్కదు. ఈ ఫేజ్‌లో నాకు నచ్చినన్ని, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఇవే కాకుండా సంజయ్ లీలా భన్సాలీతో కూడా ఓ సినిమా చేయడానికి అంగీకరించారట భాయ్. సో.. బాక్సాఫీస్ మీద భాయ్ పాంచ్ పటాకా పేల్చే పనిలో ఉన్నారని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. -
నా మీద నాకే జాలేసింది : హీరో
లాంగ్ గ్యాప్ తరువాత పోస్టర్ బాయ్స్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ యాక్షన్ హీరో బాబీ డియోల్ త్వరలో రేస్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సల్మాన్ కారణంగానే తనకు ఈ అవకాశం వచ్చిందని చెపుతున్న బాబీ డియోల్, తనకు అవకావాలు లేని సమయంలో అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘నా గురించి నేను పట్టించుకోవటం మానేశాను. నటుడిగా మేం బాడీని మెయిన్టైన్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను నెమ్మదిగా అన్ని కోల్పోతూ వచ్చాను. నా మీద నాకే జాలేసి, రోజూ తాగేవాడిని’ అన్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో సల్మాన్ తనకు ధైర్యం చెప్పాడని.. తరువాత కాల్ చేసి ఈ అవకాశం ఇచ్చారని తెలిపాడు. ‘ఇప్పుడు నా మీద నాకు నమ్మకం కలిగింది. ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నా. ఇప్పుడు ఒక రోజు కూడా ఖాలీగా ఇంట్లో కూర్చోవాలని లేదన్నా’రు బాబీ డియోల్. రేస్ 3 తరువాత హౌస్ ఫుల్ 4తో పాటు అన్న సన్నిడియోల్, తండ్రి ధర్మేంద్రలతో కలిసి యమ్లా పగ్లా దీవానా ఫిసే సినిమాలలో నటించేందుకు రెడీ అవుతున్నారు. -
సల్మాన్‌తో పోటీనా..? : కరణ్ జోహర్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రేస్ 3 ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉంది. సల్మాన్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. రేస్ 3 జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే అదే రోజున లస్ట్ స్టోరిస్ అంటూ ఓ వెబ్ సిరీస్ విడుదలవుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు. అందులో కరణ్ జోహర్ ఒకరు. ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... సల్మానతో పోటీ పడదామనుకుంటున్నారా అంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు... ‘సల్మాన్‌తో పోటీపడేంతా మాకు లేదు. మా వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్‌కు సల్మాన్ రేస్3కు సంబంధమే లేదు. సల్మాన్ రేంజ్ వేరు. నేను కూడా జూన్ 15న సల్మాన్ రేస్3 మూవీనే చూస్తాను’ అంటూ కరణ్ చెప్పుకొచ్చారు. లస్ట్ స్టోరిస్‌లో నలుగురు వ్యక్తులకు సంబంధించిన కథలను చూపించనున్నారు. రాధికా ఆప్టే, కియారా అద్వాణీ, మనీషా కొయిరాలా, భూమీ ఫెడ్నేకర్లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను కరణ్ జోహర్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్‌లు డైరెక్ట్ చేయనున్నారు. -
సల్మాన్ కొత్త సినిమాపై పేలుతున్న జోకులు!
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రేస్3 ట్రైలర్ మంగళవారం విడుదలై మంచి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సైన్స్‌ను ఎగతాళి చేయడానికే ఈ సినిమా తీశారని కొందరు, థమ్సప్ యాడ్ కోసం ఓ సినిమానే చేశారని మరికొందరు సినిమాపై జోకులు పేల్చుతున్నారు. సల్మాన్‌ను బెయిల్‌పై విడుదల చేసిన న్యాయమూర్తి ఈ సినిమా చూస్తే కచ్చితంగా సల్మాన్ ఖాన్‌ను ఆయనతో పాటు బాబీ డియోల్‌ను కూడా ఐదు సంవత్సరాలు జైలులో పెడతారని ఓ నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు. ఇలా నెటిజన్లు తమకు నచ్చిన రీతిలో రేస్3 ట్రైలర్‌పై స్పందిస్తూనే ఉన్నారు. రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సల్మాన్‌తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వలిన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జర్నలిస్టుపై సల్మాన్ ఖాన్ ఫైర్..!
ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రేస్- 3 ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లో భాగంగా సల్మాన్ మీడియాతో మాట్లాడారు. అయితే కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు ఐదు సంవత్సరాల శిక్ష విధిస్తూ కొన్ని రోజుల క్రితం జోధ్‌పూర్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న సల్మాన్‌కు కోపం తెప్పించింది. ‘కృష్ణజింకల కేసులో మీరు దోషిగా తేలిన సమయంలో.. మీ సినిమా నిర్మాతలు, వారి డబ్బు గురించి మీరు బాధపడ్డారా’ అంటూ జర్నలిస్టు ప్రశ్నించాడు. అయితే అతడు ప్రశ్న ముగించేలోగానే సల్మాన్ కౌంటర్ ఇచ్చాడు. ‘నేను జీవితాంతం అక్కడే(జైలు లోపలే) ఉంటాననుకున్నావా’ అంటూ సమాధానమిచ్చాడు. ఊహించని ఈ సమాధానానికి అవాక్కైన జర్నలిస్టు ‘అదేం లేదం’టూ సల్మాన్‌కు బదులిచ్చాడు. ‘థ్యాంక్యూ.. దాని గురించి నేనేం బాధ పడలేదం’టూ సల్మాన్ తిరిగి సమాధానమిచ్చాడు. కాగా కృష్ణ జింకలను వేటాడిన కేసులో ప్రస్తుతం బెయిలుపై విడుదలైన సల్మాన్ సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న రేస్ 3 సినిమాలో సల్మాన్‌తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వలిన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘రేస్-3’ ట్రైలర్ వచ్చేసింది