రైడ్ ఫర్ ఫీస్
ప్రపంచ శాంతిని కోరుతూ బెంగళూరుకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోషన్ కుమార్ సోలో బైక్‌థాన్ యాత్రను చేపట్టాడు. గత బుధవారం బెంగళూర్ నుంచి హైదరాబాద్ వరకు బైక్‌పై ఒంటరిగా వచ్చాడు. తన యాత్ర వెనకున్న ఉద్దేశాన్ని దారి పొడవునా వివరించాడు. డాక్టర్‌గానే కాదు బెంగళూరులోని ‘హ్యాపీ టు హెల్ప్’ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్‌గానూ సామాజిక బాధ్యత భుజానికెత్తుకున్న రోషన్ కుమార్.. యాత్రవెనకున్న ఉద్దేశాన్ని సిటీప్లస్‌కు వివరించాడు.
- వీఎస్
ప్రపంచాన్ని టైజం వణికిస్తోంది. ఇటీవల పెషావర్ ఘటన కలచివేసింది. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నా వంతుగా ప్రపంచ శాంతి కోరుతూ బైక్ రైడ్ చేయాలనుకున్నా. నా ఆలోచనను మా ఫౌండేషన్ సభ్యులతో పంచుకన్నాను. వారి ప్రోత్సాహంతో బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు సోలో బైక్‌థాన్ చేశాను. ఉదయం ఆరు గంటలకు మొదలైన నా రైడ్ వివిధ పట్టణాల మీదుగా.. భాగ్యనగరానికి చేరుకుంది.
ఆత్మీయంగా ఆదరించారు...
బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు రోడ్ చాలా బాగుంది. దారి పొడవునా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. నాకు సహకారంగా ఉండేందుకు పైలట్ కారులో వచ్చిన ఐదుగురు సభ్యులు అన్ని ప్రాంతాల్లో కరపత్రాలు ఇచ్చారు. మా మెసేజ్‌ను పూర్తి స్థాయిలో తీసుకెళ్లగలిగామని భావిస్తున్నా. 46 ఏళ్ల వయసున్నా సామాజిక అవగాహన కల్పించాలన్న సంకల్పమే నన్ను ముందుకు సాగేలా చేసింది. సామాజిక సేవలో యువతను భాగస్వాములను చేసేందుకే బైక్‌ను ఎంచుకున్నాను.
హైదరాబాద్‌లోనూ సేవలు...
ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా happy2help foundation సేవలందిస్తోంది. పేద విద్యార్థుల చదువుతో పాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్న క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యంతో పాటు మందులు అందిస్తున్నాం. ‘ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్’ పేరిట మరణానికి దగ్గరలో ఉన్నవారికి పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నాం. చివరి రోజుల్లో వారు మంచిగా, ఆనందంగా ఉండేలా చూసుకుంటున్నాం. ఈ సేవలను త్వరలో హైదరాబాద్‌లో కూడా విస్తరించాలనుకుంటున్నాం. ఇక్కడి వైద్యులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఆశిస్తున్నాను. నా రైడ్ ద్వారా సమకూరిన నిధులను ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలకు ఉపయోగిస్తాం. సామాజిక సేవలో యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా నా కార్యక్రమాలు ఉంటాయి. ‘2015 జనవరి 26న బెంగళూరు నుంచి పుణేకు కొంతమంది సభ్యులతో కలిసి బైక్ యాత్ర చేపట్టనున్నామని’ వివరించాడు.