సబ్జా... ఎండకు విరుగుడు
దాదాపు ఐదొందల ఏళ్ల నాటి సంగతి. మొఘల్ సేనలు గోల్కొండ కోటకు చేరుకున్నాయి. ఆ చుట్టుపక్కల వారి పటాలాలు వెలిశాయి. బాగా అలసిపోయిన ఆ సేనలకు వేసవి ఎండలు చికాకు పెట్టిస్తున్నాయి. విపరీతమైన ప్రయాణ బడలికతో ఉన్న సైనికులు ఎండ తీవ్రతతో వెంటనే కోలుకోలేరని తేలిపోయింది. వెంటనే వారి కోసం ప్రత్యేక నిపుణుల బృందం వచ్చింది. కాసేపట్లో ఓ ‘ఔషధం’ సిద్ధమైంది. నిత్యం మూడు పూటలా దాన్ని సేవించేసరికి వారిలో ఉత్సాహం తిరిగొచ్చింది. ఆ ఔషధం తయారు చేసింది ఇరాన్ నుంచి వచ్చిన హకీమ్‌లు. దాని పేరు... ఫాలుదా!
ఎండా కాలం మొదలు కాగానే హైదరాబాద్ రోడ్లపై విస్తృతంగా వెలిసే దుకాణాల్లో తయారు చేసి అందించే పానీయమే ఫాలుదా. భగభగలాడే వేసవి ఎండల దుష్ఫలితాల నుంచి రక్షించే గొప్ప ఔషధ గుణాలున్న పానీయమది. సూర్యతాపం నుంచి తాత్కాలి ఉపశమనం కలిగించేది అందులో చల్లదనమైతే... ఎండల వల్ల శరీరంలో వచ్చే మార్పులు చెడు
ప్రభావాన్ని కల్పించకుండా
చేసేది అందులోని సబ్జా.
సబ్జా... ఇప్పటి తరానికి అంతగా పరిచయం లేని పేరు. అంత దూరం నుంచి సువాసన వెదజల్లే సబ్జా చెట్టు గింజలే అవి. ఆవాల్లా కనిపించే ఈ గింజలకు గొప్ప లక్షణముంది. శరీరంలో ఎంతటి వేడి ఉన్నా దాన్ని తీసేసినట్టు మాయం చేసే గుణాలు దీని సొంతం. అందుకే ఈ గింజలను ఫాలుదాలో విస్తృతంగా వినియోగిస్తారు. దీంతోపాటు జొన్న, మెట్ట తామర పొడితో తయారు చేసే వెర్మిసెల్లీ వాడతారు.
మనకు పరిచయమైందిలా...
సబ్జా గింజలతో శరీర ఉష్ణాన్ని తగ్గించే సంప్రదాయం మన దేశంలో అనాదిగా వస్తోంది. కానీ ప్రత్యేక పానీయంగా ఫాలుదాతో రంగరించే సంప్రదాయం మాత్రం మధ్య ఆసియా నుంచి వచ్చి చేరింది. అక్కడ ఎండ తీవ్రత వల్ల ఏర్పడే దుష్పరిణామాల నుంచి కాపాడుకోవటానికి ఫాలుదా తాగే సంప్రదాయం ఉంది. చలికాలంలో కొండలపై పేరుకునే మంచు దిమ్మెలను భూగర్భంలో ప్రత్యేక పద్ధతిలో భద్రపరిచి నడి వేసవిలో ఫాలుదాలో రంగరించి తాగేవారట. మంచు కరగకుండా ప్రత్యేక పద్ధతులను వినియోగించేవారు. ఇందుకోసం నాటి పాలకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. భారత ఉపఖండంలో మొఘల్ చక్రవర్తులు కాలుమోపినప్పుడు ఇది కూడా వచ్చి చేరింది. తొలుత ఉత్తర భారతానికే ఇది పరిమితమైనా కుతుబ్‌షాహీల ఉత్సాహం కొద్దీ దక్కన్ పీఠభూమికి చేరువైంది. వారి హయాంలో సైనిక పాటవానికి ఎంత ప్రాధాన్యం ఉండేదో షాహీ దస్తర్‌ఖానాలకు అంతే విలువ ఉండేది. ఇందులో మధ్యాహ్నం వేళ ఘుమఘుమలాడే ఫాలుదాలు సిద్ధంగా ఉండేవి. సాయంత్రం వేళ గిన్నెలకొద్దీ ఫలూదా ఖర్చయ్యేది. వేసవిలో ఇది లేకుండా దర్బారు నడిచేది కాదంటారు. ఆ ఆనవాయితీ నిజాం హయాంలోనూ కొనసాగింది. దీంతో హైదరాబాద్‌లో ఫాలుదా స్థానం చిరస్థాయిగా మారిపోయింది. భానుడి ప్రతాపం కాస్త పెరిగిందంటే చాలు చారిత్రక హైదరాబాద్‌లోని హోటళ్లు ఫాలుదా గిన్నెలతో నిండిపోతాయి. ఆదిలో ప్రత్యేక సేమియా, సబ్జా గింజలకే పరిమితమైన ఈ పానీయంలో ఆ తర్వాత రోజ్ వాటర్, పాలు, డ్రైఫ్రూట్స్ కలపటం మొదలైంది. ఇప్పుడు హైదరాబాద్ సంస్కృతిలో ఇదీ ఓ భాగమైంది.
గౌరీభట్ల నరసింహమూర్తి