గూడు రిక్షా మరువలేను..
జ్ఞాపకం: స్నేహితులతో ‘అందాల రాముడు’ చూస్తూ ఆస్వాదించిన రోజులు... పిల్లలతో కలసి డబుల్‌డెక్కర్ బస్సు ఎక్కి తానూ పిల్లాడైపోవడం.. రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ సముద్రాల గోవిందరాజులుకు హైదరాబాద్‌తో ముడిపడిన స్మృతులు. హరివిల్లులాంటి నుమాయిష్‌లాగే నగరం భిన్న సంస్కృతుల నిలయం అంటున్న జస్టిస్ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే...
1973 సెప్టెంబర్‌లో తొలిసారి హైదరాబాద్‌లో కాలుపెట్టా. అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌మెంట్ చేసుకున్నాక చిక్కడపల్లిలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి వె ళ్లిన. సరదాగా నగరమంతా చక్కర్లు కొట్టిన. నారాయణగూడ వేంకటేశ్వర థియేటర్‌లో ఏఎన్‌ఆర్ అందాలరాముడు సినిమా ఫ్రెండ్స్‌తో కలసి చూడటం గొప్ప అనుభూతి.
ఆ టేస్టే వేరు...
ఎనిమిది నెలల తర్వాత కుటుంబంతో కలిసి హిమాయత్‌నగర్‌కు మకాం మార్చా. నెలకు రూ.150 రెంట్. ట్యాంక్ బండ్‌లో బండి వద్ద మిర్చి బజ్జీల రుచి అమోఘం. రూపాయికి పది బజ్జీలొచ్చేవి. అన్నీ ఒక్కడినే లాగించేవాడిని. ఇప్పుడైతే రూ.40 పెట్టినా రావడంలేదు. ఆ టేస్టూ లేదు.
ఇప్పటికీ కాయిన్ చప్పుడు...
మా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు రామకృష్ణ థియేటర్‌లో ‘షోలే’కు వెళ్లాం. కొత్తగా స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్‌తో ఎంతో ఎంజాయ్ చేశాం. ఆఖరి సీన్‌లో ధర్మేంద్ర కాయిన్ విసిరినప్పుడు థియేటర్‌లో కుడివైపు సౌండ్ స్పీకర్ నుంచి వచ్చిన సౌండ్‌కు ఉలిక్కిపడ్డాం. ఆ సౌండ్ ఇప్పటికీ చెవుల్లో రింగుమంటుంది.
సైకిల్‌తో చక్కర్లు...
మొదటి ఆరేళ్లు నగరంలో ఎక్కడికి వెళ్లినా సైకిల్ మీదే. ఇక్కడి గల్లీ గల్లీ తెలుసు. ఇప్పుడు సైకిళ్ల స్థానాన్ని మోటారు సైకిళ్లు ఆక్రమించాయి. ఫలితంగా కాలుష్యకోరల్లో నగరం.
వాటిల్లో ప్రయాణం మస్త్...
గూడు రిక్షాలో ప్రయాణమంటే మస్తు అనిపించేది. రిక్షావాలాలు మర్యాదపూర్వకంగా వ్యవహరించేవారు. ఎక్కడికి వెళ్లాలన్నా 75 పైసలు ఇవ్వమనేవారు. ఒకరోజు నేను హిమాయత్‌నగర్ నుంచి హైకోర్టుకి వెళ్లడానికి రిక్షావాలా బారానా ఇవ్వమన్నాడు. ‘హైకోర్టు ఎక్కడుంటుందో తెలుసా’ అంటే. ‘మీరే చెబుతారు కదా సాబ్’ అని తీసుకెళ్లాడు. అంత దూరానికి బారానే ఇవ్వడం కరెక్టు కాదనిపించింది. రూపాయిన్నర ఇచ్చిన. అందుకాయన నాకు దండం పెడుతూ వెళ్లిపోయాడు. 1980లో రాజమండ్రికి వెళ్లా. పదేళ్ల తర్వాత మళ్లీ సిటీకి వచ్చా. అప్పుడు మా పిల్లలు డబుల్ డెక్కర్ ఎక్కాలని ఉబలాటపడ్డారు. అబిడ్స్‌లో బస్సు ఎక్కి ఎక్కడికి వెళుతుందో అక్కడికి టికెట్ ఇవ్వమంటే కండక్టర్ ఆశ్చర్యపోయాడు. తిరుగుప్రయాణం అదే బస్సులో.
నుమాయిష్
1974లో అనుకుంటా. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మొట్టమొదటిసారి నుమాయిష్‌కు వెళ్లా. భారీ సంఖ్యలో స్టాళ్లు, టాయ్ ట్రెయిన్, రంగుల రాట్నాలు, జెయింట్ వీల్... ఇలా అన్నీ ఒకేచోట. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నగరం విభిన్న సంస్కృతుల నిలయంగా వర్ధిల్లుతోంది.
- వాంకె శ్రీనివాస్
జస్టిస్ సముద్రాల గోవిందరాజులు
రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్