
మళ్లీ వారిద్దరే!
సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండగ. అలాగే సినిమా వాళ్లకు కూడా పెద్ద పండగే. అగ్ర కథానాయకుల సినిమాలు సంక్రాంతికి విడుదల చేయడం తెలుగులో అనవాయితీగా వస్తోంది. ఈ పండుగ సీజన్లో వరుస సెలవుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ధియేటర్లకు వస్తుంటారు. ఈ సమయంలో సినిమాలు విడుదల చేస్తే కాసుల వర్షం ఖాయమన్న ఉద్దేశంతో 'బొమ్మ'ను ధియేటర్లలోకి వదులున్నారు నిర్మాతలు. ఈ ఏడాది కూడా రెండు అగ్ర హీరోల సినిమాల సందడి నెలకొంది. 'ప్రిన్స్' మహేష్బాబు, 'మెగా పవర్స్టార్' రామ్చరణ్ బాక్సాఫీస్ రేసులో నిలిచారు.
గతేడాది పోటీ పడిన హీరోలే ఈ సంక్రాంతికి పోటీ పడుతుండడం ఈసారి విశేషం. మహేష్బాబు ’1’ నేనొక్కడినే, రామ్చరణ్ 'ఎవడు' సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ’1’ నేనొక్కడినే సినిమా జనవరి 10న విడుదలయింది. దీనికి సరిగ్గా రెండు రోజుల తర్వాత 12న ఎవడు దూసుకు వస్తున్నాడు. గతేడాది చరణ్ సినిమా ముందు వస్తే, ఈసారి మహేష్ సినిమా ముందుగా విడుదలయింది. నాయక్ గతేడాది జనవరి 9న విడుదలకాగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(ఎస్వీఎస్సీ) జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
గతేడాది మహేష్ మల్టీస్టారర్ మూవీ చేస్తే, ఈసారి చరణ్ ఈ ఫీట్ చేశాడు. అల్లు అర్జున్తో కలిసి తెరను పంచుకున్నాడు చరణ్. అయితే అల్లు అర్జున్ పాత్ర 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. అల్లు అర్జున్కు జోడీగా కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలో నటించింది. చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ నటించారు. ఎస్వీఎస్సీలో మహేష్, వెంకటేష్ అన్నదమ్ములుగా నటించిన సంగతి తెలిసిందే. సునీల్ 'భీమవరం బుల్లోడు'గా సంక్రాంతికి రావాలనుకున్నా వెనక్కి తగ్గాడు.
ఇక ప్రతి సంక్రాంతికి సినిమాను వదిలే నిర్మాత దిల్ రాజు ఈ ఏడాది కూడా ఆనవాయితీ పాటిస్తున్నారు. 'ఎవడు' సినిమాతో ఆయన సంక్రాంతి బరిలో నిలిచారు. నిజానికి ఈ సినిమాను గతేడాది ద్వితీయార్థంలోనే విడుదల చేయాలనుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడి చివరకు సంక్రాంతికి విడుదలవుతోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కు ఆయనే నిర్మాత. సంక్రాంతి పోటీలో నిలిచిన ’1’ నేనొక్కడినే, 'ఎవడు' చిత్రాలు ప్రేక్షకులను ఏ మేరకు రంజింపచేస్తాయో చూడాలి.