షటిలర్స్.. షహర్ | shuttlers talk about hyderabad city | Sakshi
Sakshi News home page

షటిలర్స్.. షహర్

Published Sat, Aug 9 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

షటిలర్స్.. షహర్

షటిలర్స్.. షహర్

చార్మినార్.. గోల్కొండ.. బిర్లామందిర్.. హైటెక్ సిటీ.. ఇలా హైదరాబాద్‌కీ షాన్‌గా నిలిచే జాబితాలోకి షటిల్‌ను కూడా చేర్చాలేమో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ బ్యాడ్మింటన్ జరిగినా.. మన సిటీ రాకెట్లు రివ్వున దూసుకుపోతున్నాయి. సైనా మొదలు సాయిదత్ వరకు విజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో నలుగురు హైదరాబాదీలు పతకాలు సాధించడం విశేషం. స్వర్ణ, రజత, కాంస్యాలతో మన షటిల్ ఎక్స్‌ప్రెస్ దూసుకుపోయింది. వీరంతా ఇక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకొని ఇంతింతై... వటుడింతై అన్నట్లు ఎదిగారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంతో వారికున్న అనుబంధాన్ని ఆ నలుగురు పంచుకున్నారు.
 
 ఫ్రమ్ హైదరాబాద్
 ‘నేను హైదరాబాదీని అని చెప్పుకోవడంలోనే నాకు గర్వంగా అనిపిస్తుంది. టోర్నీల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లినప్పుడు కూడా కేవలం ఇండియాతో సరి పెట్టకుండా ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పుకుంటాను. బయటి వాళ్లలో కూడా చాలా మందికి మన సిటీ గురించి బాగా తెలుసు. ఇక్కడి ప్రతీ చోటు ఇష్టమే. చార్మినార్ వంటి చారిత్రక ప్రాంతాల నుంచి కొత్త తరం మాల్స్ వరకు ఎక్కడైనా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. ఎల్బీ స్టేడియంలో శిక్షణ నుంచి ఏ స్థాయికి చేరుకున్నా అన్నీ హైదరాబాద్‌తోనే ముడిపడి ఉన్నాయి. ఫ్యూచర్‌లో కూడా మన సిటీ మరో మెగా ఈవెంట్‌కు వేదిక అవుతుందని నమ్ముతున్నా. నేను అందులో భాగం కావాలని కోరుకుంటున్నా.
 
 బిర్యానీ భలే రుచి

 ‘నేను పుట్టి పెరిగింది ఇక్కడే.. హైదరాబాద్ తప్ప మరో సిటీ గురించి ఊహించలేను. ఇతర నగరాలతో దీనిని పోల్చడం కూడా సరైంది కాదు. సికింద్రాబాద్‌లోని ఆగ్జిలియం స్కూల్‌లో, ఆ తర్వాత మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీలో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌పై దృష్టి పెట్టాను కాబట్టి ఫ్రెండ్స్‌తో తిరగడంవంటి సరదాలు తక్కువే. ఎక్కడికి వెళ్లినా అమ్మా నాన్నలతోనే. మన హైదరాబాదీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందులోనూ బిర్యానీ టేస్ట్‌కు పడి చస్తాను. అందుకే నా ఫేవరేట్ ఫుడ్ పాయింట్ అంటే ప్యారడైజ్ హోటలే. అక్కడ లభించే అన్ని వెరైటీలను టేస్ట్ చేస్తాను. భవిష్యత్తులోనూ హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలుస్తాను.
 
 ఈజీ గోయింగ్ సిటీ
 హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. మధ్యలో మూడేళ్లు బెంగళూరు వెళ్లడం మినహా అంతా ఇక్కడే ఉన్నాను. బహుశా నగరంతో అనుబంధం పెరిగిపోవడం వల్లే తొందరగా వెనక్కి వచ్చేశానేమో! ఆల్ సెయింట్స్ హైస్కూల్, రత్న జూనియర్ కాలేజి, సెయింట్ ఫ్రాన్సిస్ (బర్కత్‌పురా)లలో నా చదువు సాగింది. ఈ సిటీ గురించి సరిగ్గా చెప్పాలంటే కంఫర్ట్.. ఈజీ గోయింగ్.. ఈజిలీ రీచబుల్. ఎల్బీ స్టేడియంలో తొలిసారి రాకెట్ పట్టుకొని ఫుల్ వైట్‌డ్రెస్‌లో అడుగు పెట్టిన రోజు నాకు ఇంకా గుర్తుంది. నాటినుంచి ఇప్పటి వరకు నేనేం సాధించినా హైదరాబాదీగానే. మొదట్లో మేం బషీర్‌బాగ్, ఆ తర్వాత అత్తాపూర్‌లో ఉండేవాళ్లం. ఇప్పుడు అకాడమీకి దగ్గరగా గచ్చిబౌలికి మారాం. సిటీ బస్సుల్లో వేలాడుతూ గ్రౌండ్‌కు చేరిన రోజులు ఉన్నాయి. కానీ దానినీ ఎంజాయ్ చేశాను. సిటీ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో దాదాపు ప్రతీ హోటల్‌లో వెరైటీ ఐటమ్స్ ప్రయత్నించాను. హైదరాబాద్ స్పోర్ట్స్ సిటీగా మరింత పేరు తెచ్చుకోవాలని నా కోరిక.
 
 మధుర జ్ఞాపకం
 చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో ఎంజాయ్ చేసినంత నేను ఎక్కడా ఎంజాయ్ చేయలేను. టోర్నీల కోసం బయటి నగరాలకు వెళ్లడం తప్పదు. ఆల్ సెయింట్స్ హైస్కూల్, ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివాను. అజహర్‌లాంటి క్రికెటర్లు చదివిన స్కూల్‌లోనే చేరగానే నాలో అనుకోకుండానే క్రీడాకారుడి ఆలోచనలు వచ్చాయేమో!  సిటీలో నాకు బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు. నా కజిన్స్‌తోనే అన్ని సరదాలు. వారాంతంలో జీవీకే మాల్, ఇనార్బిట్ మాల్‌లోనే ఎక్కువగా ఉంటాను. నాకున్న డైట్ పరిమితుల వల్ల బిర్యానీ ఎక్కువగా తినలేను కానీ.. బషీర్‌బాగ్ కేఫ్ బహార్ నా ఫేవరేట్ ఫుడ్ జాయింట్. ఎలాంటి నాన్ వెజ్ అయినా ఎక్కువగా అక్కడి నుంచి తెప్పించుకుంటా. ఇక రంజాన్ నెలలో బహార్ హలీమ్ ఒక్క రోజూ మిస్ కాను. మొదటి నుంచి కొత్తపేట సమీపంలోని అష్టలక్ష్మి టెంపుల్  దగ్గరే ఉంటున్నాం. సిటీ ఎంత మారినా ప్రతీది మధుర జ్ఞాపకమే.
 -  మొహమ్మద్ అబ్దుల్ హాదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement