స్టైలిష్ ఆల్‌రౌండర్ | Stylish all-rounder | Sakshi
Sakshi News home page

స్టైలిష్ ఆల్‌రౌండర్

Published Wed, Dec 3 2014 11:02 PM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM

స్టైలిష్ ఆల్‌రౌండర్ - Sakshi

స్టైలిష్ ఆల్‌రౌండర్

హైదరాబాదీ
ఎం.ఎల్.జయసింహ

మన దేశంలో క్రికెట్ అంతగా ప్రాచుర్యం పొందని రోజుల్లోనే స్టైలిష్ క్రికెటర్‌గా తెరపైకి వచ్చాడతడు. పదిహేనేళ్ల వయసులోనే హైదరాబాద్ జట్టు తరఫున ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఆడిన తొలి మ్యాచ్‌లో తొంభై పరుగులు సాధించి, అందరి దృష్టినీ ఆకర్షించాడు. క్రికెట్ ప్రపంచంలో ‘కల్టివేటెడ్ స్టైలిస్ట్’గా గుర్తింపు పొందిన ఎం.ఎల్.జయసింహ సికింద్రాబాద్‌లో 1939 మార్చి 3న జన్మించాడు.అతడి చదువు సంధ్యలన్నీ ఇక్కడే సాగాయి. హైదరాబాద్ జట్టు తరఫునే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని అంశాల్లోనూ రాణించి, ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుకున్నాడు. క్రికెట్‌లో ఇప్పటి రికార్డులతో పోల్చి చూస్తే జయసింహ రికార్డులు పెద్దగా అనిపించకపోవచ్చు. అయితే, అప్పటి పరిస్థితుల్లో అతడు సాధించిన రికార్డులు తక్కువేమీ కాదు. అప్పట్లో ఆధునిక క్రికెట్ కోచింగ్ సౌకర్యాలు అంతంత మాత్రమే. ఇప్పటిలా అప్పట్లో క్రికెటర్లకు ఆకర్షణీయమైన ఆదాయావకాశాలూ ఉండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో రాణించడం అంత తేలిక కాదు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లోనే తొంభై పరుగులతో శుభారంభం చేసిన జయసింహ, ఆ తర్వాత మద్రాస్, మైసూరు జట్లతో ఆడిన మ్యాచ్‌లలో సెంచరీలు కొట్టాడు. అదే సీజన్‌లో రంజీ మ్యాచ్‌లలో బౌలర్‌గా కూడా రాణించి, ఇరవై వికెట్లు తీసి, 1959లో ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. లార్డ్స్ మైదానంలో తొలి అంతర్జాతీయ టెస్ట్ ఆడాడు. తొలి టెస్ట్‌లో విఫలమైనా, ఆ తర్వాతి రెండు టెస్ట్ మ్యాచ్‌లలోనూ రాణించి, క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
 
ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్

ఒక టెస్ట్‌మ్యాచ్‌లో వరుసగా ఐదురోజులూ బ్యాటింగ్ చేసిన తొలి క్రికెటర్‌గా జయసింహ ఘనత సాధించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ జయసింహ అయితే, ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్ రవిశాస్త్రి. ఆస్ట్రేలియా జట్టుపై 1960లో కలకత్తాలో ఆడిన మ్యాచ్‌లో జయసింహ తొలిరోజు ఆట ముగిసే సమయంలో బ్యాటింగ్ ప్రారంభించాడు. రెండో రోజు ఇరవై పరుగుల వద్ద ఉండగా, ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో మూడోరోజు ఆట ముగిసే సమయానికి మళ్లీ బ్యాటింగ్ అవకాశం వచ్చింది. నాలుగో రోజంతా బ్యాటింగ్ చేసి 59 పరుగులు చేశాడు. చివరిగా ఐదో రోజు 74 పరుగుల వద్ద ఔటయ్యాడు. రెండేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టుపై కాన్పూర్‌లో ఆడిన టెస్ట్ మ్యాచ్‌లో ఒక సింగిల్ రన్ కోసం ఆత్రపడి 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. తొలినాళ్లలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఉన్న జయసింహ, క్రమంగా ఓపెనర్‌గా ఎదిగాడు. ఓపెనర్‌గానే ఇంగ్లాండ్, శ్రీలంక జట్లపై సెంచరీలు చేశాడు.
 
జూనియర్లకు మార్గదర్శి
వెస్ట్ ఇండీస్‌పై 1970-71లో చివరి టెస్ట్ సిరీస్ ఆడిన జయసింహ, జూనియర్లకు మార్గదర్శిగా ఉండేవాడు. ఆటలో జయసింహ ఇచ్చిన సలహాలు విలువైనవని మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ కొనియాడటమే ఇందుకు నిదర్శనం. మరో మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ సైతం జయసింహ నాయకత్వంలో పలు మ్యాచ్‌లు ఆడాడు. ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ శైలిలో జయసింహనే గురువుగా పరిగణించేవాడు. క్రికెటర్‌గా విరమించుకున్నాక కొన్నాళ్లు సెలెక్టర్‌గా, శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించాడు. కొన్నాళ్లు కామెంటేటర్‌గానూ ఆటతో బాంధవ్యాన్ని కొనసాగించిన జయసింహ, 1999 మార్చి 3న లంగ్ కేన్సర్‌తో సైనిక్‌పురిలోని తన నివాసంలో కన్నుమూశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement