ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రం! | super stars film! | Sakshi
Sakshi News home page

ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రం!

Published Sun, Sep 28 2014 1:43 PM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

రజనీకాంత్ - మహేష్ బాబు

రజనీకాంత్ - మహేష్ బాబు

మల్టీస్టార్ చిత్రాలంటే మాటలుకాదు. ఇక ఇద్దరు సూపర్‌స్టార్స్ నటిస్తే ఎలా ఉంటుంది? అది ఎంత పెద్ద వార్త. అలాంటి వార్తే ఒక ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. రజనీస్టైల్స్ - మహేష్‌ వైబ్రేషన్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి. అటువంటి మూవీ వార్త వింటే అభిమానులకు పండగే. ఇప్పుడు ఈ సూపర్ స్టార్లతో  భారీ మల్టీస్టారర్‌ సినిమా గురించే ఇండస్ట్రీలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

సూపర్‌స్టార్‌ అనగానే  భారతీయ చలనచిత్రరంగంలో చాలామంది మహానటులు గుర్తుకు వస్తారు.  కానీ దక్షిణాదిన  సూపర్‌స్టార్‌ అనగానే కనిపించే మొట్టమొదటి బొమ్మ రజనీకాంత్దే. భారతీయ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన హీరో రజనీకాంత్‌. ఇక టాలీవుడ్‌లో ఇప్పుడు సూపర్‌స్టార్‌ అనగానే  ప్రిన్స్ మహేష్‌ బాబు కళ్లముందు కనిపిస్తాడు. తన పేరులో ఉన్న వైబ్రేషన్స్ను వెండితెర బాక్సాఫీసుకు పరిచయం చేసిన బిజినెస్‌మెన్‌ మహేష్‌. నాడు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, నేడు కొడుకు మహేష్ ఆ స్థానం ఆక్రమించేశారు. మొత్తానికి టాలీవుడ్లో సూపర్‌స్టార్‌ అనే పిలుపు ఘట్టమనేని ఫ్యామిలీకి పేటెంట్‌గా మారిపోయింది.

ప్రేక్షకుల ఉత్సాహాన్ని ఉరకలెత్తించే ఎనర్జీ ఒకరిది. అరవైలోనూ ఇరవైని తలదన్నే స్టైల్‌తో మతిపోగొట్టే ఇమేజ్‌ మరొకరిది. ఇలాంటివాళ్ల సినిమాలు వస్తున్నాయంటేనే ఒక పండగ. అలాంటిది ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే అటువంటి సినిమాను  ప్రేక్షకులు వందేళ్ల సినిమా పండక్కి కానుకగా భావిస్తారు. రజనీ, మహేష్‌ కలిసి ఒక సినిమా చేయబోతున్నారన్న వార్త అటు కోలివుడ్లోనూ, ఇటు టాలీవుడ్లోనూ  వినవస్తోంది.  గతంలో రజనీకాంత్‌, కృష్ణల కాంబినేషన్‌లో రెండు చిత్రాలు నిర్మించిన సూర్యనారాయణబాబే ఈ సెన్సేషనల్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే  ఇద్దరు సూపర్‌స్టార్ల నుంచీ ఆయనకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే నాడు తండ్రి, నేడు కొడుకుతో మల్టీస్టారర్‌ చేసిన హీరోగా రజనీకాంత్‌ చరిత్ర సృష్టిస్తారు.   

ఐతే ఈ భారీ మల్టీస్టారర్కు  డైరెక్టర్‌ ఎవరు? అనే ప్రశ్న మొదలైంది. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలోనే మహేష్‌, నాగార్జునల కోసం మణిరత్నం ఒక కథ సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు మణిరత్నం ఈ ఇద్దరు సూపర్ స్టార్లను డైరెక్ట్ చేస్తారన్న టాక్ వినవస్తోంది. తెలుగు, తమిళ రెండు భాషలో సూపర్ స్టార్లతో చిత్రం నిర్మించి హిట్లు కొట్టిన ఘనుడు మణిరత్నం.  మణిరత్నంతోపాటు వినిపించే మరో పేరు శంకర్‌. ఇప్పటికే రజనీతో రెండు సినిమాలు చేసిన శంకర్‌ ఘన విజయాలు సాధించాడు.  హ్యాట్రిక్‌ కోసం శంకర్ ఈ మల్టీస్టారర్‌ మూవీని ఎన్నుకునే అవకాశం ఉందని అంటున్నారు. సూపర్ స్టార్లతో సినిమా అంటే ముఖ్యంగా కథ కుదరాలి. అన్ని అవకాశాలు కలసిరావాలి. గతంలో పలువురు హీరోలు కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది. చివరికి వచ్చేసరికి ఆ కథలు సెట్ వరకు వెళ్లలేదు. ఇప్పుడు రజనీ, మహేష్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement