ఓ అడుగు వెనక్కువెళ్లిన 'తెలంగాణ బిల్లు'
కేంద్ర మంత్రి మండలి సమావేశం వాయిదా పడటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లు ఒక అడుగు వెనక్కు వేసినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్న కారణంగా ఈ రోజు జరుగవలసిన సమావేశం వాయిదాపడింది. కేంద్రం ముందు ప్రకటించిన ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితేనే పార్లమెంటు ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు సమయం సరిపోయే పరిస్థితిలేదు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం (జిఓఎం) ఈరోజు తుది నివేదిక ఇచ్చినప్పటికీ రాజ్యాంగం ప్రకారం జరగవలసిన ప్రక్రియ జరగవలసిందే.
కాంగ్రెస్ అధిష్టానం నేతలు చెప్పిన ప్రకారం అయితే ఈరోజు కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపవలసి ఉంటుంది. ఆ తరువాత రాష్ట్రపతి దానిని శాసనసభకు పంపడం - ఆ తరువాత శాసనసభ అభిప్రాయం రాష్ట్రపతికి పంపడం - రాష్ట్రపతి దానిని కేంద్రానికి పంపడం - పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడం - ప్రాముఖ్యత గల బిల్లు అయినందున సుదీర్ఘ చర్చ...అంతా బిజీ షెడ్యూల్ ప్రకారం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగితేనే బిల్లు ఆమోదం పొందడానికి అవకాశం ఉండేది. కేంద్ర కేబినెట్ సమావేశం వాయిదాపడిన నేపధ్యంలో ఓ ఆటంకం ఏర్పడినట్లే భావించాలి.
ఈ నెలాఖరుకు కేంద్ర కేబినెట్ బిల్లు ఆమోదించినా మిగిలిన అన్ని ప్రక్రియలు పూర్తి అయి పార్లమెంటులో బిల్లు పెట్టడానికి గానీ, చర్చకు గానీ సమయం సరిపోదు. పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల 5న ప్రారంభమై 20న ముగుస్తాయి.
శాసనసభ అభిప్రాయం కోసం రాష్ట్రపతి ఇచ్చే సమయంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు 45 రోజులు సమయం ఇచ్చారు. బిల్లు ఈ సమావేశాల్లో పార్లమెంటుకు రావడం అనేది రాష్ట్రపతి శాసనసభకు ఇచ్చే సమయంపై ఆధారపడి ఉంటుంది. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతుండటం - విభజనకు అనేక సమస్యలు ఉన్న నేపధ్యంలో ప్రాముఖ్యత గల ఈ బిల్లుపై శాసనసభ చర్చించడానికి, అభిప్రాయం తెలియజేయడానికి కనీస సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఈ జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని బిల్లు ఆమోదం పొందడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాలు పొండిగించినా ఇతర ప్రక్రియలు పూర్తి కావడానికి కూడా సమయం సరిపోయే పరిస్థితిలేదు.
రాష్ట్ర విభజన అనేది ప్రజాప్రయోజనం ఆలోచించి చేస్తున్నదేమీకాదు. కాంగ్రెస్ అధిష్టానం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే ఈ విభజనకు పూనుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులలో రాజకీయంగా ఆలోచించే కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుందో వేచిచూడవలసిందే!