ది లాస్ట్ డిన్నర్ | The last dinner | Sakshi
Sakshi News home page

ది లాస్ట్ డిన్నర్

Published Fri, Feb 20 2015 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

ది లాస్ట్ డిన్నర్

ది లాస్ట్ డిన్నర్

రైల్వేస్టేషన్.. క్లాక్‌టవర్.. మోండా మార్కెట్.. నటరాజ్, సంగీత్ థియేటర్లు.. ఇవన్నీ బోనాలకు కేరాఫ్‌గా ఉన్న లష్కర్ ల్యాండ్‌మార్క్స్. వీటికి పోటీగా..

రైల్వేస్టేషన్.. క్లాక్‌టవర్.. మోండా మార్కెట్.. నటరాజ్, సంగీత్ థియేటర్లు.. ఇవన్నీ బోనాలకు కేరాఫ్‌గా ఉన్న లష్కర్ ల్యాండ్‌మార్క్స్. వీటికి పోటీగా.. క్లాక్‌టవర్ నీడ పడే దూరంలో ఠీవీగా నిల్చున్నదే గార్డెన్ రెస్టారెంట్. నిన్నటి వరకూ గర్‌మా గరమ్ ఇరానీ చాయ్ ఇచ్చిన ఆ అడ్డాలో ఇక చాయ్ సిప్ చేయలేం.. బిర్యానీ రుచి చూడలేం.. సరదాగా కాసేపూ కబుర్లాడుకోలేం. 63 ఏళ్లుగా
 సిటీవాసుల ఆర్డర్లను తు.చ తప్పకుండా పాటించిన ఆ రెస్టారెంట్.. ఇక మీదట కనిపించదు.
 ..:: చీకోటి శ్రీనివాస్, సికింద్రాబాద్
 
 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న క్లాక్‌టవర్‌ను 1897లో నిర్మించారు. ఈ నిర్మాణానికి చుట్టూరా పదెకరాల స్థలంలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు అప్పటి బ్రిటిష్ పాలకులు. ఈ గార్డెన్ విరబూసిన 55 ఏళ్లకు అంటే 1952లో అక్కడ ఓ రెస్టారెంట్ మొదలైంది. నగరానికి వలస వచ్చిన ఇరానీలు దీన్ని నెలకొల్పారు. దానికి గార్డెన్ రెస్టారెంట్‌గా నామకరణం చేశారు.
 
 ఈ 63 ఏళ్ల  అభివృద్ధిలో ఆ పదెకరాల ఉద్యానవనం చిన్నబోయింది. క్లాక్‌టవర్‌లో కాలం ఆగిపోయింది. ఈ పరిణామాలకు సాక్షిగా నిలుస్తూ ఇన్నాళ్లూ పాయ్‌రోటీ, చాయ్ బిస్కెట్ అందించిన గార్డెన్ రెస్టారెంట్ కూడా కనుమరుగవుతోంది. నగరమంతా పరుచుకుంటున్న మెట్రో మార్గంలో ఈ రెస్టారెంట్ ఉన్న ప్రాంతం పిల్లర్‌గా మారుతోంది. ఇప్పటికే క్లాక్‌టవర్ పరిసర ప్రాంతాల భవనాలను నేలమట్టం చేసిన అధికారులు నేడో రేపో చరిత్రాత్మక గార్డెన్ రెస్టారెంట్ భవనాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
 
 ప్రముఖుల రాకపోకలు..
 గార్డెన్ ఘుమఘుమలు ఆ ప్రాంతంలో నివసించే సాధారణ కూలీల నుంచి వివిధ రంగాల్లోని అగ్రగణ్యులకు కూడా చిరపరిచితమే. సుప్రసిద్ధ చిత్రకళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ నగరానికి వచ్చిన ప్రతిసారీ గార్డెన్‌లో చాయ్ సిప్ చేశాకే వేరే కార్యక్రమాలకు వెళ్లేవార ని చెబుతుంటారు.
 
 
 ‘హుస్సేన్‌జీ బేగంపేట విమానాశ్రయంలో దిగి.. అట్నుంచి నేరుగా మా రెస్టారెంట్‌కు వచ్చి.. ఇక్కడ టీ టేస్ట్ చేశాకే..  మరెక్కడికైనా వెళ్లేవార’ని రెస్టారెంట్ నిర్వాహకుడు చెబుతున్నారు. ఆయనే కాదు హుస్సేన్ తను అమితంగా అభిమానించే సుప్రసిద్ధ నటి మాధురీ దీక్షిత్‌కు సైతం గార్డెన్‌ను చూపించారని ఆయన ఆనందంగా తెలిపారు. జింఖానా గ్రౌండ్స్‌లో రంజీ ట్రోఫి జరిగిన పుడు క్రికెటర్లు సైతం ఇక్కడి బిర్యానీ ఆవురావురుమంటూ ఆరగించేవారు. రంజాన్ సీజన్‌లో వీరు తయారు చేసే హలీమ్ కోసం ఎస్‌డీ రోడ్‌లో ట్రాఫిక్ జామ్ అయ్యేది.
 
 నేడు చివరి ఆత్మీయ విందు
 నగరవాసులతో ఇంతలా పెనవేసుకున్న బంధం తీరనుంది. రెస్టారెంట్ కూల్చివేతను అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఆరు దశాబ్దాలకు పైగా పలువురితో అనుబంధం పెంచుకున్న గార్డెన్ యాజమాన్యం పలువురు ఆత్మీయులకు ఈ రోజు (శనివారం) విందు ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలువురు కస్టమర్లు, వివిధ విభాగాల అధికారులు, మీడియా ప్రతినిధులకు లాస్ట్ బిర్యానీ ఆరగించి, లాస్ట్ చాయ్‌సిప్ చేసి వెళ్లాల్సిందిగా ఆహ్వానాలు పంపింది. హాజరయ్యే ప్రతినిధులకు అత్మీయంగా విందు ఇచ్చి.. భారమైన హృదయంతో వీడ్కోలు తీసుకునేందుకు రెస్టారెంట్ యాజమాన్యం గుండెను గట్టిచేసుకునే పనిలో ఉంది. ఆదివారం నుంచి మూతపడనున్న గార్డెన్ రెస్టారెంట్.. మరికొద్ది రోజుల్లోనే కనుమరుగుకానుంది.
 
 సగం జీవితం ఇక్కడే..
 నాకు 18 ఏళ్లున్నప్పుడు ఇక్కడ సర్వర్‌గా జాయిన్ అయ్యాను. పెళ్లయింది. నా పిల్లల పెళ్లిళ్లు కూడా ఇక్కడ పని చేస్తూనే చేశా. నాకిప్పుడు 50 ఏళ్లు. 32 ఏళ్లు నా కుటుంబానికి అండగా ఉన్న గార్డెన్.. ఇక ఉండదంటే తట్టుకోలేకపోతున్నాను.
 - శ్రీరంగ్, గార్డెన్ సర్వర్
 
 ఉద్యోగంలో చేరినప్పటి నుంచి
 సికింద్రాబాద్ కోర్టులో 1980లో ఉద్యోగంలో చేరాను. కోర్డుకు వచ్చిన ప్రతి రోజూ ఏదో టైమ్‌లో ఇక్కడికి రావాల్సిందే. ఫ్రెండ్స్‌తో కలసి   ముచ్చట్లు పెట్టడం.. ఛాయ్ తాగడం ఎప్పటికీ మరచిపోలేను. స్పెషల్ డేస్‌లో బిర్యానీ కూడా ఇక్కడే లాగించేవాళ్లం. ఇకపై ఛాయ్, బిర్యానీ కోసం మరోచోటికి వెళ్లాలంటేనే బాధగా ఉంది.
 - శ్రీనివాస్, కోర్టు ఉద్యోగి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement