
జగన్ కు బెయిల్ వచ్చిన ఆనందంలో వైఎస్ విజయమ్మ, షర్మిల, భారతి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి బెయిలుపై విడుదల కావడంతో ముఖ్యంగా ముగ్గురు మహిళలకు ఎంతో రిలీఫ్ లభించింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి బెయిలుపై విడుదల కావడంతో ముఖ్యంగా ముగ్గురు మహిళలకు ఎంతో రిలీఫ్ లభించింది. ఆయన విడుదల కావడంతో రాష్ట్రంలో అత్యధికులు ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ సంతోషించారు. అయితే అందరికంటే ముఖ్యంగా ఆ ముగ్గురు మహిళల సంతోషానికి అవధులులేవు. ఆయన జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆ ముగ్గురిపైనే అధిక భారం పడింది. ఒకరు రాజకీయ భారం మోస్తే, మరొకరు వ్యాపార బాధ్యతలు నిర్వహించారు. ఇంకొకరు ఆయన బాటలో నడిచి బాధలలో ఉన్న ప్రజలను ఓదార్చారు. వారిలో ఒకరు జగన్ తల్లి విజయమ్మ కాగా, రెండవ వారు ఆయన సతీమణి భారతి, మూడవ వారు చెల్లి షర్మిల.
విజయమ్మ: జగన్ జైలుకు వెళ్లడంతో విజయమ్మ అనివార్యంగా రాజకీయ బాధ్యతలు స్వీకరించవలసి వచ్చింది. పార్టీ గౌరవాధ్యక్షురాలిగా రైతులు, చేనేత కార్మికుల సమస్యలపైన, విద్యుత్ సమస్యపైన పోరాడారు. దీక్షలు చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు. ముఖ్య నేతల సహకారంతో పార్టీని నడిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి సారధ్యం వహించి ఆశించిన స్థాయిలో విజయం సాధించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ గుంటూరులో అమరణ నిరాహారదీక్ష చేశారు. ఆ తరువాత ఆ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్రాన్ని విభజించవద్దని ప్రధానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలకు లేఖలు రాశారు. ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రిని, రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను వివరించారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరారు.
షర్మిల: ప్రపంచంలో ఏ మహిళ చేయని విధంగా షర్మిల 3 వేల కిలోమీటర్లకుపైగా సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ఇంటిని, కుటుంబాన్ని, పిల్లలను వదిలి తండ్రి, అన్న ఆశయాల కోసం జనం వద్దకు వెళ్లారు. వారికి ధైర్యం చెప్పారు. ఎండనక, వాననక, కాలికి గాయం అయినా లెక్కచేయకుండా శస్త్ర చికిత్స చేయించుకొనిమరీ ఆమె దీర్ఘకాలం నడిచారు. మహిళలు శక్తిస్వరూపిణులుగా, సంకల్ప బలంగలవారుగా నిరూపించారు.14 జిల్లాలలో, 107 శాసనసభ నియోజకవర్గాలలో 17 వందలకు పైగా గ్రామాలలో ఆమె నడిచారు. కోట్ల మంది ప్రజలను కలిశారు. రైతులు, కూలీలు, చేనేత కార్మికులు, అన్ని రకాల చేతి వృత్తుల వారిని, విద్యార్థులను, వృద్ధులను, గృహిణులను.... కలుసుకొని వారి బాధలను, సమస్యలను తెలుసుకున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, పేదలందరికీ మళ్లీ మంచిరోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఆ తరువాత సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర చేశారు. సమన్యాయం చేయలేనప్పుడు విడగొట్టే హక్కులేదని కేంద్రానికి చెప్పారు. సమైక్యవాదులకు అండగా నిలిచారు.
భారతి: జగన్ వ్యాపార బాధ్యతలన్నీ ఆమె అనివార్యంగా స్వీకరించారు. ఎంబిఏ పూర్తి చేసిన భారతి వ్యాపార వ్యవహారాలను ఎంతో దైర్యంగా, సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఒక వైపు పిల్లల సంరక్షణ చూసుకుంటూనే ఆమె సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ, ఇతర వ్యాపార లావాదేవీలను చూస్తున్నారు. క్లిష్ట పరిస్థితులలో కూడా ఆమె ధైర్యం సడలలేదు. జన సంక్షేమం కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని హెచ్ఎం టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతి చెప్పారు. జగన్ జైలులో ఉండి కూడా రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించిన తరువాత ఆస్పత్రిలో చేర్చిన సమయంలో ఆమె ఎంత బాధపడ్డారో ఆమెకే తెలియాలి. అయినా ధైర్యంగా నిలిచారు.
నేరం రుజువు కాకుండానే జగన్ 485 రోజులు జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్ రాకుండా ప్రతిసారీ కాంగ్రెస్, టిడిపి నేతలు ఏదో ఒక ఆటంకం కల్పించారు. అడ్డుకుంటూ వచ్చారు. వారు ఎన్ని చేసి, ఎంతకాలం జైలులో ఉంచగలరు? దేవుడు జగన్ పక్షాన నిలిచాడు. న్యాయం జగన్ పక్షాన ఉంది. ఆలస్యంగా అయినా న్యాయమే గెలుస్తుందని రుజువైంది. 16 నెలల తర్వాత ఈ నెల 23న ఆయనకు బెయిల్ మంజూరైంది. ఎట్టకేలకు జగన్ 24న విడుదలయ్యారు. జగన్ రాత్రి 9.30 గంటలకు లోటస్పాండ్లోని తన నివాసానికి వెళ్లినప్పుడు ఆ ఆనంద క్షణాలలో ఆ ముగ్గురి కళ్లలోని ఆనందం చూసి తీరవలసిందే.