మహానేత వైఎస్‌ఆర్ కు ఘన నివాళి | Great tribute to Late YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

మహానేత వైఎస్‌ఆర్ కు ఘన నివాళి

Published Wed, Jul 9 2014 1:05 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Great tribute to Late YS Rajasekhara Reddy


ఇడుపులపాయలో వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, భారతి, కుటుంబసభ్యుల ప్రత్యేక ప్రార్థనలు

వేంపల్లె: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ 65వ జయంతి వేడుకలు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో జరిగాయి. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డితోపాటు వైఎస్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిలమ్మ, కోడలు భారతిరెడ్డి, షర్మిల కుమార్తె అంజలి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి, ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే వైఎస్ పురుషోత్తమరెడ్డి, జగన్ మామ ఈసీ గంగిరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, కమలమ్మ, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ అవినాష్‌రెడ్డి సతీమణి సమతారెడ్డి తదితరులు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెవరెండ్ నరేష్‌బాబు సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.    
 
 వైఎస్ ఆశయాలు సాధిస్తాం: ఎంపీలు
 వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి మహానేతను కోల్పోవడం రాష్ట్రానికే కాకుండా దేశానికి పెద్దలోటని వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో దివంగత వైఎస్సార్ ఆశయ సాధనకు అంతా కృషి చేస్తామని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని లోధీఎస్టేట్-26లో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాదరావు, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక పాల్గొన్నారు. వైఎస్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం కేక్ కోశారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ..   ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా రాజశేఖరరెడ్డి పరిపాలన కొనసాగిందన్నారు. అందుకే ప్రజలు ఆయనను ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు.
 
 పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతల శ్రద్ధాంజలి
 హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి.. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తరువాత యర్రగొండపాలెం, మార్కాపురం ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి సంయుక్తంగా కేక్‌ను కోసి పంచారు. ఆ తరువాత పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటుతో పాటు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు ఎన్.లక్ష్మీపార్వతి, నల్లా సూర్యప్రకాశరావు, వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావు, విజయచందర్, బి.జనక్‌ప్రసాద్, పీఎన్వీ ప్రసాద్, పుత్తా ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్‌సీ ఎల్పీ కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్  వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 
 
 మహానేతకు కాంగ్రెస్ నివాళి
 వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం స్థానిక ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. పంజగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నాయకులు వట్టి వసంతకుమార్, శైలజానాథ్, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement