
ఆ జ్ఞాపకాలు... రక్తం పొంగే దివ్య స్మృతులు
నేడు భగత్‌సింగ్ 84వ వర్థంతి
విప్లవం ఒక చట్టం. విప్లవం ఒక ఆదేశం. విప్లవం ఒక సత్యం అన్న హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ విధానమే షహీద్ భగత్ సింగ్ నినాదమైంది. ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి అన్న నినాదాలు నాటికీ, నేటికీ నిత్య నూతనంగా మార్మోగు తూనే ఉన్నాయి. అందరికంటే ముందు దేశా నికి స్వాతంత్య్రం, సోషలిజం అంటూ చాటుతూ భగత్‌సింగ్ ఆయన ప్రియతమ సహచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు చిరునవ్వుతో ఉరికంబ మెక్కి నేటికి 84 ఏళ్లు గడిచిపోయాయి. కార్మికవర్గం, రైతాంగం ప్రధాన శక్తిగా భారతదేశం సంపూర్ణ విముక్తి దిశగా ముందుకు సాగాలన్న భగత్ సింగ్ తదితర అమరుల ఆశలను భారత పాలకులు వమ్ము చేశారు.
భగత్‌సింగ్ కుటుంబ నేపథ్యం స్వాతంత్య్ర సమరంతో సంపూ ర్ణంగా ముడిపడి ఉండేది. 1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్‌లోని లమాన్‌పూర్ జిల్లా బంగా గ్రామంలో కిషన్‌సింగ్, పద్మావతి దంప తులకు భగత్ సింగ్ జన్మించేనాటికి అతడి తండ్రి, మామ స్వరణ్ సిం గ్‌లు జైల్లోనే ఉన్నారు. భారత్‌లో తిరుగుబాటు లక్ష్యంగా స్వదేశానికి వస్తూ విద్రోహానికి గురై పట్టుబడి ఉరికంబమెక్కిన వందమంది గదర్ వీరుల్లో 20 ఏళ్ల కర్తార్‌సింగ్ శరభ్ త్యాగం భగత్‌సింగ్‌ను ఎంతో ప్రభావితం చేసింది. జలియన్‌వాలాబాగ్ హత్యాకాండ కోపోద్రిక్తున్ని చేస్తుంది. చర్యకు ప్రతి చర్యలతో ప్రారంభమైన భగత్ సింగ్ జీవితం, లాలాలజపతిరాయ్‌కు చెందిన ద్వారకా నాథ్ గ్రంథాలయంలో మార్క్సిజాన్ని చదివి కార్మికవర్గ దృక్పథం అలవర్చుకునేలా పరిణితి చెందింది.
1922లో చౌరీచౌరా ఘటనతో గాంధీ ఏకపక్షంగా సహాయ నిరాకరణోద్యమాన్ని ఉపసంహరించారు. దీని తర్వాతే సంపూర్ణ స్వాతంత్య్రం లక్ష్యంగా నౌజవాన్ భారత్ సభ, హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ వంటి తిరు గుబాటు సంస్థలు ఏర్పడి, కాంగ్రెస్ ఉద్యమ పిలుపుల్లోనూ చురుకుగా పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే సైమన్ కమిషన్‌ను తిప్పికొట్టే కార్య క్రమంలో బ్రిటిష్ ముష్కరుల చేతిలో తీవ్రంగా గాయపడ్డ లాలాల జపతిరాయ్, తర్వాత ఆసుపత్రిలో మరణించారు. భారతీయులు బల హీనులు కాదన్న సంకేతాల్ని ప్రజల్లోకి పంపి, వారి మనోబలం పెంచ డానికి ప్రతిఘటన చర్యల వైపు విప్లవ బృందం నిర్ణయాలు తీసుకుంది. ప్రజావ్యతిరేక చట్టాలను వరుసగా తీసుకువస్తున్న బ్రిటిష్ సామ్రాజ్య వాదుల బధిరత్వాన్ని బద్దలు చేసే లక్ష్యంతో 1928 ఏప్రిల్ 28న భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్తులు ఢిల్లీ అసెంబ్లీలో పొగబాంబు విసిరి స్వచ్ఛందంగా అరెస్టయినారు. ఎక్కడ విధ్వంసాలకు సమాజం బెదర దో, ఎక్కడ కార్మికవర్గ సార్వభౌమత్వం గుర్తింపునకు నోచుకుం టుం దో... అలాంటి అత్యున్నత సమాజాన్ని ఏర్పాటు చేయడమే విప్లవం, అదే మా ఆకాంక్ష, ఈ స్ఫూర్తితోనే ఈ పేలుడు ద్వారా స్పష్టమైన హెచ్చరిక చేశామంటూ వారు కరపత్రాలు వెదజల్లారు. ఈ కేసులో భగత్‌సింగ్, దత్తులకు జీవిత ఖైదు విధిస్తూ వారిని అండమాన్ జైలుకు పంపాలనే కోర్టు తీర్పు ఇచ్చినా, తర్వాత శాండర్స్ హత్య కేసును కుట్రకేసుగా మార్చి, 1930 అక్టోబర్ 7న లాహోర్ స్పెషల్ ట్రిబ్యునల్ కోర్టు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఉరిశిక్ష విధించిం ది. శాండర్స్ హత్య కేసులో తన కొడుకుపై సరైన విచారణకు మళ్లీ అవకాశం కల్పించాలన్న తండ్రి కిషన్‌సింగ్ విన్నపాన్ని తోసిపు చ్చిన భగత్‌సింగ్... తన జీవితం సూత్రాలను ఫణంగా పెట్టి, కొను గోలు చేయవలసినంత విలువైనదేమీ కాదని ప్రకటించాడు.
ఉరికంబమెక్కిన భగత్‌సింగ్ తదితరుల త్యాగం దేశ ప్రజలను రగిలించింది. ఉరిశిక్ష ఖరారైన ఈ పోరాటం తమతో ఆరంభం కాలేదని, తమతోనే అంతం కాదని భగత్‌సింగ్ చాటాడు. భారతీయ కార్మికవర్గాన్ని గుప్పెడుమంది పరాన్నజీవులు (బ్రిటిష్- భారత పెట్టుబడిదారులు) దోపిడీ చేస్తున్నంత కాలం.. ఈ యుద్ధం కొన సాగుతూనే ఉంటుందని భగత్ సింగ్ ఆనాడే క్రాంతదర్శనం చేశారు. భగత్‌సింగ్ సజీవ వారసత్వం ఎత్తిపట్టడమే ఆయనకు నిజమైన నివాళి.
అమర్ , జనశక్తి నేత
మొబైల్ : 9989803784