ఏపి శాసనసభలో వైఎస్ జగన్మోహన రెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సిపి ఒక్కటే కావడంతో ఆ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డిపైనే అధికారపక్షాన్ని నిలదీసే బాధ్యత అంతాపడింది. శాసనసభలో టిడిపి, వైఎస్ఆర్సి, బిజెపి మూడు పార్టీలకు మాత్రమే సభ్యులు ఉన్నారు. బిజెపి ఎన్నికలలో టిడిపితో పొత్తు పెట్టుకొని గెలిచింది. ఆ తరువాత మంత్రి పదవులు స్వీకరించి ప్రభుత్వంలో కూడా చేరింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. దాంతో వైఎస్ఆర్సి ఒక్కటే ప్రతిపక్షంగా మిగిలింది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పటిష్టంగాలేకపోతే అధికార పక్షం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతుంది. వారి ఆగడాలు యధేచ్ఛగా కొనసాగుతాయి. అది ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. అధికార పక్షం నియంతృత్వ పోకడలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు అధికారపక్షం దుందుడుకుపోకడలకు శాసనసభలోనూ, బయట ప్రతిపక్షాలు కళ్లెం వేయవలసి ఉంటుంది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వంటి పార్టీలకు శాసనసభలో కనీసం ఒకటి రెండు స్థానాలైనా లభించి ఉంటే ఆయా లెజిస్లేచర్ పార్టీ నేతలు సభలో గళం విప్పడానికి అవకాశం ఉండేది. ప్రస్తుత శాసనసభలో ఆ అవకాశంలేదు.
కొత్త రాష్ట్రం - 30 సంవత్సరాల అనుభవం ఉన్న టిడిపి అధికారం చేజిక్కించుకుంది - ప్రతిపక్ష హోదా పొందిన కొత్త పార్టీ వైఎస్ఆర్సిపి - శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. అయినా అధికారపక్షానికి ధీటుగా గొంతెత్తి హుందాగా వ్యవహరిస్తున్నారు. సభలో గళం విప్పి ప్రజాసమస్యలు లేవనెత్తుతున్నారు. సభకు కొత్తైనా ఎంతో పరిణతిచెందిన నేతగా, సందర్భానుసారంగా మాట్లాడుతున్నారు. సుదీర్ఘకాలం రాజకీయానుభవం గల నేతలకు తగిన రీతిలో సమాధానం చెబుతున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్న అధికారపార్టీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
తమని ప్రశ్నించకుండా ఉండేందుకు ప్రజాసమస్యలపై దృష్టిసారించకుండా సభలో అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ ప్రస్తుత సమస్యలను ప్రస్థావించినా సమాధానం చెప్పలేని స్థితిలో పార్టీకి గానీ, అతనికి గానీ సంబంధంలేని పాత విషయాలను లేవనెత్తి సభ సమయాన్ని వృధా చేస్తున్నారు. అయినా జగన్ ఎంతో అనుభవం గల నేత మాదిరిగా తగిన రీతిలో స్పందిస్తున్నారు. సమాధానం చెబుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. అధికారపక్షాన్ని నిలదీస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అధికార పక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని గళం విప్పి గర్జిస్తున్నారు. మరో ప్రతిపక్షపార్టీ లేనందున ఆ భారం అంతా వైఎస్ జగన్పైనే పడింది. ప్రస్తుత పరిస్థితులలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగాలంటే సభలో స్థానం సంపాదించలేని పార్టీలు కూడా వైఎస్ఆర్సిపి చేపట్టే ఆందోళనలకు సభ బయట మద్దతు పలకవలసిన అవసరం ఎంతైనా ఉంది.
- శిసూర్య