వయాగ్రా వాడితే కళ్లు పోతాయి!
శృంగార సమస్యలకు ఏకైక పరిష్కారంగా వచ్చిన అద్భుతమైన మందు వయాగ్రా. కానీ, ఇది ఎక్కువ కాలం వాడితే.. కంటి చూపు దెబ్బతింటుందట. ఈ విషయం తాజా పరిశోధనలలో వెల్లడైంది. అయితే ఇది అందరికీ కాదు. ఒక రకమైన మ్యుటేషన్ ఉన్నవాళ్లకు మాత్రమే ఇలా జరుగుతుందట. రెటీనా నుంచి మెదడుకు కాంతి సంకేతాలను పంపే ఒక ఎంజైమును సిల్డెనాఫిల్ అడ్డుకుంటుంది. వయాగ్రాను మరీ ఎక్కువ డోసుల్లో ఉపయోగించేవాళ్లకు కంటి పరమైన సమస్యలు రావచ్చన్న విషయం ఇంతకుముందు ఔషధ ప్రయోగాలలో కూడా తేలింది.
బాగా ఎక్కువ కాంతిని చూడలేకపోవడం, చూపు మందగించడం, రంగులు కూడా వేరేగా కనపడటం లాంటి సమస్యలు వీళ్లకు రావచ్చని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్కు చెందిన లీసా నివిజన్ స్మిత్ తెలిపారు. రెటినైటిస్ పిగ్మెంటోసా అనే కంటి వ్యాధికి సంబంధించి మ్యుటెంట్ జన్యువు కాపీ ఒక్కటే ఉన్నవాళ్ల విషయంలోనే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామన్నారు. ఇందుకోసం ముందుగా ఇలా జన్యువు ఒకే కాపీ ఉన్న ఎలుకలకు సిల్డెనాఫిల్ మందు ఇచ్చి చూశారు. ఆ ఎలుకకు చూపు మందగించడం స్పష్టంగా తేలింది. రెటినైటిస్ పిగ్మెంటోసా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. దీనివల్ల చివరకు అంధత్వం వస్తుంది.