ఆ నేమ్.. ఫేమ్ ఎందుకు? | why crazy on those types of names | Sakshi
Sakshi News home page

ఆ నేమ్.. ఫేమ్ ఎందుకు?

Published Fri, Nov 14 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

ఆ నేమ్.. ఫేమ్ ఎందుకు?

ఆ నేమ్.. ఫేమ్ ఎందుకు?

సిటీలో కొన్ని ప్రాంతాల పేర్లు చూస్తే కాస్త ఆశ్చర్యం వేస్తుంటుంది. వాటికీ పేర్లు ఎందుకు పెట్టారా అని! కానీ తరచి చూస్తే అందులోనూ ఎంతో ఔచిత్యం, బోలెడంత లాజిక్కూ ఉన్నాయని నాకు అర్థమైంది.
 
నా చిన్నప్పుడు మా అమ్మ ఓ కథ చెప్పేది. అది మరో అమ్మ కథ. ఆ కథలో సదరు మాతృమూర్తి తన పిల్లలకు చాలా పాత పేర్లూ, పిలవడానికి ఇబ్బందిగా ఉండే పేర్లూ పెడుతుందట. ఎందుకంటే ఆ అమ్మకు పుట్టిన పిల్లలంతా చనిపోతూ ఉండబట్టి అలాంటి పేర్లు ఎంచుకునేదట. ఏ తల్లీ - ఏ బిడ్డకూ పెట్టడానికి ఇష్టపడని ఆ పేర్ల వల్ల సదరు పిల్లల్ని మిగతా చిన్నారులంతా ఎగతాళి చేసేవారట. అయినా సరే... తన పిల్లలు బతికితే చాలనే బలమైన కోరికతో ఇష్టం లేకపోయినా ఇబ్బందికరమైన ఆ పేర్లు పెట్టిందట. ఆ పేర్లే... పెంటయ్య, పిచ్చయ్య. దాంతో ఆ పిల్లలకు తగలాల్సిన దిష్టి అంతా ఆ పేర్లకు తగిలి... ఆ పిల్లలు బాగా ఎదుగుతారని ఆ తల్లి నమ్మకం.

చిత్రమేమిటంటే... ఆ పిల్లలే పెద్దయ్యాక చాలా గొప్పవాళ్లూ, ఆ ఊరిపెద్దలూ అయ్యారట. ఆ ఊరి ప్రజలంతా వాళ్ల పేర్లను ఎంతో గౌరవంతో నోరారా పిలిచేవారట. ఆ తర్వాత పుట్టిన పిల్లలందరికీ మాత్రం చాలా అందమైన పేర్లు పెట్టిందట ఆ తల్లి. ఇక మన హైదరాబాద్ నగరమనే మాతృమూర్తికీ ఇలాంటి సెంటిమెంట్ ఏదైనా ఉందేమోనన్న డౌట్ నాది! ఎందుకంటే... ఇక్కడి కొన్ని ప్రాంతాల పేర్లు చాలా చిత్రం, పరమ విచిత్రం.

ఉదాహరణకు చూడండి... చత్తాబజార్. దాని నిజమైన అర్థం ఏమిటంటే ‘ఒకే కప్పు కింద ఉండే పెద్ద మార్కెట్’ అని!. కానీ ఆ అర్థం ఎంతమందికి తెలుసు? అక్కడ మంగళకరమైన శుభకార్యాలకు ఇన్విటేషన్స్ అమ్మే ఆహ్వానపత్రికల షాపులే ఎక్కువ. అలాగే ‘కవాడీగూడ’ కూడా! కవాడీ అంటే ‘వ్యర్థం, చెత్త’ అనే అర్థం. కానీ ఈరోజు అలనాటి పాతకాలపు ‘వైస్రాయ్’ అంతటి అత్యంత అధునాతనమైన అంతర్జాతీయ  ఐదునక్షత్రాల హోటలు, ఎంతో అందమైన వీధులూ అక్కడే ఉన్నాయి.

చప్పున చటుక్కుమంటూ చర్మంలోకి సూది దింపినట్టు కుట్టేసి, రక్తాన్ని పీల్చేసే దోమల పేరిట ఈలోకంలో ఎవడైనా ఓ ఏరియా పేరు పెట్టుంటాడా? కానీ మన హైదరాబాదీయులు తమ విశాల హృదయంతో ‘దోమలగూడ’ అనే పేరు పెట్టుకున్నారు. అదెంత అధునాతనమైన ప్రాంతమంటే... ట్యాంక్‌బండ్ పక్కనే ఉండే కొన్ని పోష్ కాలనీల్లో  చాలామంది కీలకమైన వ్యక్తులు ‘దోమలుదూరని’ భవంతుల్లో నివసిస్తుంటారక్కడ.  ఇక ‘బొగ్గులకుంట’ విషయానికి వద్దాం. వేమన చెప్పిన ప్రతిమాటా వేదమే. కానీ... ఒక్క వీధి పేరు విషయంలో మాత్రం ఒక్క మినహాయింపు ఉందేమో అనిపిస్తుంటుంది.

‘బొగ్గు పాల కడుగ పోవునా మలినంబు’ అన్నాడాయన. నిజమైన బొగ్గు విషయంలో అది వాస్తవమేమోగానీ... ‘బొగ్గులకుంట’ ఏరియా మాటకొస్తే మాత్రం అది పూర్తిగా అబద్ధం. పేరుకు బొగ్గులకుంటేగానీ... కోఠీ-ఆబిడ్స్ మధ్యన ఉన్న కీలకమైన ఈ ప్రాంతంలో... మనసులను తెల్లగా మార్చగల మహావిద్యాలయాలూ, మసిబొగ్గు లాంటి హృదయాలనూ మేలిమిముత్యాల్లా మెరిసేలా ప్రక్షాళన చేయగల తల్లిపాల బ్యాంకులతో సేవలందించే పెద్దాసుపత్రులూ ఉన్నాయి.

‘మరెందుకిలాంటి పేర్లూ..?’ అని కాస్త తరచి ఆలోచించా. నగరమాతల్లి తన అభివృద్ధికీ, తన విస్తరణకూ, విరాజిల్లుతూ ఉండే తన తీరుతెన్నులకూ ఎక్కడ దిష్టి తగులుతుందో అన్న బెంగతోనో, ఏమో... ఇలాంటి కొన్ని ప్రాంతాలకు అలాంటి విచిత్రమైన పేర్లు ఉండేలా చూసిందేమో అన్నది ఓ అభిప్రాయం. ఈ నగరమాత కూడా అచ్చం పిచ్చయ్య, పెంటయ్యల అమ్మలాంటిదే కదూ!!

యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement