పండిట్ విశ్వమోహన్ భట్
ప్రసిద్ధ వాద్య సంగీతకారుడు
పండిట్ విశ్వమోహన్ భట్.. వాద్యసంగీతంలో తియ్యని స్వరం! మోహనవీణతో శ్రోతలను సమ్మోహనపరచడం ఆయన నైజం!. అందుకే వరల్డ్ మ్యూజిక్ గ్రామీతో గ్రాండ్‌గా సత్కరించింది!. ‘పంచతత్వ’ సంగీత కచేరిలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆయన సిటీప్లస్‌తో పంచుకున్న మాటలు..
నిజానికి హవాయిన్ గిటార్ పాశ్చాత్య సంగీత పరికరం. దానికి అదనంగా 14 తీగలను చేర్చి మొత్తం ఇరవై తీగలతో ‘మోహనవీణ’గా ఇండియనైజ్ చేశాను. 1967 నుంచి మోహనవీణ సంగీతాన్ని వినిపించడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు 81 దేశాల్లో ఈ వీణ మోగింది. నా ఇద్దరు కొడుకులు సలీల్ భట్, సౌరభ్ భట్.. సంగీతకారులే. సలీల్.. ‘సాత్విక్‌వీణ’ను కనిపెట్టి నా వారసత్వాన్ని నిలబెట్టాడు.
సంగీత ప్రస్థానం..
300 ఏళ్లుగా సంగీత నేపథ్యం వారసత్వంగా కొనసాగుతున్న కుటుంబం మాది. ఇంకో విషయం.. మేము తెలంగాణవాళ్లం. మా ఇంటిపేరు తెలంగ్. మా పూర్వీకులు జైపూర్ మహారాజా ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి ఆయన ఆస్థానంలో సంగీత విద్వాంసులుగా చేరారు. నాన్న మన్మోహన్ భట్, అమ్మ చంద్రకళా భట్.. ఇద్దరూ సంగీత విద్వాంసులే. 1983లో పండిట్ రవిశంకర్ శిష్యుడినయ్యాను. ఆయన దగ్గర ఒక్క సంగీతాన్నే కాదు క్రమశిక్షణ, నిబద్ధత, పంక్చువాలిటీ, డెడికేషన్.. ఇలా ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఆయన చక్కటి హాస్యచతురుడు. గురూజీ పండిట్ రవిశంకర్ తర్వాత గ్రామీ అవార్డ్ అందుకున్న ఇండియన్ మ్యూజీషియన్‌ని నేనే. ఈ విషయంలో గురువు గారి పరంపరను నిలబెట్టినందుకు ఆనందంగా ఉంటుంది.
హిందుస్థానీ సంగీతంపైనే ఏకాగ్రత..
నా ఏకాగ్రత అంతా హిందుస్థానీ సంగీతం మీదే అయినా.. 39 ఫ్యూజన్ ఆల్బమ్స్ అమెరికాలో, 60 వరకు ఇక్కడా చేశాను. ఎక్కువగా వాయిద్య సంగీత కచేరీలే ఇస్తున్నా..మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తున్నా. మ్యూజిక్ ఫర్ రిలాక్సేషన్, మ్యూజిక్ ఫర్ సోల్, సెలబ్రేషన్స్ ఆఫ్ లవ్.. ఈ మూడు నా కంపోజిషన్సే! కాళిదాసు రచించిన ‘మేఘధూతం’ కావ్యానికి స్వరకల్పన చేశాను. హరిహరన్, కవితా కృష్ణమూర్తి వాటిని ఆలపించారు. దీనికన్నా ముందే జయదేవుని గీతగోవిందాన్నీ స్వరబద్ధం చేశాను. ఇటీవలే ‘ఖామోషియా’ అనే గజల్ ఆల్బమ్ చేశాను.
ఆదరణ తగ్గలేదు..
మన సంస్కృతికి చిహ్నం మన శాస్త్రీయ సంగీతం. ఎన్ని ఆధునిక ఒరవడులు వచ్చినా శాస్త్రీయ సంగీతాన్ని కదల్చలేవు. కాకపోతే సినిమా సంగీతం వంటివి సామాన్యులను త్వరగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే.. పాటలోని స్వరాల కన్నా ఆ నేపథ్యాన్ని ప్రెజెంట్ చేసే దృశ్యమే మనసుపై ముద్రవేస్తుంది. ఉదాహరణకు దీపికా పదుకొనె పాట వింటే పాటలోని సాహిత్యం, సంగీతం కన్నా దీపికా పదుకొనె రూపమే శ్రోత మెదడులో కదలాడుతుంటుంది. సినిమా సంగీతానిది అలాంటి ఆకర్షణ మరి.
సరస్వతి ఆరాధన..
సంగీతం భగవంతుడి భాష. మనిషి మానసిక వికాసానికి ఆ దేవుడు మనకు ప్రసాదించిన వరమిది. మ్యూజిక్ మనసుని, శరీరాన్ని, ఆత్మను స్వచ్ఛపరుస్తుంది, స్వాంతననిస్తుంది. మన శాస్త్రీయ సంగీతం ఆధ్యాత్మికం. ధ్యానానికి అనుగుణమైంది. పరమాత్మతో కనెక్ట్ చేస్తుంది. నా వరకు నాకు దేవుడి పూజ అంటే.. నా సంగీత సాధనే. సరస్వతీ మాత ఆరాధనే!
మెచ్యూర్డ్‌గా ఉంటారు..
హైదరాబాద్ రావడమంటే సొంతింటికి వచ్చినట్టే. ఇక్కడి శ్రోతలకు మంచి అభిరుచి ఉంది. కచేరీ చేస్తున్నప్పుడు చప్పట్లు, ఈలలతో కళాకారుడిని డిస్టర్బ్ చేయరు. మెచ్యూర్డ్‌గా ఉంటారు. దే లైకిట్ ఇన్ సోబర్ వే అండ్ దే గివ్ లిబర్టీ టు మ్యుజీషియన్ టు పెర్‌ఫార్మ్ ద బెస్ట్! ఎక్సలెంట్ సిటీ. ఔత్సాహిక కళాకారులకు ఇచ్చే సూచన ఒకటే.. సంగీతాన్ని కళగానే చూడండి. కళగానే అభ్యసించండి. దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవద్దు.
‘పంచతత్వ’ పేరుతో సాగిన సుస్వరాల సంగీత జల్లులతో శనివారం శిల్పకళావేదిక తడిసి ముద్దయింది. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం, విశ్వమోహన్ భట్ మోహనవీణ, సెల్వగణేష్ కంజీర, శుభాంకర్ బెనర్జీ తబల, శ్రీధర్ పార్ధసారథి మృదంగం.. మంత్రముగ్ధుల్ని చేశాయి.
- సరస్వతి రమ