
నువ్వు-నేను
అమ్మాయి స్వాతి.. చిత్రకారిణి, అబ్బాయి.. విజయ్.. అప్లయ్డ్ ఆర్ట్‌లో దిట్ట!
విజయ్, స్వాతి
"great marriage is not when the "perfect couple" comes together. It is when an imperfect couple learns to enjoy their differences' అని డేవ్ మ్యూరర్ చెప్పిన మాటకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఈ జంట! అమ్మాయి స్వాతి.. చిత్రకారిణి, అబ్బాయి.. విజయ్.. అప్లయ్డ్ ఆర్ట్‌లో దిట్ట! పెళ్లికి ముందు అనుకున్న సామ్యాలు పెళ్లి తర్వాత భేదాలుగా కనిపించినా.. వాటినే తమను కలిపి ఉంచే వారధిగా మలచుకున్న అనుబంధం వీళ్లది.
ఆ ఆలుమగల ముచ్చట్లివి..
‘మసాబ్‌ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్‌లో మేమిద్దరం బ్యాచ్‌మేట్స్‌మి. ఏడాది పరిచయం ప్లస్ స్నేహం తర్వాత ఇద్దరికీ చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉందని తెలిసింది’ అని తమ లవ్‌స్టోరీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లింది స్వాతి. ‘పెళ్లి ప్రపోజల్ పెట్టింది తనే’ అన్నాడు విజయ్‌కుమార్. ‘అలా చేసింది ఆయనే’ అందుకుంది స్వాతి వెంటనే. ఇలా మూడుముళ్లతో ఇద్దరూ ఒక్కటయ్యారు.
ఏకాభిప్రాయం కొనసాగుతుందా?
‘లేదు. పెళ్లికి ముందు ఎంత సిమిలారిటీస్ ఉన్నాయనుకున్నామో పెళ్లి తర్వాత అంత రివర్స్ అని తేలింది’ అన్నది విజయ్ వైపు చూస్తూ స్వాతి. ‘ఈ ఆరేళ్లుగా భిన్నత్వంలో ఏకత్వం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం’ నవ్వుతూ విజయ్. ‘నిజమే.. ఇలా డిఫరెంట్‌గా ఉండడం వల్లే మా మధ్య ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగ్ అయింది’ ఒప్పుకుంటుంది స్వాతి.
ఏ విషయాల్లో డిఫర్ అవుతారు?
‘మా ఇద్దరికీ ప్రొషెషనల్ లైఫే.. అసలు పెళ్లికి ముందు నుంచే కలసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. ఇల్లు, డబ్బు, నగలు, షాపింగ్ ఇందులో ఏకాభిప్రాయమే. మేం కలిసుండేది, గొడవపడేది ప్రొఫెషనల్ లైఫ్‌లోనే’ అన్న స్వాతి మాటలను కంటిన్యూ చేస్తూ ‘తను చాలా కూల్ పర్సన్. నేనేమో అగ్రెసివ్‌గా.. డైనమిక్‌గా ఉంటాను. ఇదే గొడవకు మూలం అవుతుంద’ని విజయ్ చెప్పాడు. ‘ఆర్ట్‌కి సంబంధించి సామాజిక అంశాలనే ఎంచుకుంటాం. ఇద్దరి ఇంట్రెస్ట్ ఒక్కటే ఎటొచ్చి ప్రెజెంటేషన్‌లో తేడా. తనేమో కాన్సెప్ట్ మీద ఆలోచిస్తే నేను ప్రాసెస్ మీద వర్క్ చేస్తాను. ఏం చూశామో ఉన్నది ఉన్నట్టు అలాగే ప్రెజెంట్ చేయాలంటాడు. కాస్త సాఫ్ట్‌గా ప్రెజెంట్ చేయాలంటాను నేను. ఇదే గొడవలకు మూలం అవుతుంది’ అని స్వాతి చెప్తుంటే.. ‘లేదులే.. తనకి భయం ఎక్కువ. దేన్నయినా కాంప్లికేటెడ్ చేసుకోవద్దు అనుకునే నైజం’అని విజయ్ ముక్తాయింపు ఇస్తుంటే ‘అవును మరి.. ఏమైనా తర్వాత చూసుకుందాం.. ముందు అనుకున్నది చేసేద్దామనే దూకుడు, ధైర్యం నాకు లేదు. తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరం సఫర్ కావాల్సిందే కదా...’అని స్వాతి సమర్థించుకుంటుంటే ‘అందుకే వెనక్కి లాగుతూ ఉంటుంది’ అన్నాడు విజయ్.
సముదాయింపు ఎలా..
‘చర్చించుకునే’ అన్నారిద్దరూ ఒకేసారి. ‘వర్క్ అవ్వాలి కాబట్టి త్వరగానే కన్విన్స్ అవుతాం’ చెప్పాడు విజయ్. ‘వర్క్ విషయంలో నాదే పైచేయి. తనే కన్విన్స్ అవుతాడు’ అంది స్వాతి విజయగర్వంతో. ‘ఇద్దరి శ్రేయస్సు ఆలోచిస్తుంది. కాబట్టి తను చెప్పిందాట్లో మంచే ఉంటుంది’ ఒప్పుకున్నాడు విజయ్. ‘ఒక్కోసారి తన ఉత్సాహం మీద నీళ్లు చల్లుతున్నానేమో అనిపిస్తుంటుంది. పెయింటింగ్ ఫీల్డ్‌లో విజయ్ ఉండి ఉంటే ఇప్పటికి ఎక్కడో ఉండేవాడు’ నిజాయితీగా చెప్తుంది స్వాతి. ‘మేమిద్దరం విడివిడిగా ఎటూ వెళ్లిన సందర్భాలు లేవు. ఎప్పుడో ఓసారి.. అలా ఓ రెండు గంటలు ఒంటరిగా ఉండాల్సి వస్తే విజయ్ ఉంటే బాగుండు అనుకుంటాను’ అని స్వాతి అంటుంటే ‘అసలు స్వాతి లేనిదే నేను ఎటూ వెళ్లను’ చెప్తాడు విజయ్.
నచ్చినవి..
‘స్వాతి చాలా హానెస్ట్. క్లిస్టర్ క్లియర్ క్లారిటీ ఉంటుంది. నేనలా ఉండను’ విజయ్. ‘నేను పిరికిదాన్ని’స్వాతి. ‘ప్రతి విషయంలో నన్ను కరెక్ట్ చేస్తుందనే భరోసా.. డిపెండెన్సీ నాది’ అని విజయ్ అంటుంటే ‘ఏమైనా చూసుకుంటాడనే ధైర్యం నాకుంటుంది’ అని స్వాతి.. ఇద్దరూ తమ అనుబంధం విలువ చెప్పకనే చెప్పారు. భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని చాటారు. ..:: సరస్వతి రమ