
రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
రైతులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఈ రోజు శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు.
రైతులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఈ రోజు శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులు తీసుకున్న పంట రుణాలు, బంగారంపై తీసుకున్న రుణాలు చెప్పమని అడిగారు. జిల్లాల వారీగా వివరాలు కోరారు. మొత్తం రైతుల రుణాలు 84 వేల కోట్ల రూపాయలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం తెలిపింది. డ్వాక్రా రుణాలు 14వేల కోట్ల రూపాయలని ఎస్ఎల్బిసి తెలిపింది. మొత్తం కలిపి అధికారిక లెక్కల ప్రకారమే 98 వేల కోట్ల రూపాయల రుణాలు ఉంటే, కేవలం 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారని ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. ప్రతిపక్ష నేత అడిగిన దేనికీ ప్రభుత్వం సరైన రీతిలో సమాదానం చెప్పలేకపోయింది. .
రుణాల మాఫీపై ఆంక్షలు, పరిమితులు విధిస్తూ జీఓ జారీ చేశారని జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. విధించిన పరిమితులు ప్రకారమైనా ఎంత రుణం మాఫీ చేస్తారు? ఎప్పటి లోగా మాఫీ చేస్తారు? అని జగన్ ప్రశ్నించారు. హామీలు నెరవేర్చలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు.
2013, డిసెంబరు 31 వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. 2014 జనవరి తరువాత తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదన్నారు. డిసెంబరు 31కి ముందు తీసుకున్న రుణబకాయిలు ఇప్పటికే చెల్లించినా రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. 42 లక్షల మంది రైతులు రుణమాఫీ కింద లబ్ది పొందుతారని మంత్రి తెలిపారు.
రుణమాఫీపై ఇప్పటికే ప్రభుత్వం జిఓ జారీ చేసిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. రైతు రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు. బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించినంత మాత్రాన రుణమాపీ అమలు చేయబోమని కాదని యనమల వివరణ ఇచ్చారు.
శాసనసభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోవడంతో వైఎస్ జగన్ బాధ్యయుతమైన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ కమిటీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలను వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ప్రభుత్వం ఏ విధంగా తిలోదకాలు ఇచ్చిందో సవివరంగా లెక్కలతో సహా తెలిపారు. రైతలు రుణాల దగ్గర నుంచి ఫీజు రియింబర్స్మెంట్ వరకు ఇచ్చిన హామీలకు, కేటాయించిన కేటాయింపులకు ఎంత వ్యత్యాసం ఉందో వివరించారు.
- శిసూర్య